తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని పి. గన్నవరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ దద్దరిల్లిపోయింది. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ పి . గన్నవరం చేరుకున్నారు. మండలంలోని కొబ్బరి రైతుల సమస్యలనే జగన్ ప్రధానంగా హైలైట్ చేశారు. జిల్లాలోని 1.25 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగు జరుగుతోందంటేనే ఎన్ని వేల రైతు కుటుంబాలు కొబ్బరి తోటలపై ఆధారపడ్డారో అర్ధం చేసుకోవచ్చు. గడచిన నాలుగేళ్ళల్లో కొబ్బరి రేట్లు పడిపోవటంపై జగన్ మండిపడ్డారు.
కొబ్బరి సమస్యపైనే ప్రధాన దృష్టి
కొబ్బరి పంటకు గిట్టుబాటు ధరలు రాక, పెట్టుబడిని కూడా తిరిగి రాబట్టుకోలేక కొబ్బరి రైతులు అవస్తలు పడుతున్నట్లు ధ్వజమెత్తారు. చివరకు కొబ్బరి తోటలను వదిలేసి ఇతర ప్రాంతాలకు వలసలు వెళిపోతున్నట్లు ఆరోపించారు. కోనసీమ నుండి కొబ్బరి రైతులు వలసలు వెళ్ళిపోవటం గతలో ఎన్నడూ చూడలేదన్నారు. గతంలో కొబ్బరిపై ఉన్న 4 శాతం పన్నును దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రద్దు చేస్తే ఇపుడు 5 శాతం జిఎస్టీ పేరుతో మళ్ళీ పన్ను వేస్తున్నట్లు జగన్ చెప్పారు.
స్ధానిక సమస్యలపైనే దృష్టి
జగన్ తన పర్యటనల్లో ఎక్కువగా స్ధానిక సమస్యలపైనే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే కోనసీమలో ప్రధానంగా వరి, కొబ్బరి సాగే ఎక్కువుంటుంది. అందుకనే కొబ్బరి, వరి రైతుల సమస్యలపైనే మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. ఇతర ప్రాంతాల్లో లాగే, పి. గన్నవరంలో కూడా ప్రజలు జగన్ కు బ్రహ్మరథం పట్టారు. పి. గన్నవరం కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు జనాలు పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించారు. చుట్టుపక్కలున్న రోడ్లన్నీ క్రిక్కిరిసిపోవటంతో పాటు చుట్టు పక్కలున్న భవనాలు, కార్యాలయాలపైన కూడా జనాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జగన్ సభ జరిగే ప్రాంతానికి ముందే వచ్చిన చేరిన జనాలు జగన్ ప్రసంగాన్ని సాంతం కేరింతలతో ప్రోత్సహించారు. ఎప్పటిలాగే చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నపుడు జనాలు కేరింతలు కొట్టారు.