ఇంట్లో శాంతభద్రతల సమస్య - అమెరికాలో డాబు దర్పాల డప్పుల మోత - ఇదీ చంద్రబాబు తీరు

ఏమైనా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరే వేరు. శూన్యంలో సుందర నందన వనాలతో కూడిన సుదూర స్వప్నాలను సృష్టించగలగటమే కాదు జనాల కళ్ళల్లో కలువలు పెట్టి దృశ్యం చూపించగరు. అబద్ధాలను సిగ్గుపడకుండా అదీ మరచి పోకుండా పదే పదే ఆడెయ్యటంలో ఆయనకు సరిరాగల రాజకీయ నాయకుడు ఈ అనంత విశ్వాంతరాళం లో మరొకరు కనిపించరు. ఆధునిక గోబెల్ అనదగ్గ ఈయనకు విదూషక సలహాదారు కుటుంబరావు తోడు. ఇంకేం చంద్ర మాయకు ఆదీ అంతం లేనేలేదు. 


జనాలను వెధవాయిలను చెయ్యటంలో ఈ అబద్ధాల సామ్రాట్టుకు ఆయన ఆర్ధిక సలహాదారు ఆధునిక విదూషకుడు కుటుంబరావు పాత్ర అనిర్వచనీయం. అదే విషయాల ను నిన్న మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ సోదాహరణంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన విలేకరుల సమావేశంలో చక్కగా విశదీకరించారు.  

*అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల హత్య తర్వాత , పోలీస్ స్టేషన్ ల ముట్టడి జరిగిందని, దాంతో అక్కడ పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసిందని చెపుతూ, మరి రాజమండ్రి వద్ద పుష్కరాలలో ఇరవై తొమ్మిది మంది చనిపోతే ఒక్కరిని కూడా ఎందుకు సస్పెండ్ చేయలేదని మాజీ ఎమ్.పి ప్రశ్నించారు.


*అరకు ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, మరి పుష్కరాల తొక్కిసలాటకు అక్కడి మరణాలకు ఎవరిని ఎందుకు బాద్యులను చేయలేదని? ఆయన ప్రశ్నించారు.


*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకుటుంబ సపరివార సమేతంగా పుష్కరఘాట్ లో పుష్కర స్నానం చేయడం వల్లే ప్రజలందరిని కొన్ని గంటల సేపు నిలపటం  వల్లే ఒక్కసారిగా కదలిన జనం అదుపుతప్పి తొక్కిస లాటకు దారి తీసింది. కలెక్టర్ నివేదిక కూడా అదే చెప్పింది. మరి దీనికి ముఖ్యమంత్రిని బాధ్యులను చేయరా? అన్న ధొరణిని వ్యక్త పరిచారు.


*కాని సోమయాజులు విచారణ కమిషన్, ప్రాధమిక నివేదిక ఇచ్చిన కలెక్టర్ ను కనీసం విచారించలేదని మాజీ ఎమ్.పి ఉండవల్లి వ్యక్తం చేశారు. అసలు నివేదిక పై ఉన్నది సోమయాజులు సంతకమేనా? అని ఆయన వ్యక్తం చేసిన అనుమానం నిజంగా సంచలనమే.


*పుష్కర మరణాలపై విచారణ జరిపిన సోమయాజులు విచారణ కమిషన్‌ సంప్రదాయాలను తప్పుపడుతూ నివేదిక ఇచ్చిందని విమర్శించారు. "ఈ లెక్కన ముహూర్తం చూసుకుని పుష్కరస్నానాలు చేసిన సీఎంను తొలి ముద్దాయి, ముహూర్తబలం గురించి చెప్పిన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును రెండో ముద్దాయి, మీడియాను మూడో ముద్దాయిగా భావించాల్సి ఉంటుందేమో?" నని ఉండవల్లి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.


*టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన "అన్న క్యాంటీన్‌" లు అడుగడుగునా అవినీతి మయమే నని మాజీ ఎమ్.పి ఆరోపించారు.

*ఆదరణ పథకం కూడా ఆసాంతం అవినీతి మయమేనని తెలిపారు.


*పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసత్య ప్రచారాలను మానుకోవాలని, ఫిల్‌ ఛానెల్‌ వద్దకు బస్సుల్లో జనాలను తీసుకువచ్చి ప్రాజెక్టు పనులు అద్భుతంగా వేగంగా జరుగు తున్నాయని జనాలను తప్పుతోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అయితే నేటికీ టన్నెల్స్‌ లేవు, డిజైన్లు ఖరారు కాలేదు, డ్యామ్‌ పనులు ప్రారంభమే కాలేదు, అలాంటప్పుడు 2019 లో నీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.


*ప్రభుత్వానికి, గుత్తేదార్లకు కుదిరిన ఒప్పందం ప్రకారం, కాంట్రాక్టరు సొంత ఖర్చుతో డంపింగ్‌ యార్డులను కట్టించి, పోలవరంవద్ద తవ్వినమట్టిని అక్కడికి తరలించాల్సి ఉండగా, పొలాల్లో వదిలేస్తుండడంతో రైతుల అనేక ఇక్కట్లకు ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. ఈ విషయంలో కోర్టులు ఇచ్చిన "స్టే"లను కూడా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని, పోలీసుల అండతో రైతులపై దౌర్జన్యాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.


*డంపింగ్‌ యార్డులను ఎందుకు నిర్మించడం లేదని అడిగే ధైర్యం ప్రభుత్వానికి ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు.

*ప్రాజెక్టు నిర్మాణంలో అధిక చెల్లింపులు, ఇతర అంశాలపై "కాగ్‌" లేవనెత్తిన అంశాలపై శాసనసభలో సమూలంగా చర్చ జరగాలని మాజీ ఎంపి డిమాండ్‌ చేశారు. 

*అమరావతి బాండ్స్ విషయంలో కూడా ఉండవల్లి చర్చించారు. ఆ బాండ్లపై ఇచ్చే వడ్డీ రేట్ మరీ ధారుణం. అలాగే బ్రోకరేజ్ ₹ 17 కోట్లు వినటానికే విడ్డూరం అన్నారు 


ఇక చంద్రబాబు ఒక ప్రైవేట్‌ ఏజెన్సీ ఆహ్వానంతో అమెరికా వెళ్ళగా (అది యిడ్ ఇన్విటేషన్ అంటున్నారు) చంద్రబాబు ఐక్యరాజ్యసమితి సమావేశానికి, అదీ యుఎన్  జనరల్ అసెంబ్లీలో ప్రసంగించ టానికి వెళ్లినట్లుగా ఇంకొందరు అత్యుత్సాహంతో ప్రచారం చేస్తున్నారని ఉండవల్లి విమర్శించారు.


ఏపీ ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కుటుంబరావు సిద్ధమైతే తాను పోలవరం, ఆదరణ, అన్న క్యాంటీన్ల పై చర్చకు సిద్దమని సవాలు విసిరారు. చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయంలో కుటుంబరావు పాత్ర ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు 2019నాటికి ఎలా పూర్తి అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. అయినా గుత్తేదార్లకు మాత్రం అదనపు బిల్లులు చెల్లిస్తున్నారని, కాగ్ తీవ్రంగా ఈ విషయంపై తప్పు పట్టిందని ఆయన అన్నారు.


ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక అమరావతి బాండ్లు, పైన వివరించిన అంశాలతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చకు సిద్ధమేనని కుటుంబరావు ఇటీవల హైదరాబాద్‌ లో తనతో చెప్పినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: