జగన్ మళ్లీ మళ్లీ.. ఆ తప్పే చేస్తున్నారా...!?

Vasishta

ప్రజా సంకల్పయాత్ర జగన్ లో కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. మొదట్లో పెద్దగా జనాలు రాలేదనే ప్రచారం సాగినా ఆ తర్వాత పుంజుకుంది. ఇప్పుడు జనం పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. అయితే ఎక్కడో ఏదో అనుమానం ఆ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. ఇంతకూ ఏంటా అనుమానం..?


జగన్ పొలిటికల్ ప్లాన్స్ వేయడంలో ఫెయిలవుతున్నారనే అనుమానాలు ఆ పార్టీలోనే కాక విశ్లేషకుల్లో కూడా బలంగా విస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా నోరు మెదపకపోవడం.. రానున్న ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై ఇంకా క్లారిటీ రాకపోవడం.. ఇవన్నీ జగన్ కు మైనస్ లుగా మారతాయని ప్రచారం జరుగుతోంది.  జగన్ వైఖరి ఇలాగే కొనసాగితే.. 2019లో కూడా 2014 పరిస్థితే రిపీట్ అవుతుందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.


వైసీపీ అధినేత జగన్ గత కొన్ని రోజులుగా ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంలో విఫలమవుతున్నారనే మాటలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రిత తెర మీదకు వచ్చిన ప్రత్యేక హోదా విషయం జగన్ కు కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికి మద్దతిస్తామని జగన్ ప్రకటించినా.. హోదాపై నోరుమెదపని బీజేపీని మాత్రం విమర్శించడం లేదు. దీంతో గత ఎన్నికల్లో మాదిరే చివరి వరకు పై చేయిగా కనిపించినా.. ఆఖరి నిమషంలో దెబ్బ తింటామేమోనన్న భయం వైసీపీ శ్రేణులను వెంటాడుతోంది.


ప్రత్యేక హోదాపై పార్టీలకు అతీతంగా నేతలందరూ బీజేపీపై ముప్పేట దాడి చేస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబును విమర్శించడంతోనే సరిపెడుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతోంది. దీంతో అధికార టీడీపీ.. వైసీపీపై విమర్శల దాడి పెంచింది. వైసీపీ.. బీజేపీతో కుమ్మక్కైందని పదే పదే చెబుతోంది. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశామన్న వైసీపీ నేతలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని.. టీడీపీ నేతలు విమర్శల దాడి చేస్తున్నారు.


టీడీపీ విమర్శలకు వైసీపీ దీటుగానే సమాధానం చెబుతోంది. హోదా కోసం అవిశ్వాసం పెట్టడమంటే బీజేపీని ప్రశ్నించినట్టు కాదా అని వైసీపీ వాదిస్తోంది. రాజకీయ అవసరాల కోసం తాము మాట్లాడాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. బీజేపీపై జగన్ అనుసరిస్తున్న వైఖరితో పార్టీకి నష్టం చేకూరుతుందన్న వాదన.. ఆ పార్టీలోనూ వినిపిస్తోంది. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే మద్దతు అన్న జగన్ ప్రకటన నష్టం కలిగించేదిగా కనిపిస్తోందంటున్నారు. ఒకవేళ బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తే.. వైసీపీకి ఇంతకాలం బలంగా ఉన్న ఎస్సీ, ఎష్టీ, బీసీ, మైనారిటీలు దూరమవుతారన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. రానున్నది ఎన్నికల కాలం. మరో ఏడాది కూడా సమయం లేదు.  మరి ఇప్పటికైనా జగన్.. తన రాజకీయ వ్యూహాలకు ఎలా పదును పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: