నాలుగేళ్ల పర్యటన.. ప్రధాని మోదీ ఖర్చు తెలిస్తే షాక్..!

Edari Rama Krishna
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కోసం ఇప్పటి వరకు రూ.355 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్టు ఆర్టీఐ వెల్లడించింది. అధికారంలోకి వచ్చిన 48 నెలల కాలంలో ఆయన 41 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారనీ... మొత్తం 50కి పైగా దేశాల్లో పర్యటించారని పేర్కొంది. ప్రధాని విదేశీ పర్యటనలపై బెంగళూరుకు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త కోరిన వివరాల మేరకు ఆర్టీఐ వీటిని బయటపెట్టింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 41 సార్లు విదేశీ పర్యటనలు (52 దేశాలు) చేశారని, 48 నెలల కాలంలో 165 రోజులు విదేశాల్లోనే ఆయన బస చేశారని, ఇందుకు గాను రూ.355 కోట్లు ఖర్చయిందని తెలిపింది.

ఈ సందర్భంగా మోదీ చేసిన 41 పర్యటనలలో.. భూటాన్ పర్యటనలో అత్యల్పంగానూ, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా పర్యటనలో అత్యధికంగానూ ఖర్చయింది. 2014 లో భూటాన్ పర్యటనకు మోదీ వెళ్లినప్పుడు రూ. 2,45,27,465, ఇక 2015 లో ఫ్రాన్స్, జర్మనీ, కెనడాల్లో మోదీ తొమ్మిది రోజులు పర్యటించగా రూ. 31,25,78,000 ఖర్చయినట్టు పేర్కొంది.   కాగా, ప్రధాని మోదీ మాటిమాటికీ విదేశీ పర్యటనలకు వెళ్లడం వల్ల దేశంలో పరిపాలన స్తంభిస్తోందంటూ విపక్షాలు నిత్యం ఆయనను టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం సైతం తమ అధికారిక వెబ్‌సైట్లో మోదీ విదేశీ పర్యటనల వివరాలు వెల్లడించడం విశేషం.  అయితే ఈ పర్యటన వల్ల భారత్‌కు వచ్చిన లాభమెంత..? ఎన్ని పెట్టుబడులు, ఎన్ని కంపెనీలు వచ్చాయన్న విషయం దేవుడెరు..? ఇన్నికోట్ల డబ్బులు ఖర్చయ్యాయా..? అంటూ బీజేపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఈ ఖర్చులు గురించి తెలుసుకున్న సామాన్యుడి సైతం అవునా.. ఇన్ని కోట్లా..? అంటూ అవాక్కవుతున్నారు. కాగా, ఈ వివరాలు తెలుసుకున్న భీమప్ప మాట్లాడుతూ, మోదీ విదేశీ పర్యటనలకే ఎక్కువ నిధులు ఖర్చవుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఈ విషయం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తనకు కలిగిందని చెప్పారు. అందుకే, ఆర్టీఐ ద్వారా ఈ సమాచారం తెలుసుకున్నానని, అంతే తప్ప, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: