ఎడిటోరియ‌ల్ : కాపు రిజ‌ర్వేష‌న్లు చెల్ల‌వా ? 50 % నిబంధ‌న రాజ్యాంగంలో లేదా ?

Vijaya
చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వం చేసిన కాపు రిజర్వేష‌న్ల బిల్లు చెల్ల‌దా ?  క‌ర్నాట‌క బీసీ క‌మీష‌న్ మాజీ ఛైర్మ‌న్ సిహెచ్. ద్వార‌కానాద్ వ్యాఖ్య‌లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. సాంకేతికంగా జ‌రిగిన పొర‌బాటు వ‌ల్ల కేంద్రం నివేదిక‌ల‌ను తిర‌స్క‌రించింద‌ట‌. పోయిన ఎన్నిక‌ల్లో కాపుల‌కు  బీసీ రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తింప‌చేస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన సంగ‌తి అందరికీ తెలిసిందే.  స‌రే, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏం  జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఒత్తిడికి లొంగిన చంద్ర‌బాబు రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఫైన‌ల్ చేయ‌టానికి జ‌స్టిస్ మంజూనాధ క‌మీష‌న్ వేసి చేతులు దులిపేసుకున్నారు. 


మంజూనాధ నివేదిక‌


ఇపుడా అంశ‌మే చంద్ర‌బాబుకు రివ‌ర్స్ అయ్యింద‌ట‌. నిజానికి కాపుల‌కు బీసీ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌ట‌మ‌న్న‌ది చంద్ర‌బాబు చేతిలో ప‌నికాద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయినా స‌రే చంద్ర‌బాబు పెద్ద డ్రామాకు తెర‌లేపారు. పోనీ  డ్రామానూనా ర‌క్తి క‌ట్టించారా అంటే అదీ లేదు. అధ్య‌య‌నం కోసం క‌మీష‌న్ వేసిన చంద్ర‌బాబు ఎన్డీఏలో నుండి బ‌య‌టకు వ‌చ్చేసే స‌మ‌యంలో క‌మీష‌న్ నివేదిక‌ను హ‌డావుడిగా తెప్పించుకుని మంత్రివ‌ర్గంలో త‌ర్వాత అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయించి కేంద్రానికి పంపేసి రిజ‌ర్వేష‌న్లు ఇచ్చేసినంత బిల్డ‌ప్ ఇచ్చారు. 


అసెంబ్లీ తీర్మానం


అయితే ఇక్క‌డే స‌మ‌స్యంతా మొద‌లైంది. మంజూనాధ క‌మీష‌న్ నివేదిక‌ను తెప్పించుకోవాల‌ని చంద్ర‌బాబు అనుకున్నారు. అదే విష‌యాన్ని జస్టిస్ మంజూనాధ‌కు చెప్పారు. కానీ అప్ప‌టికే ఏవో కార‌ణాల‌తో చంద్ర‌బాబుతో చెడిన మంజూనాధ ప‌ట్టించుకోలేదు. దాంతో మంజూనాధ ఊరిలో లేని స‌మ‌యంలో  క‌మీష‌న్ స‌భ్యుల‌తో మాట్లాడి నివేదిక‌ను తెప్పించేసుకుని మంత్రివ‌ర్గం, అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించేశారు.  అంటే క‌మీష‌న్ ఛైర్మ‌న్ సంత‌కం లేకుండానే స‌భ్యుల‌  సంత‌కాల‌తో ప‌ని కానిచ్చేశార‌న్న‌మాట‌. త‌ర్వాత ఎప్పుడో ఛైర్మ‌న్ సంత‌కంతో మ‌రో నివేదిక చంద్రబాబుకు అందింది లేండి.  


ఛైర్మ‌న్ సంత‌కం లేకుండానే నివేదిక‌


నిజానికి క‌మీష‌న్ ఛైర్మ‌న్ సంత‌కంతో ఇచ్చేదే అస‌లైన నివేదిక‌. ఛైర్మ‌న్ సంత‌కం లేకుండా స‌భ్యుల సంత‌కాల‌తో అందిన నివేదిక చెల్ల‌దు.  ఇక్క‌డా అదే  జ‌రిగింది. ఛైర్మ‌న్ సంత‌కాలు లేకుండా స‌భ్యులు అందించిన నివేదిక‌నే అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన చంద్ర‌బాబు దాన్నే ఢిల్లీకి పంపారు.   త‌ర్వాత ఛైర్మ‌న్ అధికారికంగా అంద‌చేసిన నివేదిక‌ను కూడా చంద్ర‌బాబు రెండోసారి ఢిల్లీకి పంపారు. 


50 శాతం రిజ‌ర్వేష‌న్ల నిబంధ‌న  రాజ్యంగంలో లేదు


ఎప్పుడైతే బీసీ క‌మీషన్ నివేదిక‌లు రెండుసార్లు వ‌చ్చి అందిందో కేంద్రం రెండు నివేదిక‌ల‌ను రెజెక్టు చేసింది. ఎందుకంటే, మొద‌టి నివేదిక‌లో ఛైర్మ‌న్ సంత‌కం లేకుండా కేవ‌లం స‌భ్యుల సంత‌కాలతో మాత్ర‌మే నివేదిక  అందింది. ఇక‌,  రెండో నివేదిక‌లో స‌భ్యుల సంత‌కాలు లేకుండా ఒక్క ఛైర్మ‌న్ సంత‌కం మాత్రమే ఉండ‌టం. అంటే ఏ నివేదిక‌లో అయినా ఛైర్మ‌న్ తో పాటు స‌భ్యుల సంత‌కాలున్న‌పుడే అది స‌మిష్టి నిర్ణ‌య‌మ‌వుతుంది.  ఈ సాంకేతిక కార‌ణాల‌ను చూపించి కేంద్రం  రెండు నివేదిక‌ల‌ను తిర‌స్క‌రించింది. అదే విష‌యాన్ని ద్వార‌క‌నాద్ చెప్పారు. ఇక్క‌డే ద్వార‌క‌నాద్ మ‌రో విష‌యం కూడా చెప్పారు. రిజ‌ర్వేష‌న్లు 50 శాతం మించ‌కూడ‌ద‌న్న నిబంధ‌న రాజ్యాంగంలో లేద‌ని కూడా స్ప‌ష్టంగా చెప్పారు. ఆ నిబంధ‌న పెట్టింది జ‌డ్జీలేన‌ట‌. మొత్తానికి వ‌చ్చే ఎన్నిక‌ల ముందు ద్వార‌క‌నాద్ కొత్త చిచ్చు పెట్టార‌నే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: