స్పెషల్ ఫీచర్: ఇలా ఐతే ఆడజాతి అంతరించి పోవటం తధ్యం

మహిళల సంఖ్య దినదినం తగ్గిపోతుంది. ఒక జాతి అభివృద్ది కావాలంటే స్త్రీ పురుష జనాభా సమతౌల్యత సరిగా ఉండాలి. లేకుంటే సామాజిక రుగ్మతలు తీరని సమస్య లు ఉత్పన్నమౌతాయి. స్త్రీల ఆత్మహత్యలు కూడా దీనికి ఆజ్యం పోస్తున్నాయి. మహిళల సంఖ్య దిన దినం తగ్గిపోతుంది.


"కలకంఠి కంటకన్నీరొలకిన సిరి ఇంటనుండ నొల్లదు" అన్న సామెత ద్వారా హైందవధర్మం సాంప్రదాయం స్త్రీలకువేదన కలిగిస్తే వైభవం అంతరించి పోతుందని చెపుతూ మహిళ లకు సంస్కృతి ఇచ్చే గౌరవం విలువను తెలపకనే తెలుపుతుంది.


అయితే సమాజం లో నేడు పెట్రేగిపోతున్న వివిధ అరాచకాలను గమనిస్తే కలకంఠి కంట కన్నీరొలకటం కాదు కన్నీటి ప్రవాహమే ప్రతిదినం చూస్తూనే ఉంది.  ప్రతిక్షణం అది నిజమనేనని ఋజువు చెసే సంఘటనల ద్వారా అర్ధమౌతుంది.


అలాగే ఆ సామెత అక్షర సత్యమేనని సత్యదూరం కాదని సామాజికంగా దిగజారుతున్న పరిస్థితుల ద్వారా నిర్ధారణ ఇప్పటికీ అవుతూ ఉంది. పత్రికలు, చానళ్లు ఒక పది నిముషాలు చూసిన రోజు రోజుకు సమాజం పతనం ఏ స్థాయిలో ఉందో ఋజువౌతుంది.


ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా, చదివినా స్త్రీల ఆత్మహత్యల విషయాన్ని వింటున్నాం, చూస్తున్నాం. ఏదో ఒక విధంగా కారణాలు చిన్నవైనా, పెద్దవైనా ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనల వలన కూడా జాతికే జీవనాడిగా ఉన్న ఆడజాతి అంతరించి పోయే ప్రమాదం శరవేగంగా ముంచుకువస్తుంది.


అష్టకష్టాలు వారిని ఏదో విధంగా అష్టదిగ్భందనం చేస్తూనే ఉన్నాయి.       

 *వివాహం - వివాదాలు

*వివాహేతర సంబంధాలు,

*ప్రేమలు-విడాకులు,

*పెళ్ళి-పెటాకులు,

*అనుమానాలు-అపార్ధాలు,

*అత్తా-కోడళ్ళు-కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు,

*వరకట్నవివాదాలు, 

*మగపిల్లలలను కనలేదనో! ఇలా ఇంకెన్నో విలువలేని కారణాలు.  కారణాలేవైనా  ఉరిమురిమి మంగలం  మీద పడ్డట్టు అన్నీ దుష్ప్రభావాలు మగువల జీవితాల పైనే పడి చిద్రం చేస్తూ పోతున్నాయి. 


ఇలాగే ఎన్నెన్నో కారణాలు స్త్రీల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. గ్రామాలలోను, పట్టణాలలో ను చివరకు గిరి, వన ప్రాంతాల్లో సైతం - బేధం లేకుండా జరుగుతున్న సంఘటనలే ఇందుకు ఋజువులు. మన చుట్టు ప్రక్కల జరిగే ధారుణాలు ఎన్నెన్నోమనసున్నవారిని కలచి దహించి వేస్తున్నాయి.


ఇటీవల అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం పల్లేపల్లి గ్రామంలో గౌరమ్మ అనే మహిళ పాతికేళ్లు నిండ కుండానే తన ఇద్దరు ఆరేళ్లు, రెండేళ్లు  వయసున్న ఆడపిల్లల్ని కొడవలితో గొంతుకోసి చంపి తాను కూడా కొడవలితో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకోబోయింది.


ఇలాంటి సంఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట కాదు, వందలలో, వేలలో జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. స్త్రీలు కుటుంబ కలహాలతో, కలతలతో, వేదనలతో, మానసివ కలహాలతో వందేళ్ల నిండు జీవితాలను, నూరేళ్ళ కాపురాలను పేకమేడల్లా కూల్చేసుకుంటున్నారు.


వాళ్లు ఆత్మహత్య చేసుకోవడంతో తమని నమ్ముకున్నతమవాళ్లను బాధలకు గురిచేస్తున్నారు. నిత్యం కుటుంబ కలహాలతో మనస్థాపాలకు గురయ్యే ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటా యని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏవో సమస్యలు ఉంటాయి. వాటితో మనోవేదన కుడా తప్పదు. దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని గమనించాలు.

 

ఆత్మహత్య ఆలోచనలు మనసు నుండి వైదొలగాలంటే: 

*సానుకూల దృక్పథం అలవరచుకోవాలి.

*ప్రతిచిన్న విషయాన్నీ భూతద్దంలోంచి చూడకూడదు.

*విమర్శలనైనా, సద్విమర్శలనైనా సహృదయంతో ఆహ్వానించాలి.

*కుటుంబాలలో అత్తా, కోడళ్ల మధ్య పోట్లాటలు, ఆడపడుచులు,తోడి కోడళ్ల మధ్య మనస్పర్థలకు సరైన కౌన్సిలింగ్ కుటుంబంలోని అనుభవఙ్జులైనా ఇవ్వాలి లేదా ఇప్పించాలి

*అందరి ఇళ్లలో మనుషుల మధ్య సంఘర్షణలు అతి సహజమని గుర్తించాలి. అయితే ఈ గొడవలు సంఘర్షణలు హత్యలకు, ఆత్మహత్యలకు వినాశనాలకు కారణం కాకూడదు.

 

చావు అన్ని సమస్యలకు పరిష్కార మార్గమే అయితే - అసలీ భూ గ్రహంపై జనాభా ఉనికే ఉండేది కాదేమో? మానవజాతి అంతరించి ఉండేదేమో?  ఆవేశం మనిషిలోని విచక్షణా జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని కోల్పోయేలా చేస్తుంది. ఆవేశంతో సమస్య ల్ని పరిష్కరించే శక్తిని కోల్పోయి పురుగుల మందులు తాగో, బావులలో పడటం ద్వారానో, రైళ్ళ కింద పడిపోవడం లాంటి విచక్షణారహితమైన పనుల ద్వారా జీవితాల్నే కోల్పోతున్నారు.


మనిషిలోని ఆవేశం తగ్గిపోయాక  ఏం చేసినా సాధారణ  జీవితాలు తిరిగిరావు. మంచి ఆలోచనల ద్వారా మంచి కార్యాలు చేయగలం. అతిగా ఆలోచించడం చేయకూడదు. ఒక విషయం గురించి నిర్ణయాలు తీసుకునేముందు మంచి, చెడుల్ని బేరీజు వేసుకుని, జీవితాల్ని ఆనందమయం చేసుకోవాలి.


సర్వానర్ధాలకు కోపమే మూలం. ఆగ్రహం అనర్ధదాయకం అని అందుకే అంటారు. అన్ని సమస్యలకు మూలం కోపమేనని గుర్తించి కోపం వచ్చినపుడు కాసేపు మౌనం వహిస్తే కోపం దానంతట అదే తగ్గిపోతుంది. కోపం మనిషిలోని మానవత్వాన్ని నశింపచేస్తుంది. ఇద్దరు మనుషుల మధ్య కోపం చాలా సమస్యల్ని, విపరీతాల్ని  తెచ్చిపెడుతుంది.

 

మానవతకు ప్రతి రూపం అమ్మ అలాంటి అమ్మలు దేవతా మూర్తులు, దేవునికి ప్రతిరూపమైన అమ్మలు కష్టాలకు, కన్నీటికి, జీవితంలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్య లకు భయపడి, తాము ఆత్మహత్య చేసుకుని, ప్రేమకు ప్రతిరూపాలైన తమ పిల్లలను చంపి, వారు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు మీరెందుకు చావాలి? మీ పిల్లల్నెందుకు చంపాలి? ఆ దేవుడు మనకిచ్చిన అపురూపమైన మానవజన్మ అనే అద్భుతఅవకాశాన్ని చేజేతులారా పరిత్యజించటం దూరం చేసుకోవడం ఎందుకు?  అలా చేయటం చేయడం నేరం కాదా? ఆత్మహత్య మహాపాతకం అని మన పురాణాలేకాదు సాంప్రదాయం సంస్కృతులు ఘోషిస్తు న్నాయి.


ఇందిరాగాంధి ఒక సందర్భంలో  నేను మట్టి ముద్దనుకాదు పడితే పడిపోయి పడుంటానికి - గోడపైకి విసిరిన రబ్బరు బంతిని, అలా పైపై కి లేస్తాను, తిరిగి పైకెదుగుతానంది అలా ప్రతి మగువ తనలోని శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటాలి. తామేమిటో, తమ శక్తియుక్తులేమి టో నిరూపించి, తమ స్థానాన్నినిరూపించుకోవాలి. గానీ పిరికితనంతో ఆత్మహత్య చేసు కోవడం నేరం మహా పాపం.


జంతువులు, పక్షులు తమ బిడ్డలనెంత ప్రేమగా చూసుకుంటాయో చూసి మగువలు కనీసం అలాగైనా జీవిస్తూ సరైన నిర్ణయాలు తీసుకొని ముగురమ్మల మూలపుటమ్మ లు అనిపించు కోవాలి గాని పిరికి తల్లులు అనిపించుకోరాదు. పిరికి తనమున్న వారు పిల్లల్నే కనరాదు. తమకు పుట్టిన నేరానికి పసిబిడ్డల్ని చంపేయడం ఎంత కసాయి తనమో కదా? అమ్మలకు పిరికితనం తగదు.


భార్యాభర్తల మధ్యన కానీ, ఇతర కుటుంబసభ్యుల మధ్యన సత్సంబంధాలుండాలి: అసూయ, ద్వేషాలతో ఒకే ఇంట్లో ఉంటూ శత్రువుల్లా బతకకూడదు. అపార్థాల్నివీడి ఒకైరిని ఒకరు అర్థం చేసు కోవాలి. ఒకరి మనసును మరొకరు తెలుసుకోవాలి. ఒకరికి మరొకరు పరాయివారు కాదనీ, ఒకే గూటి పక్షులని తెలుసుకోవాలి. కోడలిని ప్రేమించి పెళ్లి చేసుకొచ్చాడని అత్తగారికి కోడలిపై కోపం ఉండకూడదు.


అత్తగారు ఒక కోడలిని ఒక విధంగాను, మరో కోడలిని మరోవిధంగాను చూస్తుందని కోడళ్లు అత్తలతో పోట్లాటలకు దిగకూడదు.  ఇలా ఒకటేమిటి, కుటుంబంలో సవాలక్ష ఎదురయ్యే సమస్యల్ని కుటుంబంలోని వ్యక్తులంతా ఐక్యతతో ఎదుర్కోవాలి.  సఖ్యతను పెంచుకోవాలి. కానీ దాయాదుల్లా కలహాలతో కాపురం చేయకూడదు.


ఏడడుగుల సాక్షిగా వందేళ్ల కాపురానికి నాంది పలికిన మూడుముళ్ల బంధాన్నితెంచే శక్తి  అనుమానాలకు, అపోహలకు లేదు. పెళ్లి అనే బలమైన బంధాన్ని అనుమానాలు బలహీనం చేసి, అపోహలు పెరిగి భార్యభర్తల మధ్య ఆత్మహత్యలకు, హత్యలకు దారితీసేలా చేస్తోంది.


ఈ అనుమానాలకు పసిపిల్లల్ని బలిచేసేస్తున్నారు. భార్యా భర్తల మధ్యన అనుమానాలు, పోట్లాటలు రాత్రికి వచ్చి తెల్లవారేలోపు పోయే మబ్బుల్లా ఉండాలి. కానీ ఇద్దరి మధ్యన అనుమా నమనే గోడగా నిలవకూడదు.


ఇంకా స్త్రీ ఈవిషయంలో అబలగానే ప్రవర్తిస్తోంది. అసలు పరిస్థితుల్ని సుగమం చేసుకోవడంలేదు. తన ఆలోచనా విధానంతో బలహీనంగా ఆలోచిస్తోంది. ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని, తన శక్తి సామర్థ్యాలతో ఇంటా బయట మెప్పుపొందుతూ కుటుంబసభ్యుల మధ్యన వారధిగా నిలవాలి కానీ ఆత్మహత్యకు పాల్పడేటంత తప్పుచేయ కూడదు.


అమృతవర్షిణి అమ్మగా నిలవాలి కానీ ప్రాణాల్ని కబలించే కసాయితల్లిగా పేరు పొంద కూడదు. దేవుడు తానంతటా ఉండలేడు కాబట్టి అవసరమైన చోట్ల తన ప్రతిరూపంగా అమృతవర్షిణిగా అమ్మను సృష్టించాడంటారు. ప్రతి కుటుంబంకోసం పై ప్రతియింటా వెలసిన దైవం అమ్మ అనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి.


త్యాగశీలిగా, ఓర్పుతో, నేర్పుతో, చొరవతో కుటుంబ పాలనలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని పిల్లలను సమర్ధులుగా తీర్చిదిద్దిన అమ్మలు ఎందరో ఈ భువిపై ఉన్నారు.  తన తెలివి తేటలతో తన విజ్ఞతతో అందరి మన్ననలు పొంది, నొప్పించక తానొవ్వక, చాకచక్యంతో చక్కదిద్దుకున్న అమ్మలు ఈ భువిపై విలసిల్లారు విలసిల్లుతూ ఉన్నారు కూడా.


స్త్రీలకు ఆత్మహత్య చేసుకోవాలన్న, ఆలోచన కూడా కలుగకుండా ఆ ఇంటి కుటుంబ సభ్యు లంతా వారితో స్నేహభావాన్ని పెంపొందించగలిగితే ఈ ఆత్మహత్యలు కాస్తయినా తగ్గుతాయి.


భర్తలు భార్యలపై అనుమానాలు తగ్గించుకుని నమ్మకమనే వారధిపై కలకాలం నడచి, ఆనంద మయమైన జీవితాన్ని కొనసాగితే ఈ ఆత్మహత్యలు తగ్గుతాయి. మహిళ జనాభా పెరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: