ముఖ్యమంత్రి పదవులకు 'ఇద్దరు చంద్రుల' గుడ్ బై..!? వాట్ నెక్స్ట్..?

Vasishta

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈసారి పంథా మార్చుకుంటారనే ప్రచారం జోరందుకుంది. గతంలో ఎన్నోసార్లు అవకాశం వచ్చినా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు అంగీకరించలేదు. తొలిసారి ముఖ్యమంత్రి పీఠమెక్కిన కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.


          అడపాదడపా దేశరాజకీయాలను శాసించిన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. గతంలో లోక్ సభలో ప్రతిపక్ష పాత్ర పోషించిన ఘనత ఆ పార్టీకి దక్కుతుంది. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలతో పలు కూటములు కట్టి అధికారం చేపట్టింది. కూటములు కట్టిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి ప్రధాని పీఠమెక్కే ఛాన్స్ దక్కింది. అయితే ఏరోజూ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సుముఖత చూపలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేస్తూ వచ్చారు. రాష్ట్రానికి చేయాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి మాత్రం స్ట్రాటజీ మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.


          ఇక తెలంగాణ రాష్ట్రపితగా పేరొందిన కేసీఆర్ నాలుగేళ్లలోనే రాష్ట్రానికి చేసింది చాలంటున్నారు. దేశ రాజకీయాల్లో విస్తృత మార్పు రావాల్సి ఉందన్నారు. దేశాన్ని ఆ దిశగా నడిపేందుకు ప్రజాస్వామ్య ఆలోచనలతో ముందుకొచ్చే పార్టీలను ఏకం చేసేందుకు నడుం బిగించారు. ఇప్పటికే పలు పార్టీల అధినేతలను ఆయన కలిశారు. వచ్చే ఎన్నికల నాటికి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలను శాసిస్తామని కేసీఆర్ చెప్తున్నారు. అయితే జాతీయ రాజకీయాలు కేసీఆర్ కు కొత్త కాదు. గతంలో ఆయన పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ దేశ రాజకీయాలవైపు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.


          టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రాష్ట్రం దాటి వెళ్లలేదు. అయితే ఈసారి మాత్రం చంద్రబాబు లోక్ సభకు పోటీ చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం అందుతోంది. కేసీఆర్ ఆ మాట ఇప్పటికే ఓపెన్ గా చెప్పేశారు. అయితే కేవలం పార్లమెంటుకు పోటీ చేయడంతో సరిపెట్టకుండా అసెంబ్లీ బరిలోకి కూడా దిగబోతున్నారనేది ఆయా పార్టీల నుంచి వస్తున్న అంతర్గత సమాచారం. అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ ఇద్దరూ అసెంబ్లీతో పాటు లోక్ సభకు కూడా పోటీ చేయబోతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఫలితాలను చూసిన తర్వాత ఏదో ఒక పదవికి రాజీనామా చేస్తారు.


          అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి పూర్తిస్థాయి మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి పీఠాన్ని లోకేష్ కు అప్పగించే అవకాశం ఉంది. అదే సమయంలో ఢిల్లీలో తనకు చక్రం తిప్పే అవకాశం వస్తేనే చంద్రబాబు ఎంపీగా వెళ్తారు. లేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ అసెంబ్లీకే వెళ్తారు. అయితే కేసీఆర్ మాత్రం రాష్ట్రాన్ని కేటీఆర్ చేతుల్లో పెట్టేందుకు దాదాపు డిసైడైపోయారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోఉన్నా ఆయన మాత్రం ఢిల్లీలోనే మకాం వేసేందుకు ప్లాన్ వేశారు. మరి ఈ ఇద్దరు చంద్రుల ప్లాన్లు ఏమేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి మరి.!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: