లోకేష్ లక్ష్యంగా కోర్టులో కేసు

Vijaya

చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై కోర్టులో కేసు వేసేందుకు రంగం సిద్దమవుతోందా ? అవుననే అంటున్నారు బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు. ఐటి విభాగాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు, చినబాబు భారీ అవినీతికి లాకులెత్తినట్లు జివిఎల్ ఆరోపిస్తున్నారు. ఐటి కంపెనీల పేరుతో గడచిన నాలుగేళ్ళుగా కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయనంటున్నారు. ఐటి కంపెనీల ప్రోత్సాహకాల ముసుగులో షెల్ కంపెనీలను లోకేష్ సృష్టిస్తున్నట్లు మండిపడుతున్నారు.

 ఐటి కంపెనీల ఏర్పాటు పేరుతో ఇప్పటి వరకూ వేల కోట్లు చేతులు మారిందనటానికి జారీ అయిన జీవోలే ఆధారంటున్నారు జివిఎల్. లోకేషే స్వయంగా చూస్తున్న  ఐటి శాఖలో 2014 నుండి వచ్చిన కొత్త కంపెనీలేమీ లేవట. అందుకే ఐటి శాఖలో జరిగిన అక్రమాలను బయటపెట్టే ఉద్దేశ్యంతో తాము తొందరలో కోర్టును ఆశ్రయించబోతున్నట్లు చెప్పారు. ఎక్కడెక్కడ ఐటి కంపెనీలు వచ్చాయనే విషయాన్ని ప్రభుత్వమే వివరాలు అందించాలని డిమాండ్ కూడా చేశారు. అవసరమైన వివరాల కోసం తాము ప్రయత్నిస్తే ఐటి శాఖ సహకరించలేదని కూడా జివిఎల్ మండిపడ్డారు. కావాల్సిన వివరాల కోసం సమాచార హక్కు చట్టంలో దరఖాస్తు చేసినా ఉపయోగం లేకపోయిందన్నారు. 

ఐటి కంపెనీల ఏర్పాటుకు 2014 నుండి 2020 వరకూ ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ జీవో కూడా విడుదలైన విషయం చెప్పారు. విలువైన భూములను నామమాత్రపు ధరకు తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేస్తున్నట్లు జివిఎల్ ధ్వజమెత్తారు. మూడేళ్ళ తర్వాత తామిచ్చిన భూములను కమర్షియల్ రేట్లకుఅమ్ముకోవచ్చనే వీలు కల్పించినట్లు జివిఎల్ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి కేసే ఈమధ్యనే మాజీ న్యాయమూర్తి శ్రవణ్ కుమార్ కూడా వేశారు. ఇపుడు జివిఎల్ చేసిన ఆరోపణలనే శ్రవణ్ కూడా తన పిటీషన్లో చేశారు. కాకపోతే ఆరోపణలకు తగిన ఆధారాలు లేవంటూ కేసును హైకోర్టు వాయిదా వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు జివిఎల్ కూడా అవే ఆరోపణలతో కేసు వేస్తే ఏమవుతుంది ? కొట్టేస్తుందంతే. 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: