కొంగర కాలన్ లో రియల్ ఎస్టేట్ భూం, ఝూం కు ₹300 కోట్ల పబ్లిసిటీ - ప్రగతి నివేదిక సభ నేపధ్యం?

అదుగో ఆ నైఋతీ మూలనుండి ఓ అంతర్జాతీయ విమానం రూపుదిద్దుకోనుంది. ఆ చదునైన ప్రాంతమంతా ఐటి సిటికి కేటాయిస్తున్నట్లు, ఆ కొండలపై ఫైనాన్సియల్ హబ్ గా మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది అంటూ  'అదిగో పులి అంటే ఇదిగో తోక'  అన్నట్లు ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా ఎక్కడ రంద్రాన్వేషణ చేసైనా తమ వ్యాపారానికి దారులు వెతుకుతూ, వేస్తూ ఎదురు చూస్తూ వుంటారు భూ వ్యాపారులు రియల్టర్లు. 


పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు తరువాత ఆ సేతు శీతాచలం భారత్  అంతా  రియల్ ఎస్టేట్ వ్యాపారం గత జీవితపు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ తలపే ప్రస్తుతం చేదు అనుభవం అన్నట్లు మారింది. అయితే శూన్యం నుంచే అవకాశాలు వెతుక్కునే భూ మరియు నిర్మాణ వ్యాపారులకు ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ప్రగతి నివేదన సభ రూపంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చక్కటి అవకాశం ఇచ్చింది. "ఔటర్ రింగ్ రోడ్డు" లో బంజరభూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. అదేమిటి అంటే అంతే మరి.

ఏ భూమికి ఏప్పుడు వైభం వస్తుందో ఆ విధాత కూడా చెప్పలేడు. ఆ అదృష్టం పేరే ప్రస్తుతం  "కొంగర కలాన్" ఈ ప్రాంతంలోని దాదాపు రెండు వేల ఎకరాల బీడు భూమి ని అద్భుతంగా చదును చేసి, అక్కడకు అతి సులభంగా చేరేందుకు 19 విభిన్న ప్రాంతాల నుంచి అంతర్ నగరానికి,  బాహ్య వలయ రహదారికి,  చక్కటి అనుసంధానం (కనెక్టివిటీ) కల్పించింది ప్ర.ని.సభ కోసం టిఆరెస్  ప్రభుత్వం. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి అయితే 9 ప్రాంతాల నుంచి కొంగర కలాన్ కు చేరుకోనే రహదారులు ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. 

ఒకప్పుడు ఎందుకు ఏ విధంగాను పనికిరాని ఈ మిట్టభూమి, ఈ ప్రాంతం ప్రగతి నివేదన సభ పుణ్యమా అని సర్వాంగ సుందరంగా తయారై అద్భుత రూపు సంతరించు కుంది. చక్కటి కనెక్టివిటీ, రహదారులు ఏర్పడ్డాక ఏ రియల్టర్లు చూస్తూ ఊరుకుంటారు! ఇప్పుడు అదే జరిగింది వారి చూపు ఈ ప్రాంతంపై పడటం ఆ వెనువెంటనే బరిలోకి దిగటం జరిగిపోయింది. 

వారి మాటలలో ఇప్పుడు ఈ ప్రాంతం గురించి వర్ణించటంలో అంతా "ఎడ్జెక్టివ్ — యాడ్-వెర్బు"  లే, బంగారు తెలంగాణాకు మకుటాయమానం బంగారు భూమి  అంటూ-అతి సమీప భవిష్యత్ లో "కొంగర కలాన్" లో అనేక మల్టీనేషనల్ కంపనీలు, భారత కార్పోరేట్ కంపెనీలు వస్తాయని, నివాస ప్రాంతాలకు ఇది స్వర్గధామంగా తెలంగానా ప్రభుత్వం మార్చబోతుందన్న ప్రచారం మొదలు పెట్టి ఊదరగొడుతూ ఒక ఊపు తెస్తున్నారు రియల్టర్లు. 

ఆ ఊపుకు ఒక్కసారిగా ప్రస్తుత ధర గజం భూమి ₹10 వేలరూపాయల నుంచి ₹15 వేలరూపాయల వరకు ఎగబాకింది. ఎకరం ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలు వరకు చేరిందని నగరంలో ప్రచారం ఊపందుకుంది. అప్పుడే చాలా తక్కువ ప్లాట్ లు మాత్రమే వున్నాయంటూ, కృత్రిమ కొరత సృష్టిస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు రియల్ ఎస్టేట్ పండితులు. కొంతమందైతే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ నేపధ్యమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని - ఇప్పటికే టిఆరెస్ నాయకులు భూములు స్వంతం చేసుకున్నారంటూ అందుకే "భూమి కొరత" వచ్చిందంటూ - పుకార్లు వ్యాపిస్తున్నాయి.

దీంతో రియల్ వ్యాపారులు — వీళ్ళ సుడి తిరిగి నాలుగు రాళ్లు వెనకేసుకొనే పనిలో పడిపోయారు. ఇప్పుడు హైదరాబాద్ నగర రియాల్టర్స్ చాలా బిజీగా మారిపోయారు. ఆఫ్ కోర్స్, నేపధ్యంలో నాయకులు ఉండనే ఉన్నారు. 'ధనం ఇదం మూలం జగత్' - అందుకే ఇప్పుడు కొంగర కలాన్ హైదరాబాద్ లో హాటెష్ట్ ప్రాంతం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: