అఖిలప్రియది అలకా..? బెదిరింపా..?

Vasishta

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం కర్నూలు జిల్లాలో నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలు దాదాపు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు. దీంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అఖిలప్రియ ఎందుకిలా చేస్తోందనది ఇప్పుడు టీడీపీ శ్రేణులకు అంతుబట్టడం లేదు.


          ఔనన్నా కాదన్నా భూమా అఖిలప్రియపైన, వారి కుటుంబంపైనా సింపథీ ఉంది. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఆ పిల్లలు.. తమ కుటుంబాన్ని నమ్ముకున్న శ్రేణులకు, అనుచరులకు అండగా నిలిచారు. తల్లీతండ్రీ లేకపోయినా తామున్నామంటూ భరోసా ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే అటు ఆళ్లగడ్డలో, ఇటు నంద్యాలలో పార్టీకి, అనుచరులకు అండగా ఉంటున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వారికి మద్దతుగా నిలిచారు. భూమా నాగిరెడ్డి మరణించగానే అఖిలప్రియను కేబినెట్ లోకి తీసుకుని తానున్నానంటూ భరోసా ఇచ్చారు.


          నంద్యాల ఉపఎన్నిక సీటు తమకే ఇవ్వాలని పట్టుబట్టడంతో శిల్పా సోదరులను వదులుకుని మరీ భూమా కుటుంబానికి సీటిచ్చారు చంద్రబాబు. అఖిలప్రియ టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె నేతృత్వంలో ఇటీవలికాలంలో రెండు పెద్ద ప్రమదాలు జరిగాయి. అయినా బాధ్యత వహించి రాజీనామా చేయాలని చంద్రబాబు అడగలేదు. పైగా ఆమెకు మరింత భరోసా కల్పించారు. జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు. ఏవీ సుబ్బారెడ్డితో విభేదాలున్నా పట్టించుకోకుండా సర్దుకుపోవాలని సూచించారు. కష్టకాలంలో ఉన్న భూమా కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతోనే బాబు తప్పులను సైతం వదిలేస్తున్నారు.


కర్నూలు జిల్లాలో నవనిర్మాణ దీక్ష సమాచారాన్ని ప్రోటోకాల్ ప్రకారం అఖిలప్రియకు కూడా చేరవేశారు. అయితే తనకు అనారోగ్యంగా ఉందని, సమావేశానికి రాలేనని చెప్పిందట. పైగా సీఎం పేషీ నుంచి పదిసార్లు కాల్ వెళ్తేగానీ స్పందించలేదనేది టాక్. అయితే తనకు అసంతృప్తి ఏమీ లేదనీ, కేవలం అనారోగ్యం కారణంగానే రాలేకపోతున్నానని స్పష్టం చేసిందట. పెళ్లి పనుల నిమిత్తం బయట ఎక్కువగా తిరుగుతున్నానని, ఆరోగ్యం సరిగా లేదని చెప్పుకొచ్చిందట. దీంతో వాళ్లు కూడా కామ్ అయిపోయారు.


          అయితే.. ఇంత చేస్తున్నా కూడా అఖిలప్రియలో ఎక్కడో అసంతృప్తి ఉందని టీడీపీ పసిగట్టింది. చిన్న చిన్న విషయాలకు కూడా అలగడం, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకోవడం.. లాంటి చేష్టలు ఆ పార్టీనేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నట్టు సమాచారం. విషయాన్ని సరిగా కన్వే చేయకుండా చీటికిమాటికి అలగడం అఖిలప్రియకు పెద్ద మైనస్ గా మారిందని సమాచారం. ఏ విషయాన్నీ సూటిగా చెప్పకపోవడం, తర్వాత ఎప్పుడో ఎవరి ద్వారానో విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయడం చేస్తోందట.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: