2019 ఎన్నికలు రైతులవే..! ఎందుకో తెలుసా....?

Vasishta

దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్ మొదలైన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతులపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందే కేంద్రం మద్దతు ధరల్ని గణనీయంగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు మరిన్ని తాయిలాలు రైతులకు అందబోతున్నాయనే కబురు అందుతోంది.


2019 దేశ సార్వత్రిక ఎన్నికలు రైతులకు పండగ కాబోతున్నాయా.!!  అంటే అవుననే సమాధానమే వస్తుంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయపార్టీలతో పాటు.. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయపక్షాలు సైతం రైతు రుణమాఫీ అజెండానే ఆయుధంగా మలుచుకున్నాయి. నెలరోజుల క్రితం కర్నాటక పగ్గాలు చేపట్టిన కుమారస్వామి ప్రభుత్వం తన ఎన్నికల హామీ అమలు కోసం 34 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ప్రకటించింది. ఏడాది క్రితం యూపీ పగ్గాలు చేపట్టిన యోగి సర్కార్ కూడా రైతు రుణమాఫీ చేసింది. 2014 లోనే రెండు తెలుగు రాష్ట్రాలు మాఫీని అమలు చేసి, దేశానికే ఆదర్శంగా నిలిచాయి. 2019లో ఢిల్లీ పగ్గాలు కాంగ్రెస్ కు దక్కితే దేశవ్యాప్తంగా రైతురుణమాఫీ చేస్తామంటూ  రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించేశారు. గతంలో 53 వేల కోట్ల రూపాయల మేరు రైతు రుణమాఫీ చేసిన ఘతన యూపీఏ ప్రభుత్వం సొంతమంటూ తొడగొడుతున్నారు. 2019 ఎన్నికల పేరున భారతదేశం మొత్తమ్మీద రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో రైతులపరం కాబోతున్నాయంటూ అమెరికాకు చెందిన ఓ బ్రోకరేజ్ సంస్థ తన సర్వేలో వెల్లడించింది.


2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న దిశగా మోదీ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. అకాల వర్షాలు, అదుపుతప్పుతున్న రుతుపవనాలు, ఆ లక్ష్యం దిశగా అనేక అవాంతరాలు సృష్టిస్తున్నాయి. మరోవైపు ఆర్థికలోటు, ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలు కర్షకుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో ప్రకృతితో సమానంగా పోటీపడుతూ అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల వాతావరణం రైతుల్ని ఆదుకోబోతోందని అమెరికాకు చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన విశ్లేషకులు అంచనా వేస్తున్నారు… అమెరికా సంస్థలు వెల్లడిస్తున్నట్లు 2019 కన్నా పదేళ్ల ముందే.., 2009లో యూపీఏ సర్కారు అమలు చేసిన రైతురుణమాఫీ పథకం దేశంలో సరికొత్త ఒరవడికి నాంది పలికింది. ఆనాడు దేశంలో దాదాపు 3.2 కోట్ల మంది రైతులు మన్మోహన్ సర్కార్ చేసిన మాఫీతో లబ్ధి పొందారు. ఆ పథకాన్ని మెగా సక్సెస్ చేశారు. దాన్నే ఆదర్శంగా తీసుకుని 2014లో ఎన్నికల్లో చంద్రబాబు, చంద్రశేఖర్ రావు ఇద్దరూ రైతు రుణమాఫీని మ్యానిఫెస్టోలో చేర్చి, అధికారపీఠాన్ని అందుకున్నారు…


తెలుగురాష్ట్రాల్లో విజయవంతమైన రైతు రుణమాఫీ., ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల విధానంగా మారిపోయింది. రైతు రుణమాఫీ నినాదంతోనే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, విపక్షాలకు గట్టిపోటీ ఇచ్చింది. అఖిలేష్ – రాహుల్ గాంధీ కూటమిని సమర్థవంతంగా ఎదుర్కొని 300కు పైగా సీట్లలో పాగా వేసింది. ఘనవిజయాన్ని అందించిన రైతుల విషయంలో సీఎం యోగి ఆధిత్యనాథ్ చాలా వేగంగా నిర్ణయం తీసుకున్నారు. తొలి క్యాబినెట్ మీటింగ్ లోనే యూపీ రైతులు తీసుకొన్న లక్ష రూపాయాల పంటరుణాల్ని మాఫీ చేశారు. సుమారు రెండున్నరకోట్ల మంది సన్న, చిన్న కారు రైతులకు లబ్ధి చేకూర్చారు. ప్రభుత్వ ఖజానాపై 36 వేల కోట్ల రూపాయల మాఫీ భారం పడుతున్నా.. లెక్కచేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల మద్దతు నిలబెట్టుకున్నారు…


రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో అధికారమే పరమావధిగా భావిస్తున్న పార్టీలు, రైతుసామాజిక వర్గంపైనే ముందుగా దృష్టి పెడుతున్నాయి. ఆరుగాలం సాగులో అనేక సమస్యలతో సతమతమయ్యే అన్నదాతకు రుణం ఒక్కటే కీలకం అన్నట్లు విధానాలు రూపొందించేస్తున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్న బేధం లేకుండా రాజకీయ పక్షాలన్నీ రైతు రుణమాఫీని రాజకీయ మంత్రాంగంగా మార్చుకున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: