మోడీ పుట్టి ముంచబోయేది...‘వీళ్లేనా..’!?

Vasishta

మోదీ ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన వ్యక్తుల టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇంట గెలవడమే కాదు.. రచ్చ గెలవడంలోనూ ఆయన ముందుంటున్నారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. రచ్చ గెలుస్తున్న మోదీ.. ఇంట గెలుపును నిలబెట్టుకోలేకపోతున్నారు. వరుస పరాభవాలు మోదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.


మోదీపై కక్షగట్టిన విపక్షాలు ఎలాగైనా ఆయన్ను పదవి నుంచి దించేయాలని కంకణం కట్టుకున్నాయి. వారికి పలు అంశాలు కలసివస్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైన గావ్ బంద్ ఇలాంటిదే. ఇది విపక్షాలకు పెద్ద అస్త్రంలా తయారైంది. దేశవ్యాప్తంగా కడుపు మండిన అన్నదాతలు కదం తొక్కుతున్నారు. 130 రైతు సంఘాలు ఒక్కటై రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా గావ్ బంద్ నిర్వహిస్తున్నాయి. గ్రామాల నుంచి పట్టణాలకు పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాల సరఫరా ఆపేశాయి. మార్కెట్లకు తరలించాల్సిన వాటిని రోడ్లపై పారబోస్తూ నిరసనలకు దిగుతున్నాయి. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రల్లో గావ్ బంద్ వినియోగార్లకు చుక్కలు చూపిస్తోంది. దేశవ్యాప్తంగా రైతురుణమాఫీ ప్రకటించాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని వెంటనే అమలు చేయాలంటూ మొదలైన నిరసనలు కొనసాగనున్నాయి.


రైతులు చేపట్టిన బంద్ కు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది . మహారాష్ట్ర రైతులు సైతం మద్దతు పలికారు. ఆయా రాష్ట్రాల్లో పదిరోజులపాటు పట్టణాలు, నగరాలకు కూరగాయలు సరఫరా చేయబోమని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ తేల్చి చెప్పేసింది. ఈ పదిరోజులూ పట్టణాలకు పల్లెలు సహాయనిరాకరణ ప్రకటించాయి. వ్యవసాయోత్పత్తులు కావాల్సిన వాళ్లు గ్రామాలకే వచ్చి కొనుక్కోవాలని, అప్పుడే తమ బాధలు పట్టణవాసులకు తెలుస్తాయని భీష్మించుకున్నారు.. గతేడాది జూన్ 6 న మధ్యప్రదేశ్ లోని మందసౌర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై పోలీసు కాల్పులు జరిపారు. ఆ దుర్ఘటనలో ఏడుగురు రైతులు చనిపోయారు. ఆ విషాదానికి నిరసనగా మధ్యప్రదేశ్ లో రైతులు జూన్ 10న బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి వరకూ పట్టణాలకు పల్లె ఉత్పత్తులు వేటినీ అందించేది లేదని తేల్చి చెప్పేశారు. పట్టణాలు, నగరాలకు రైతుఉత్పత్తుల రాక తగ్గిపోవటంతో., కొరత ప్రభావం రాజధాని ఢిల్లీతో సహా అనేక ప్రాంతాలపై పడనుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేక ధరలు చుక్కలనంటే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గావ్ బంద్ ప్రభావం హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలపై మొదలైంది. ఉల్లి, టమోటాల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీల్లో వ్యాపారులు – వినియోగదారులు అల్లాడుతున్నారు.

 

రైతులు చేపట్టిన దేశవ్యాప్త ఆందోళన రాజకీయ ప్రేరితమైందిగా ఎన్డీయే ప్రభుత్వం అనుమానిస్తోంది. కాంగ్రెస్ కావాలనే చేయిస్తోందని బీజేపీ మండిపడుతోంది. రైతుల ఆవేదనను సైతం రాజకీయంగా మార్చుకుంటున్నారని విమర్శిస్తోంది. రాజకీయాలు ఎలా ఉన్నా.. ఉత్తరాది నగరాల్లో సామాన్యులు మాత్రం కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరఫరా తగ్గవచ్చన్న వార్తలతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రచారం కోసమే రైతులు రోడ్డెక్కుతున్నారంటూ మోదీ కేబినెట్ సహచరులు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత అగ్గి రాజేస్తున్నాయి. కడుపు మండి రోడ్డెక్కితే ఇలా కామెంట్స్ చేయడం ఎంతవరకూ సబబని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి రైతుల ఆగ్రహం మోదీ పుట్టి ముంచుతుందేమోననే ఆందోళన ఎన్డీయే శ్రేణుల్లో మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: