తెలంగాణాలో 'కేసిఆర్ ఖేల్ ఖతం' కానుందా?

తనకు టికెట్‌ ఇవ్వకుండా నిరాకరించిన టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్‌రావు పై ఆ పార్టీ అసమ్మతి నేత మాజీ మంత్రి కొండా సురేఖ అత్యంత తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. కేసీఆర్‌ ది తుగ్లక్‌ పాలన అని, ధనికులకే మేలు చేసే విధంగా అన్యాయమైన పాలన చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు.


"నాకు జరిగిన నమ్మకం ద్రోహం గురించి కేసీఆర్‌, కేటీఆర్‌ ను అడిగినా సమాధానం రాలేదు. పార్టీ క్రమశిక్షణ  ఉల్లంఘించిన వారికి టికెట్లు రావని కేటీఆర్‌ అంటున్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేయడమేనా మేం చేసిన క్రమశిక్షణ ఉల్లంఘన?" అని ప్రశ్నించారు.


ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఒక్క రోజు కూడా సచివాలయానికి వెళ్లలేదని మండి పడ్డారు. ఓటమి భయంతోనే ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని విమర్శించారు. అయితే కేసిఆర్ కు కొండా సురేఖ రాసిన బహిరంగ లేఖ టిఆరెస్ పార్టీలో కలకలం మాత్రమే కాదు తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. కొండా దంపతులు ఈ రోజు అంటే మంగళవారం హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ లో విలేకరులతో మాట్లాడిన సంధర్భంగా ఆ లేఖ చదివి వినిపించారు. ఆ లేఖ సారాంశం:


“ప్రజాస్వామ్య విలువలకు పాతర వేసిన కేసీఆర్‌కు నా బహిరంగ లేఖ. మహిళలకు క్యాబినెట్‌ లో చోటు ఇవ్వని పాలన. ప్రజలని ఒక్కసారి కూడా కలవని పాలన. ఎంపీ, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని గుడ్డి పాలన. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవని దుర్మార్గ పాలన. సోనియా లేకుండా తెలంగాణ వచ్చేది కాదు అని అసెంబ్లీలో మొదట ప్రవేశ పెట్టిన తీర్మానం ఒక్కసారి కేటీఆర్‌ చూడాలి. నాలుగేళ్లు అయినా నాకు కేసీఆర్‌ అపాయింట్మెంట్ దొరకదు. సీఎంవో నుంచి అపాయింట్మెంట్లు ఉండవు. ఇక మిమ్మలని ఎలా నమ్మాలి? ఆత్మ గౌరవం మాకు ముఖ్యం. టీఆర్‌ఎస్‌లో ఉన్నన్ని రోజులు  ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఉన్నాం. బీసీ మహిళ అయిన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఒకరు మందు గోళీలు, ఇంకొకరు భోజనం పెట్టినందుకు రాజ్యసభ సీటు ఇచ్చారు. ఎంపీలుగా ఉన్న బాల్క సుమన్, మల్లారెడ్డికి ఎమ్మెల్యేగా టికెట్లు ఎందుకు ఇచ్చారు? శ్రీకాంతాచారి తల్లికి ఒక్క పదవి కూడా ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదు?


ఎన్నికలు ఆలస్యం అయితే ఓడిపోతామని "ముందస్తు ఎన్నికలు" ఎందుకు కేసీఆర్ వెళు తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కేటీఆర్‌ చేతిలో తెలంగాణను పెట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ పెట్టిన కొన్ని పథకాల వల్ల ప్రజాధనం  దుర్వినియోగం అవుతోంది. రైతుబంధు పథకం వల్ల ధనిక రైతులకు లాభం జరుగుతోంది. మేము ఎక్కడా క్రమశిక్షణ ఉల్లంఘించలేదు.  మిమ్మలి తిట్టిన వాళ్లను మంత్రులుగా చేయడమేనా? క్రమశిక్షణ అంటే. కేసీఆర్ పాలన అంటేనే అవినీతి పాలన. వేల కోట్ల ప్రజాధనంతో కేసీఆర్ ఖజానా నిండిపోయింది. హైదరాబాద్‌ లో కేటీఆర్‌, ఆయన బినామిలు సెటిల్మెంట్లు చేశారు. విచ్చలవిడిగా కేటీఆర్‌ బార్ల కు అనుమతులు ఇచ్చారు.  ఉద్యోగుల సమస్య తీర్చలేని అసమర్థ పాలన కేసీఆర్‌ది.


ఎర్రబెలిని పార్టీలో చేర్చుకొని కులతత్వంతో మమ్మల్ని అణగదొక్కారు. పుటకో మాట మాట్లాడటం, పెద్దలని అవమానించడం కేసీఆర్‌ కు అలవాటు. తెలంగాణ కేసీఆర్ స్వంత ఆస్తి కాదు, కేటీఆర్‌ కు రాసివ్వడానికి.  కేటీఆర్‌ సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదు. కవిత అమెరికా నుంచి వచ్చినప్పుడు తిరిగిన కారు ఎవరిదో చెప్పాలి. సీఎంవో లో ఉన్న పెండింగ్‌ ఫైళ్లు ప్రజల ముందు ఉంచాలి. బీజేపీ తో మీకున్న లోపాయకారి ఒప్పందాలు ఏమిటి?

 

డ్రగ్స్, నయీం కేసులు ఏమయ్యాయి? కేసీఆర్ ఎప్పుడూ చంద్రబాబుతో వైరమే పెట్టుకున్నారు. సఖ్యత లేదు. మరి హరికృష్ణ ఎవరు? ఉద్యమకారుడా? ఎవడబ్బ సొమ్ము అని హరికృష్ణ స్మారకానికి భూమి ఇచ్చారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు, జయశంకర్ తెలంగాణ జాతిపిత. ఆయన బతికి ఉంటే, ఈ పాలన చూసి ఆత్మహత్య చేసుకునేవారు. కేటీఆర్‌ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు.


కేటీఆర్‌ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండాలి. ప్రతిపక్షాల చేతిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓడి పోనుంది. మేం హరీష్ రావు వర్గం. ఇంకా చాలా మంది ప్రజా ప్రతినిధులు మాలా ఉన్నారు. మాకు పదిహేను పార్టీల నుంచి ఆహ్వానం వస్తుంది. అవసరమైతే సీఎం అభ్యర్థిని చేస్తామంటున్నారు. నాలుగు రోజుల్లో మా కార్యాచరణ ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.


టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితాలో కొండా సురేఖకు చోటు (వరంగల్‌ తూర్పు) లభించక పోవడంతో తన భర్త, ఎమ్మెల్సీ మురళీధర రావుతో కలసి ఈ నెల 8న విలేకరు ల సమావేశం ఏర్పాటు చేసి కేటీఆరే తన టికెట్‌ ను అడ్డుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు టికెట్‌ కేటాయించక పోవడానికి రెండు రోజుల్లో కారణాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


వినాయక చవితి నేపథ్యంలో ఇన్నాళ్లూ వేచి చూసినా టీఆర్‌ఎస్‌ పెద్దల నుంచి ఏ మాత్రం స్పందన రాలేదు. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్‌ లో చేరేందుకు రంగం సిద్ధం చేసు కున్నట్లు ఆ పార్టీ తరుపున వరంగల్‌ తూర్పు, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో రెండు చోట్ల పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం తరుపున వీరికి హామీ లభించినట్లు సమాచారం.


తెలంగాణాలో టిఆరెస్ పై వ్యతిరేఖత ముఖ్యంగా గ్రామీణ తెలంగాణాలో చాపక్రింద నీరులా పాకిపోతున్నట్లు తెలుస్తుంది. కారణం ప్రత్యేక తెలంగాణా పోరాటం చేసి అమరులైన వారి కుటుంబాలు దిక్కులేకుండా పోగా మొత్తం అధికారం గంపగుత్తగా కలవకుంట్ల చంద్రశేఖర రావు ఉరఫ్ కేసిఆర్, కలవకుంట్ల తారక రామారావు ఉరఫ్ కేటిఆర్, కవిత (దేవనపల్లి) అనే ఒకే కుటుంబం & కేసిఆర్ మేనల్లుడు తన్నీరు హారీష్ రావు గుప్పెట్లోకి చేరిపోయింది.


రాష్ట్ర సాధనలో ఉద్యమాన్ని ముందుండి నడిపిన కోదండ రాం లాంటి వారికి మాత్రం వీళ్ళ తిట్లదండకాలే మిగిలాయి. వీరి నలుగురికి తోడు జోగినపల్లి సంతోష్ కుమార్ (కేసిఆర్ తోడల్లుని కొడుకు వరసకు కొడుకే) అనబడే మరో దగ్గరి వ్యక్తి తెలంగాణా రాష్ట్ర టిఆరెస్ జనరల్ సెక్రెటరి పదవి దక్కించుకొని పంచపాండవులై అధికారాన్ని అవిచ్చిన్నంగా సొంతం చేసుకున్నారు. ఈ వ్యవహారం తెలంగాణా వాసులకు అంతగా రుచించలేదు. ఇది అందరికి తెలిసిన రహస్యమే. అయితే అధికారం దాని ద్వారా తలకెక్కిన మధంతో అధికారం పంచపాండవులకు కాకుండా తమ చతుష్టయం చేతుల్లో ఉండాలని భావించారో ఏమో? లేకపోతే హరీష్ రావు తన కుమారుడు యువరాజ పట్టాభిషెకం అంటే తరువాతి ముఖ్యమంత్రి కావటానికి అడ్డుపడవచ్చనే అనుమానం కేసిఆర్ లో పెనుభూతమై మెదడును తినేసి ఉండవచ్చని అనుకుంటున్నారు జనం.


అయితే కెసిఆర్ కుటుంబలోని వ్యక్తుల్లో కేసిఆర్ తరవాత అంతటి రాజకీయ సమర్ధత ఉండి ప్రజాభిమానం అత్యధికంగా ఉంది హరీష్ రావు కే. నిజంగా చెప్పాలంటే హారీష్ రావే అత్యంత సమర్ధుడంటారు. అందుకే "తన కొడుకు" (బాహుబలి సినిమాలో - నా కోడుకు - మన కొడుకు అని బిజ్జలదేవుడు నాజర్ పాత్ర) అన్న స్వార్ధం "తన కుటుంబ సభ్యులు" అన్న దాని నుంచి కుంచించుకు పోయి "నా కొడుకు & నా కూతురు" అనే లెవల్ కు పడిపోయింది. 


దరిమిలా,  తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యవహారంపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నిట్ట నిలువునా చీలు తుందని, ఆ పార్టీని ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని ఆయన వ్యాఖ్యానించారు.


హరీశ్‌ రావు చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. హరీశ్‌ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయని, పార్టీలో చీలికలు రావడం తప్పదని అన్నారు కేటీఆర్‌ తన స్థాయిని మించి ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు.


గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన న్యాయవాదులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్‌రెడ్డి తమ మద్దతు దారులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సోమవారంనాడు లక్ష్మణ్ మాట్లా డుతూ:  


*అరవై ఏళ్లు తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని అన్నారు.

*తెలంగాణ ఉద్యమం ప్రజల్లో టీడీపిని దోషిగా నిలబెట్టిందని, అటువంటి టీడీపీ ఉన్న మహా కూటమిలో కోదండరాం చేరుతారని అనుకోవడం లేదని అన్నారు.

*ఒకవేళ కోదండ రామ్ మహాకూటమిలో చేరితే ఉద్యమ నాయకుడిగా ఉన్న విలువ, గౌరవం పోతుందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.  చంద్రబాబు మహాకూటమితో కోదండ అంటకాగితే, తెలంగాణ ప్రజలు క్షమించరని అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: