వైసీపీ అధినేత వైఎస్.జగన్ ప్రజాసంకల్ప యాత్రలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను దాదాపు ఖరారు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకుని తూర్పులోకి ఎంటర్ అవుతోన్న జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం కొవ్వూరు నియోజకవర్గంలోని మల్లవరంలో జరిగిన బీసీల ఆత్మీయ సదస్సులో జగన్ రాజమండ్రి ఎంపీ సీటు విషయంలో చేసిన ప్రకటన ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలను ఇరకాటంలో పడేసింది.
రాజమండ్రి ఎంపీ సీటును వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఇస్తున్నట్టు జగన్ సంచలన ప్రకటన చేశారు. ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కమ్మ వర్గానికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అదే పార్టీ నుంచి కాపు వర్గానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు వివి.వినాయక్ పేరు వినిపించింది. ఇక ఇప్పుడు జగన్ ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బీసీ క్యాండెట్‌ను దింపుతున్నట్టు సంచలన ప్రకటన చేసి ప్రధాన రాజకీయ పక్షాలను సైతం ఆశ్చర్యపరిచారు.
ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు బీసీలు ఎవ్వరూ ఎంపీలుగా గెలుపొందలేదు. గత కొన్ని దశాబ్దాలుగా రాజమండ్రి ఎంపీ సీటును ప్రధాన పార్టీలు అన్ని కమ్మలకే ఎక్కువుగా కేటాయిస్తున్నాయి. ఆ తర్వాత కాపులతో పాటు ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటి బ్రాహ్మణులు కూడా ఇక్కడ నుంచి రెండుసార్లు ఎంపీలుగా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఆరుగురు కమ్మ నేతలు 8 సార్లు గెలిస్తే, ఇద్దరు కాపులు, ఓ క్షత్రియ నేత మూడుసార్లు గెలిచారు.
చండ్రు శ్రీహరిరావు టీడీపీ నుంచి గెలిస్తే ప్రముఖ సినీనటి జమున కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1996 తర్వాత ఇక్కడ టీడీపీ 2014లో మాత్రమే గెలిచింది. మధ్యలో రెండుసార్లు బీజేపీ గెలిస్తే, 2004, 09 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్ గెలిచారు. 2004లో ఇక్కడ బలమైన ఓటింగ్ లేని బ్రాహ్మణ వర్గానికి చెందిన ఉండవల్లి అరుణ్‌కుమార్ భారీ మెజార్టీతో గెలిచారు. 2009లో కూడా ఆయన టీడీపీ, ప్రజారాజ్యంకు చెందిన ఇద్దరు సినీ నటులు మురళీమోహన్, కృష్ణంరాజులపై గెలిచారు. మురళీమోహన్‌పై ఆయన గెలుపు వివాస్పదం అయ్యింది. ఉండవల్లికి కేవలం 2 వేల మెజార్టీ మాత్రమే వచ్చింది.
ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ నుంచి గ్యారెంటీగా కమ్మలనే పోటీలో దింపనుంది. సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ లేదా ఆయన కోడలు మాగంటి రూపాదేవి లేదా ఎవరు పోటీ చేసినా ఇదే సామాజికవర్గం నుంచి క్యాండెట్ రంగంలో ఉంటారు. ఇక జనసేన నుంచి కాపుల్లో బలమైన వ్యక్తి కోసం చర్చలు నడుస్తున్నాయి. ఏదేమైనా టీడీపీ నుంచి కమ్మ, జనసేన నుంచి కాపు వ్యక్తులు రంగంలో ఉంటే ఇటు వైసీపీ నుంచి జగన్ నయా స్ట్రాటజీతో బీసీ వ్యక్తిని పోటీలో దింపితే సమీకరణలు చాలా వరకు మారేలా ఉన్నాయి.