భీష్మ ద్రోణుల్లాంటి వాజపేయీ కరుణానిధి వారి మధ్య స్నేహం రాజకీయం

1924వ సంవత్సరం డిసెంబర్ 25న భారతీయుల అత్యంత ప్రియమైన మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజపేయీ ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. ఆగష్ట్ 16, 2018న అటల్జీ మరణం జాతికి తీరని నష్టం, జనవాహినికి అంతులేని శోకం కలిగించింది. ఆయన నాయకత్వ పటిమ, సుదూర దృష్టి, పరిణితి, వాగ్ధాటి, వాక్చాతుర్యం అనితరసాధ్యం. 


సరిగ్గా ఇవే సుగుణాలు తమిళ మాజీ ముఖ్యమంత్రి కలైంగార్ కరుణానిధి (ఎంకే) లో పుష్కళం. సుగుణాలే కాదు, ఇరువురు ప్రజల నుండి ఎదిగిన నేతలే. ఇరువురికి ఘనతర రాజకీయ నేపధ్యం శూన్యమే. ఇరువురూ సాధారణ వ్యక్తులే. ఇరువురు అసాధారణత సంతరించుకున్నవారే.


అయితే అతి తక్కువ మందికే తెలిసిన రహస్యం వీరిరువురి మధ్య పెనవేసుకున్న స్నేహబంధం. ఇద్దరి ఆలోచనల తరంగ ధైర్ఘ్యం (వేవ్-లెంత్) దాదాపుగా ఒకేలా ఉండేది. వీరికి ఎంతో ఇష్టమైన గేయాలతోనే మైత్రితో కూడిన ప్రేమను పంచుకునేవారు. ఆ స్నేహసుమం సాహిత్యంతోనే పరవళ్లు తొక్కింది. సుబ్రమణ్యభారతి సాహితీ సుమాల పరిమళాలను స్వయానా కరుణానిధి కవితల నుండి ఆస్వాదించానని అనేవారు కరుణతో వాజపేయీ. అదే సాహితీ మైత్రిని వాజపేయితో కరుణ పంచుకునేవారట.    


కార్గిల్ పోరాటం జరిగిన సమయంలో అటల్జీ భారత ప్రధానిగా, కలైంగార్ కరుణానిధి తమిళనాడు అధినేతగా ఉన్నారు. పొరుగు రాజ్య కుటిల రాజకీయాలను చేధించుకొని కార్గిల్ లో ఘనతర విజయాన్ని భారత్ కు సాధించి పెట్టిన అటల్జీని, తనదైన పొయిటిక్ స్టయిలోనే, హృదయాంతరాళం నుండి పెల్లుభికిన పద్యశైలిలోనే కొనియాడారు  కరుణానిధి.


యాదృచ్చికంగా ఒకే సంవత్సరం 1924లో జన్మించిన వీరి మరణమూ అంతకంటే ఆశ్చర్యకరంగా ఒకే సంవత్సరంలో ఒకే నెలలో సంభవించింది. అంతా యాదృచ్చికమే వీరిరువురు మానవత్వం నిండిన మనసున్న వ్యక్తులుగా, వక్తలుగా, కవులుగా సాహితీ వ్యవసాయం చేసిన వారే కాదు, రాజకీయ సాహితీ సమరాంగణ సార్వభౌములే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: