ఏపీలో ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మార్పు ఆ పార్టీలో పెద్ద కల్లోలానికి దారితీస్తుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ సీనియర్‌గా ఉన్న మర్రి రాజశేఖర్‌ను తప్పించడంతో అక్కడ అసంతృప్తి జ్వాలలు ఎలా ఎగిసిపడుతున్నాయో ? చూస్తునే ఉన్నాం. ప్రకాశం జిల్లా కొండపిలోనూ ఇదే తంతు నెలకొంది. ఇక తాజాగా ఇప్పుడు ఈ అసమ్మతి పరంపర రాజధాని జిల్లా అయిన కృష్టా జిల్లాకు పాకింది. విజయవాడ నగరంలో కీలకమైన విజయవాడ సెంట్రల్ సీటును మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకు కాకుండా మరో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఇస్తున్నట్టు వార్తలు రావడంతో విజయవాడ వైసీపీలో అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది.
రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ పరిశీలకులుగా వచ్చిన కొందరు పెద్దలు విజయవాడ సెంట్రల్ సీటులో మల్లాది విష్ణు పని చేస్తారని... రాధా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచాయిగా జగన్ అభిప్రాయాన్నే తెలియ చెప్పడంతోరాధా తీవ్ర అసంతృప్తితో ఆ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిని బట్టీ విజయవాడ సెంట్రల్ సీటు విష్ణుదే అని రాధాకు ఇక అసెంబ్లీ సీటు లేనట్టే అని ఆయన రాజకీయ జీవితం దాదాపు క్లోజ్ అయ్యినట్టే అన్న వార్తలు ఒక్కసారిగా వెలువడ్డాయి. దీంతో వంగవీటి అనుచరుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
రాధా ఫ్యూఛర్ ఏంటి అన్న పశ్న సహజంగానే తలెత్తింది. తాజాగా సోమవారం ఉదయం రాధా వర్గం తీవ్ర ఆవేశంతో ఊగిపోయింది. రంగా, రాధా మిత్రమండలి ఆధ్వర్యంలో రంగా అనుచరులు రాధా ఇంటి వద్దకు వచ్చి వైసీపీ ఫ్లెక్సీలు, బేనర్లు తొలిగించారు. ఒకరిద్దరు అనుచరులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రాధా ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వంగవీటి అనుచరుల్లో వంగవీటి శ్రీనివాసప్రసాద్ వైసీపీకి రాజీనామ చేసి జనసేనలోకి వెళ్లేందుకు ఏర్పాటులు చేసుకుంటున్నారు.ఇక రాధా కూడా గత్యంతరం లేక వైసీపీని వీడి జనసేనలోకి వెళ్లి పోతారన్న ప్రచారం కూడా సోమవారం జోరుగా ఊపందుకుంది.
పవన్ కళ్యాణ్‌కు రాధాకు ఉన్న సన్నిహిత సంబంధం నేపథ్యంలో కొందరు మధ్య వర్తులు ఇప్పటికే జనసేనలో చేరాలని రాధాకు ఆహ్వానాలు కూడా పంపినట్టు సమాచారం.దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ వైసీపీ అధిష్టానం విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవిని రాధా వద్దకు రాయభారంగా పంపినట్టు సమాచారం. పార్టీ ఆదేశాల మెరకు రాధా ఇంటికి వెళ్లిన రవి తొందర పడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పేపర్లలో వచ్చిన వార్తలను ప్రాతిపదికగా తీసుకుని లేనివి ఊహించుకోవద్దని చెప్పారట. ఏపీలో ఇంకా ఏ నియోజకవర్గంలోనూ వైసీపీ నుంచి పార్టీ అభ్యర్థులపై ప్రకటన రాలేదని... ఎవరూ ఆందోళన చెందవద్దని రవి రాధా అనుచరులకు సర్ది చెప్పడం జరిగింది.
ఆదివారం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జిల్లా ఫంక్షన్‌కు వచ్చారని ఆ ఫంక్షన్లో రాధా ఆయన కలుసుకున్నారని... అంతకు మించి ఇక్కడ ఏమి జరగలేదని చెప్పి ఆయన రాధా సన్నిహితులకు, అనునూయులకు సర్ది చెప్పినట్టు తెలిసింది. ఏదేమైనా విజయవాడ సెంట్రల్ సీటు వివాదం వైసీపీలో పెద్ద ముసలమే రేపేలా కనబడుతుంది. మరి ఈ వివాదాన్ని జగన్ ఎలా పరిష్కరిస్తారో ? చూడాలి.