కేరళాకు రూ.700 కోట్ల విరాళం ప్రకటించిన దుబాయ్ రాజు బిన్ రషీద్ మక్తూమ్

Edari Rama Krishna
గత కొన్ని రోజులుగా కేరళాను వరదలు ముంచెత్తాయి...భారీ వర్షాలతో కేరళా జలదిగ్భందం అయ్యింది.  భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో భారీ ఆస్తినష్టం జరిగింది, పంటలు నీట మునిగాయి, పెద్ద ఎత్తున రబ్బర్,కొబ్బరి, సుగంధ ద్రవ్యాల తోటలు నేలమట్టం అయ్యాయి. వంతెనలు కొట్టుకొని పోగా ఇళ్లు కూలిపోయాయి. కరెంటు స్థంబాలు నెలకొరగడంతో దాదాపు 80 శాతం కేరళ అంధకారంలోనే ఉంది. ఈ విపత్తు వల్ల కేరళకు దాదాపు 25వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. 

కాగా, కేరళాను ఆదుకుంటానికి యావత్ భారత దేశం ముందుకు వచ్చింది.   తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 25 కోట్ల రూపాయల సహాయం ప్రకటించడంతో పాటుగా మెట్రిక్‌ టన్నుల పాలపొడి ప్యాకెట్లను పెద్ద సంఖ్యలో ఆ రాష్ట్రానికి పంపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.10కోట్ల విరాళం ఇస్తోంది. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కేరళకు రూ.10కోట్ల సహాయం ప్రకటించారు. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌ రూ.10కోట్ల సాయం ప్రకటించారు.

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ రూ.10కోట్ల సాయం ప్రకటించారు.గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ రూ.10కోట్లు ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ రూ.5కోట్ల సాయం ప్రకటించారు. తాజాగా భారీ వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకుంది. కేరళా రాష్ట్రాన్ని ఆదుకుంటామని గతంలోనే ప్రకటించిన యూఏఈ ఉపాధ్యక్షుడు, దుబాయ్ రాజు బిన్ రషీద్ మక్తూమ్.. తాజాగా తమ దేశం తరఫున ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.700 కోట్ల సాయాన్ని ప్రకటించారు.

అంతేకాకుండా కేరళకు సాయం చేసేందుకు ప్రత్యేకంగా జాతీయ ఎమర్జెన్సీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మక్తూమ్ ప్రకటించారు.యూఏఈ రూ.700 కోట్ల విలువైన సాయాన్ని ప్రకటించిన విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ ఈ రోజు మీడియా సమావేశంలో ప్రకటించారు. తమపై ఎంతో ప్రేమ చూపిన యూఏఈ ప్రభుత్వానికి, పాలకులకు విజయన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: