మోదీకోసం వాళ్లను వదిలేసుకోబోతున్న కాంగ్రెస్..!?

Vasishta

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం అనకూల పార్టీలతో కూటమి కట్టేందుకు కూడా సిద్ధమవుతోంది. కర్నాటక స్ట్రాటజీని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా మాత్రమే మోదీకి చెక్ పెట్టొచ్చనేది కాంగ్రెస్ ఆలోచన. అయితే ఇందుకోసం కొంతమంది మిత్రులను వదులుకోవడానికి సిద్ధమవుతుండగా.., మరికొందరు కొత్త మిత్రులను చేర్చుకోవడానికి రెడీ అయింది. మరి ఆ కొత్త మిత్రులెవరు..? వదులుకోబోయేదెవరిని..?

 

బీజేపీ వ్యతిరేక కూటమిని ఏకం చేసే పనిలో ఉన్న కాంగ్రెస్.. వామపక్షాలను దూరం పెడితేనే లాభమన్న నిర్ణయానికి వచ్చేసింది. బలంగా ఉన్న చోట్ల ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తూ.., కామ్రెడ్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ ను కాదని.. ప్రాంతీయ పార్టీలతో కలసిపోతుండటాన్ని స్థానిక నేతలు అధిష్టానం దృష్టికి తెస్తున్నారు. 2015లో లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపినా.. మమతను ఓడించలేకపోయిన విషయాన్ని బెంగాల్ క్యాడర్ గుర్తు చేస్తోంది. ఏపీలో పవన్ తో, తెలంగాణలో కోదండరాంతో వెళ్తున్న వామపక్షాల వైఖరిని, కాంగ్రెస్ హైకమాండ్ కూడా జీర్ణించుకోలేకపోతోంది. మోదీని రెండోసారి అధికారంలోకి రాకుండా చేయాలని బలంగా కాంక్షిస్తున్న కాంగ్రెస్.. అందుకు కామ్రేడ్లు అవసరం లేదని భావిస్తోంది.


బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలతో కలిసి మహా కూటమి ఏర్పరిచే యత్నాల్లో ఉన్న కాంగ్రెస్‌ - తన చిరకాల మిత్ర పక్షాలైన లెఫ్ట్‌ పార్టీలతో కలిసి నడిచేందుకు వెనకా ముందూ ఆడుతోంది. లెఫ్ట్‌ తో పొత్తు విషయంలో మాత్రం కాంగ్రెస్ లో ఇంతవరకూ స్పష్టత రాలేదు. దీనిపై జూలై 21న ఒక క్లారిటీ రానుంది. రాహుల్‌ తీసుకునే నిర్ణయం మేరకు పశ్చిమ బెంగాల్‌ లో కాంగ్రెస్‌ భవిష్యత్‌ ఆధారపడి ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సగం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తృణమూల్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన 44 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది ఇప్పటికే తృణమూల్‌లోకి ఫిరాయించారు. తృణమూల్‌తో అవగాహన లేకపోతే కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్‌ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి.


కాగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, వామపక్షాలు కలిసి పోటీ చేసినప్పటికీ తృణమూల్‌ కాంగ్రె్‌సను ఓడించలేకపోయాయి. కాంగ్రెస్‌ వామపక్షాల మధ్య పొత్తు కుదిర్చిన రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి ఓంప్రకాశ్‌ మిశ్రాకు లోక్‌ సభ ఎన్నికల్లో కూడా లెఫ్ట్‌ తో పొత్తు కుదిర్చే బాధ్యత అప్పజెప్పారు. అయితే లెఫ్ట్‌ తో కలిసి వెళ్లాలన్న నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌లో అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌదరి సహా పలువురు వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్‌లో బాగా బలహీనపడ్డ వామపక్షాలతో పొత్తు కుదుర్చుకోవడం ఆత్మహత్యా సదృశమని మెజారిటీ కాంగ్రెస్‌ ఎంపీలు సైతం అంటున్నారు.


ఒక్క పశ్చిమ బెంగాల్‌లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా వామపక్షాలతో చేతులు కలపడం వల్ల తమకు వచ్చే లాభనష్టాలను కాంగ్రెస్‌ నేతలు బేరీజు వేస్తున్నారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న రాష్ట్రాల్లో వామపక్షాలతో చేతులు కలపడం వల్ల ఆ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుంది తప్ప కాంగ్రెస్‌ కు వచ్చే ప్రయోజనం ఏమీ లేదని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.. అంతేకాక సీపీఎం వివిధ రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందన్నది వారి ఆరోపణ.. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్షాలు పవన్‌ కల్యాణ్‌ వైపు మొగ్గు చూపడంపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహంతో ఉన్నారు.


తాము బలంగా లేని రాష్ట్రంలో ఇతర పార్టీలవైపు మొగ్గు చూపి తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో తమ శక్తికి మించిన సీట్లు అడగడం వల్ల పొత్తు కుదుర్చుకోవడం సాధ్యపడకపోవచ్చునని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. ఆంధ్రాలో పవన్‌ కల్యాణ్‌ వైపు చూస్తున్న వామపక్షాలు తెలంగాణలో మాత్రం వేర్వేరుగా పయనిస్తున్నాయని, సీపీఎం ఏర్పాటు చేసిన BLFలో ఇతర వామపక్షాలేవీ లేకపోగా.., సీపీఐ మాత్రం కోదండరామ్‌ నేతృత్వంలోని తెలంగాణ జనసమితితో చేతులు కలిపి కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు ఇస్తే పోటీ చేస్తానని బేరసారాలకు దిగుతోందని గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా జాతీయస్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రె్‌సతో కలిసి ఫ్రంట్‌లో లెఫ్ట్‌ ఉండాలనుకున్నా, రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉన్నదని వామపక్ష నేతలే అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: