కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు : ప్రభుత్వం మనుగడ ?

అసహజంగా ఏర్పడ్డ ప్రభుత్వాలు మనటం కూడా అతి కష్టమే. కర్ణాటక రాష్ట్రంలో అతి తక్కువ శాసనసభా స్థానాలు గెలిచి తాహతుకు మించి ముఖ్యమంత్రి పదవి కోరుకొన్న జనతాదళ్‌ సెక్యులర్‌ కాంగ్రెస్ స్వార్ధ ప్రయోజనాలు సిద్దించటం కోసం దానితో కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి ముచ్చెమటలు పట్టించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌-జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీల్లో చీలిక వచ్చినట్లు బెంగళూర్ లో రిపోర్టులు వస్తున్నాయి. 


ప్రభుత్వం కొలువుదీరి పాతిక రోజులు కూడా కాకుండానే, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి తిరుగుబాటు ముప్పు మొద లైంది. ఇది ఏకంగా ఆయన సీటుకు ఎసరు పెట్టే స్థాయికి చేరుతుండటం ఆ రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ పరిణామం తనకు కూడా తెలుసునని సీఎం కుమారస్వామి ప్రకటించడం గమనార్హం!


అనేక ట్విస్టుల మధ్య మంత్రివర్గ బెర్తులను ఓ కొలిక్కి తెచ్చి 25 మందితో నూతన మంత్రివర్గాన్ని కుమారస్వామి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 14 మంది కాంగ్రెస్ సభ్యులకు - తొమ్మిదిమంది జేడీఎస్ సభ్యులకు - బీఎస్పీ - కేపీజీపీ నుంచి ఒక్కొక్కరికీ మంత్రివర్గంలో చోటుదక్కింది. మాజీ ప్రధాని దేవెగౌడ పెద్దకుమారుడు రేవణ్ణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ - మహిళా ఎమ్మెల్యే జయమాల(కాంగ్రెస్) ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. 


నేడు 12మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జెడిఎస్ కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటాను ఎగురవేసినట్లు తెలిసింది. దీంతో తిరుగు బాటు ఎమ్మెల్యేలను సముదాయించేందుకు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర రంగంలోకి దిగారు. అయితే, ఆయన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో జరిపిన చర్చలు సైతం పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో తిరుగుబాటు బృందంలో చేరు తున్న ఎమ్మెల్యేల సంఖ్యక్రమంగా పెరుగుతోంది. సీనియర్‌ ఎమ్మెల్యేలైన ఎం బీ పాటిల్‌, రోషన్‌ బేగ్‌, రామలింగారెడ్డి, కృష్ణప్ప, దినేష్ గుండురావు, ఈశ్వర్‌ ఖండ్రే, షమనూర్‌ శివశంకరప్ప, సతీష్‌ జాక్రి హోలిలు మంత్రిపదవులు దక్కకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉ‍న్నారు.

ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన అసంతృప్త ఎమ్మెల్యేలు భవిష్యత్‌ కార్యచరణపై తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు మాత్రం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలదని ధీమావ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం అన్యాయం చేసిన పార్టీకి ఎందుకు దన్నుగా నిలవాలంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.



మంత్రి మండలి లోకి సీనియర్లను తీసుకోకపోవడాన్ని ఎమ్మెల్యేలు తీవ్ర అవమానంగా భావిస్తున్నారని తెలిసింది. లింగాయత్‌ లకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాటిల్‌, ఈశ్వర్‌ లను సైతం కేబినేట్‌లోకి తీసుకోకపోవడం చర్చనీయాశంగా మారింది. వీర శైవ లింగాయత్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివ శంకరప్పను కూడా కేబినేట్‌లోకి తీసుకోకుండా పక్కనబెట్టారు.  కాగా, చర్చలు జరిపేందుకు యత్నించిన కేపీసీసీ చీఫ్‌ పరమేశ్వరపై అసంతృప్త ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డట్లు తెలిసింది.

అయితే, పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని పరమేశ్వర పేర్కొన్నారు. కేబినెట్‌లో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయని, వాటిలోకి కొందరిని తీసుకుంటారని చెప్పారు. దీంతో రానున్న కాలంలో కాంగ్రెస్ పతనానికే ఈ సంకీర్ణం దారి తీయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యాశ దురాశా పరులైన తండ్రి-కొడుకుల పార్టీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తన తలతీసి జెడిఎస్ పాదాల చెంత పెట్టినందుకు దానిని ప్రోత్సహించిన తల్లీ కొడుకులు పర్యవసానం అనుభవించక తప్ప దంటున్నారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు నిజమేనని కర్ణాటక ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, సరైన నిర్ణయంతో ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీ తిరిగి గాడిలో పెట్టుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: