తెలంగాణా ప్రభుత్వం పాలనలో న్యాయం-చట్టం దారి తప్పాయి: ఇది కోర్టు ధిక్కరణే: హైకోర్టు

కొద్ది రోజుల క్రితం తెలంగాణ శాసనసభ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్ కుమార్ లను టీఆర్ఎస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ వారిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు ఆ ఇద్దరిని శాసనసభలోకి అనుమతించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దును కొట్టివేస్తూ హైకోర్టు ఇంతకు ముందే తీర్పు ఇచ్చింది. 

హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడంలేదు. వారిని ఎమ్మెల్యేలుగా పరిగణించడంలేదు. హైకోర్టు ఉత్తర్వులు చూపించినా తమను శాసనసభలోకి అనుమతించ డం లేదంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ లు మరోసారి హైకోర్టు తలుపు తట్టారు. ప్రభుత్వంపై వారు కోర్టు ధిక్కారణ పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను శుక్రవారం విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది. ఈ శాసనసభ్యుల విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందరరావుపై ప్రశ్నించింది.

ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది రామచందరరావుపై కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రభుత్వ న్యాయవాదా? లేక పార్టీ తరఫు న్యాయవాదా? అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. వారం రోజుల్లోగా హైకోర్టు తీర్పుపై స్పందించాలని ఏజీకి ఆదేశాలు జారీ చేసింది.   వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటూ, అలా జరగని పక్షంలో శాసనసభ కార్యదర్శి - సెక్రటరీలు హైకోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఈ పిటిషన్ తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదావేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరం గా మారింది. ఈ నేపథ్యంలో కోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: