ఎడిటోరియల్: చంద్రబాబు లోని దార్శనికుడు ఇక 'చెల్లని చెక్కు' మాత్రమే - పూర్తిగా 'అబ్సలేట్'

చంద్రబాబు ఒకనాడు ఆ తరం రాజకీయ నాయకుల్లో గొప్ప దార్శనికుడుగా (విజనరీ) అభివృద్దిని కొత్త పుంతలు తొక్కించిన నాయకుడుగా ప్రసిద్ధి పొందారు. 1999లోనే జాతి అభివృద్ధిని 2020 కోసం కలలుగన్న ఒక ఊహా పిపాసి. అందుకోసం "ముందుచూపు" ను ప్రయోగాత్మకంగా ప్రకటించారు. సైబరాబాద్ పేరుతో సాంకేతిక సొబగులు హైదరాబాద్ నగరానికి అద్దిన ఒక రూపశిల్పి. ఆయనకు కాలం కూడా అనుకూలంగా కలసివచ్చింది.


నాడు ఆయనలో నూతనత్వంతో నవనవోన్వేషిత ఉత్సాహం పొంగిపొరలేది. ఒక విధాన కర్తగా ఆయన్ను ఎంతో ఉన్నతంగా చూసిన ఆతరం వ్యక్తులు బాగా గుర్తుంచు కున్న విషయం తన 'ప్రభుత్వ అసమర్ధతలను, ఆవశ్యకతలను, రుగ్మతలను కనిపెట్టాను' అని ఒక రెండు దశాబ్ధాల పూర్వమే ప్రకటించుకున్న నాయకుడు.


దేశానికే ఒక దిశానిర్దేశం చూపించాలన్న తాపత్రయంతో పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిన ఘనతర సుధీర్ఘదర్శి. తన 'విజన్‌-2020' ని ప్రకటించడానికి, ఆయనలో ప్రేరణ కలిగించిన గతం, భవిష్యత్ పరిస్థితులపై ఆయనకు సరైన అవగాహన ఉండటంతో వర్తమానం ఆయన్ని ఒక లీడర్ గా గుర్తించి ఉచితస్థానాన్నే యిచ్చింది. రానున్న కాలాన్ని ముందే చూసి ఊహించినట్లు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తూ (దార్శనికతతో కూడిన ప్రణాళికను) విడుదల చేయడానికి గల కారణాలను, ఆలోచనలను, విశ్లేషణలను "మనసులోమాట" గా, 2003లోనే ప్రకటించారు. 1999 లోని తన ఆలోచన 2020కి సరిగ్గా నాలుగేళ్ల తరవాత అంటే 2003 లోనే ఒక రూపాన్నిచ్చారు.


నాటి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా, తన ప్రణాళిక  అమలుకు, మరో అయిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వాలని, ఓటర్లను కోరుకున్నా,  వారు నాడు ఆయనను గెలిపించలేదు. చంద్రబాబు దార్శనికతలో విశ్వసనీయత లేదనే నమ్మిన ప్రజలు 2004 ఎన్నికల్లో ఆయన్ను పక్కన పెట్టారు. అయినా ఆయన 'విజన్‌-2020' మాత్రం ప్రణాళికాబద్ధం చేసి సజీవం గానే ఉంచారు. ఆ గడువును చేరుకోవడానికి ఆయన 2004 నుండి 2014 వరకు అంటే ఒక దశాబ్దం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. అంటే 2003లోనే ఆయనపై ప్రజల్లో నమ్మకం సడలింది.


అయితే రాష్ట్ర విభజన సమయంలో - 2014లో ఒక దశాబ్ధం  'అధికార' వియోగం, 'విరహం' తరువాత, అవశేష ఆంధ్రప్రదేశ్‌ కు అనుభవఙ్జుడన్న ఒకే ఒక కారణంగా "టిడిపి - బిజెపి - పవన్ కళ్యాన్ సంయుక్తం" గా ప్రజలను అభ్యర్ధించటంతో ప్రజలు ఆయన్ను నవ్యాంధ్ర తొలి  ముఖ్యమంత్రిని చేశారు. దానితో తాను సజీవంగా ఉంచిన తన 'విజన్‌-2020' మరో 30 ఏళ్లకు (2050)  విస్తరించి నూతన  ప్రణాళికను మరోరకంగా తీర్చి సిద్ధం చేసి తన దార్శనికతను మరోసారి వెలుగులోకి తెచ్చారు.

 

"బిజెపికి సిద్ధాంతాలు లేవు-అమానుషమే దాని సిద్ధాంతం" అని, కలగూర గంప గుజ్రాల్‌ ప్రభుత్వ పతనం తరువాత బిజెపి గురించి వ్యాఖ్యానించితన అభిప్రాయం ప్రకటించిన చంద్రబాబును, ఆ రోజులను, బిజెపి చాణక్యులు మరచి పోలేదని  ఋజువు చేస్తూనే వస్తున్నారు. కాకపోతే, ఋజువు చెయ్యడానికి వాళ్ళు నాలుగేళ్లు సమయం తీసుకున్నారు. నమ్మకస్తుడైన మిత్రుడినని నిరూపించు కోవడానికి, ప్రధాని అభ్యర్ధి నరెంద్రమోడీ మనసు దోచుకోవడానికి  'చంద్రబాబు'  చేయని ప్రయత్నం లేదు. అటు కేంద్రం ఇటు ఆత్మప్రబోధం మద్య పవన్ కళ్యాణ్ మద్దతుతో, రాష్ట్రాన్నినడిపించడానికి సమాయత్త మయ్యారు.

 

బిజెపి ప్రత్యేక హోదా అవసరం లేదంటే, అవసరం లేదన్నారు. ప్రజలకోసం ప్రత్యేక ప్యాకేజీ తానే కోరగా-కరుణించి వారు ఇస్తామంటే, దాన్ని మహాప్రసాదం బ్రహ్మాండం అన్నారు. చివరకు తన తీరు 'సొమ్మొకడిది సోకు తనది' ప్రచారపటాటోపం  గమనించిన బిజెపి  'అదీ లేదూ-ఇదీ రాదూ' అనే సరికి అసలుతత్వం బోధపడేసరికి, చేతులు కాలగా - పట్టుకోవడానికి ఆకులు  కూడా దొరకక లోపలే కుళ్ళి కిళ్ళి గత పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనే అవకాశం రాలేదు సరికదా! ఇంతలో ఆ దార్శనికునికి "కథ అడ్డం తిరిగిందని" తెలిసేసరికి, నాలుగేళ్ల పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. అంటే ఆ దార్శనిక నయనాలకు అసలు దృశ్యం కంపించింది.

 

ఒకనాడు, ప్రతిపక్షాన్ని తుదకంటా ముగించాలనే అప్రజాస్వామిక ఉద్దేశంతో బహిరంగంగానే ఫిరాయింపులను ప్రోత్సహించి నైతికతకు నీళ్ళోదిలి,  ఫిరాయించిన శాసన సభ్యులకు లేనిపోని ఆశలు కల్పించి, మంత్రి పదవులు ఎరచూపి, గద్దెనెక్కడం భారతచరిత్రలో ఈ దార్శనికుడు సృష్టించిన చీకటి అధ్యాయం. స్వయంకృతాపరాధం, దురాశ, వ్యక్తిగతస్వార్ధం, బందుప్రీతి కులాభిమానం, ప్రాంతీయాభిమానం ధారుణంగా పెరుగి ఆయనలోని దార్శనికత పూర్తిగా కరిగి కరిగి కనుమరుగై పోయింది. 

 

దీనికి ముందే అవసరం లేకపోయినా, ఫిరాయింపులకు తెగించి తెలంగాణాలో "ఎంఎల్‌సి కొనుగోళ్ల పర్వం"కు  తెరలేపారు. తన స్వంత, స్వరంతో, బ్రీఫ్డ్ మీ అంటూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కభందహస్తాలకు చిక్కి దెబ్బకు దెయ్యం వదిలి నట్లు అధికార మందీమార్బలంతో, సకుటుంబ సపరివార సమేతంగా సమైఖ్య రాజధానిని ఒక దశాబ్ధ కాలం ఉచితంగా విని యోగించుకొనే అవకాశంవదిలేసి అమరావతికి రాత్రికిరాత్రే  ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి స్వంతమైన "షేరింగ్ ఆఫ్ హైదెరాబాద్ యాజ్ జాయింట్ కాపిటల్" ను ఎవరి అనుమతీ తీసుకోకుండా వదిలేసి - తన అనైతిక రాజకీయచరిత్రను  మరో మలుపు ఇచ్చారు.


ఇలాంటి 'అనైతిక దార్శనికత' రాష్ట్రప్రజలకు ఆనందాన్ని, అభిమానాన్ని, సంతోషాన్ని ఏదీ ఇవ్వలేకపోగా ఆయన నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం చెల్లని చెక్కవగా - ఆ రాష్ట్రంలోని ఐదు కోట్లమంది తెలుగువారు నిరాశా నిస్పృహలతో రాజధాని అనబడే శిరస్సులేని మొండేం తో అసంతృప్తితో తల్లడిల్లుతున్నారు. 

 

అగ్నికి ఆజ్యం పోసినట్లు బిజెపిలోని కనిపించని క్రోదాగ్నిని మరింత రెచ్చగొట్టి  'కర్నాటకం'లో తనకోసం తానే ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన దైన శైలిలో 'మహానటన' ప్రదర్శించినా, ఆ నాటకం రక్తి కట్టలేదు. ఈ దెబ్బకు  'కమలానికి చంద్రుడు ఎంతో దూరం అనేలా మరీ దూరం' అయ్యాడు. ఆపై బిజెపి-మొడీ ద్రోహం చేశారనే ప్రచారం ధర పోరాటం అంటూ కేంద్రంపై సమరం అంటూ ప్రారంభించినా, బిజెపి భాగ్యవిధాతలు మనకున్న ముష్టి రెండు ఎమెల్యే సీట్ల కోసం ఈ కంచి గరుడసేవ ఎందుకని అనికున్నారో ఏమో ఆయన్ను పట్టించుకోవటమే మానేసి రాష్ట్రానికి రవ్వంతమేలు కూడా చేయకుండా వదిలేసింది.

 

చివరకు, బిజెపితో వివాహ బంధం-విడాకులు పెటాకులు అవగా నాలుగేళ్ల పుణ్యకాలం కాస్తా కరిగిపోగా - ఎప్పుడు ఎన్నికల గంట మోగుతుందో తెలియని రోజులొచ్చేశాయి. వద్దనుకున్న ప్రత్యేక హోదా, పెద్దగా పట్టించుకోని కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్‌ డిమాండ్ల తో పరువు, ప్రతిష్టల మరమ్మతుకు - ధర్మపోరాటం నిరాహారదీక్షలు, సత్యాగ్రాహాలు అంటూ పాలన వదిలేసి రోడ్లపై తనప్రభుత్వ అసమర్ధతపై తామే యుద్ధం ప్రకటించటంకూడా ఈ ప్రపంచానికి కొత్త అనుభవాన్నిచ్చారు. ఈ నాలుగేళ్ళు బిజెపి నుండి తన కేంద్రమంత్రుల ద్వారా తన, తనవాళ్ల ప్రయోజనాలు సాధించుకుంటూ స్వప్రయోజనాలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కాలంగడిపి ఇప్పుడు ఎన్నికల నగారా మ్రోగనున్న వేకువవేళ కుంభకర్ణ నిద్రనుండి బయటపడి బిజెపి అన్యాయం చేసిందంటూ ఈ మనిషి రోడ్దున పడ్డాడు.   

 

ఎంపీల దీక్షలు, దేశ రాజధాని రోడ్లపై పగటి వేషాలూ వీటాన్నిటిని మోడీ తృణ ప్రాయంగా చూడగా చంద్రాబాబు తానొక ఫ్లాప్‌ సినిమా చూసిన అనుభవాన్ని పొందారు. చివరకు బాబు ఆయన టిడిపి వందిమాగదులు అధికబరువును తగ్గించుకోవటానికే ఈ దీక్షలు అని వాళ్ళలో వాళ్ళ ఎంపీలే  జోకులేసుకోవడం, సామాజిక మాధ్యమాల్లో కళ్లారా చూసి, కొందరు సున్నిత మనస్కులు కళ్లు తిరిగిపడిపోయినట్టు నాడు వార్తలు వచ్చాయి.

 

సిఎం రమేష్‌ దీక్షతో ఉక్కూ రాదూ, తుక్కూ రాదని తమ ఎంపి జె.సి. దివాకరరెడ్డి చేసిన వేసిన పంచ్ బాబు గారి గుండెల్లో ఒక ఝలక్‌! ఇచ్చింది. తాన దార్శనికత, తనలోనే వ్యతిరేఖ దార్శనికతగా మారి (యాంటీ బాడీస్) దెబ్బ మీద దెబ్బేస్తుంది. అంటే తాను గతంలో ప్రవచించిన సిద్ధాంటాలతో తననే అనుక్షణం "సాక్షి" చర్ణాకోల దెబ్బ మీద దెబ్బ వేస్తుంటే కళ్ళు బైర్లు కమ్ము తున్నాయి. తాను తన వాళ్లతో నిర్మించుకొన్న మద్దతు మీడియాకు రాష్ట్రంలో సరిగా వ్యతిరేఖ మీడియా సోషల్ మీడియా కలసి పెనవేసుకొని సమ్మెట దెబ్బలు వేస్తూ తన దార్శనికతను చితగొట్టటం దినచర్య ఔతుంది.   

 

విశాఖ దీక్షలో ఖాళీ కుర్చీలే అందుకు సంకేతం అవగా - వరుసగా తన ఎత్తుగడలు చిత్తవుతుంటే, వ్యూహాలు పూచిక పుల్లలు గా మారి ప్రయోజనాలు లభించక పోతుండటం అందరికి అనుమానం కలిగిస్తూ ఏమైపోతుంది చంద్రబాబుగారి 2050 దార్శనికత అని అంటున్నారు. చివరకు, ప్రత్యేక హోదా పతాక సన్నివేశానికి సర్వోన్నత న్యాయస్థానమే వేదికయింది. హోదా ఇవ్వలేమని, అవసరం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని కేంద్రం అఫిడవిట్‌ సమర్పించింది.

 

ఇక, సమర్ధించుకోవడానికి సామగ్రి లేదు. పలాయనానికి దారుల్లేవు. ఎన్ని శకుని పాచికలు విసిరినా, నమో మాయ మహామాయ గా మారి ఫలితాలు అనుకూలంగా రావటం లేదు. ఎన్ని పావులు కదిపినా, తన చదరంగంలో తనకే ఎదురు దెబ్బలు తప్పడం లేదు. దోషం ఎక్కడుందో, దార్శనికుడే ఇక అన్వేషించుకోవాలి. బహుశా, ఆత్మదర్శనం, అంతర్మధనం చేసుకోవాలేమో! చివరకు కేంద్రం పై అవిశ్వాసం పెట్టి పూర్తిగా పరువు ప్రతిషల వస్త్రాపహరణం చేసుకొని - నేడు డిల్లీ పురవీధులు పట్టించింది ఆయన దార్శనికత. చివరకు ప్రత్యేక హోదా కాదు కడా పూచిక పుల్ల కూడా తేలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా, చెప్పాలంటే ఏకంగా బాబు గారి దార్శనికత ఉనికిని - విశ్వసనీయతని కోల్పోయింది. చికాగో యూనివెర్సిటి ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేస్తుందన్న చిల్లర కార్యక్రమాలు ఆయన పరువును బజారు కీడ్చాయి. 

 

చివరకు ఈ దార్శనికుడు వేసిన తిక్కవేషాలు, నాటకాలు, మౌనంగా ఉన్న నమో నోరు తెరిపించగా ప్రజలు ఔరా అనేలాగా నిజాలు బయటబడగా, అహా ఈవనలోని దార్శనికత జనం ముందు నగ్నంగా నిలబడింది. ఇంకే 2019 ఎన్నికలు ఆయనకు 2004 ఫలితాలను "ప్రతిబింబం" గా కనిపించేస్తున్నాయి. అందుకే ఆయనలో ఈ "ఫ్రస్ట్రేషన్" 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: