ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం! అమిత్ షా

సుప్రీం కోర్ట్ తీర్పుతో శబరిమలలో అలజడులే కాదు, హిందూ సమాజం లోలోపల కుమిలిపోతూనే ఉంది. ఆ తీర్పుపై ప్రజాభిప్రాయం గమనించకుండా రాజకీయ మత ప్రయోజనాలే పరమార్ధంగా ముందుకెళుతున్న కేరళ ముఖ్యమంత్రికి ఆయన సిపిఎం కు రానున్న ఎన్నికల్లో నూకలు చెల్లినట్లేనని అంటున్నారు. ఇదే సంధర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షుణి వ్యాఖ్యలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి.   

"శబరిమల పై సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలన్న కేరళ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన అయ్యప్ప భక్తుల అరెస్టులు ఇలాగే కొనసాగితే మేం (బీజేపీ) ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం" అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హెచ్చరించారు.  సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌ నిప్పు తో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆరెస్సెస్‌, బీజేపీ, ఇతర సంఘాలకు చెందిన రెండువేల మందికి పైగా భక్తులను కేరళ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టించిందని అమిత్ షా ఆరోపించారు.



నిన్న శనివారం కన్నూర్‌ లో జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన అధ్యక్షుడు అమిత్‌ షా, కేరళ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర అయ్యప్ప ఆలయాల్లో ఎక్కడా మహిళల ప్రవేశంపై ఆంక్షలు లేవని, గుర్తు చేస్తూ "శబరిమల ఆలయ విశిష్టత" ను కాపాడాలని డిమాండ్‌ చేశారు. హిందూత్వం లో మహిళల పట్ల ఎక్కడా వివక్ష ఉండదని అన్నారు. కొన్ని ఆలయాల్లో మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారని, పురుషులను రానివ్వరని, అంతమాత్రాన అది మహిళల పట్ల కాని పురుషుల పట్ల గాని వివక్ష చూపినట్లు కాదని చెప్పారు. 

ఆలయ ఆచారాలు, ప్రార్థనలో ఒక భాగమని తెలిపారు. కేరళలోని సీపీఎం సర్కారు దేవాలయాలపై కుట్రతో తన పన్నాగాలు పన్నుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు సృష్టించారని ధ్వజమెత్తారు.


ఆశ్రమంపై ఆందోళన కారుల దాడి:

శబరిమల ఆలయంలోని మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ, సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా స్వామిజీ దానికి మద్దతు నిచ్చారు. ఆ స్వామిజీ ఆశ్రమంపై ఆందోళన కారులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన తిరువనంతపురలోని 'కుదంమాన్ కడవు'లో చోటుచేసుకుంది. దాడి చేసిన దుండగులు రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టారు. నిన్న శనివారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.నిందితులకోసం గాలిస్తున్నారు.

స్వామి సందీపానందగిరి ఆశ్రమంపై దాడి ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందించారు. స్వామిజీ చర్యలను వ్యతిరేకించిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని విజయన్‌ అన్నారు. అయితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ప్రభుత్వం ఎంతమాత్రం అంగీకరించబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేరళలోని పవిత్ర శబరిమల ఆలయంలోకి 10-50 మధ్య వయసు గల మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయంతెలిసిందే.

ఈ తీర్పునకు స్వామి సందీపానందగిరి మద్దతిచ్చారు. దీంతో గతంలో ఆయనకు బెదిరింపులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సుప్రీం తీర్పుతో కేరళలో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవల మాసపూజల నిమిత్తం శబరిమల ఆలయాన్ని తెరిచారు. ఈ సమయంలో కొందరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: