కాంగ్రెస్ లో ఉలికిపాటు...అంతా అందులోకేనా !!

Satya
ఒక చోట రావాల్సిన ప్రకంపనలు మరో చోట వస్తున్నాయి. ఆ శిబిరంలో గందరగోళం రేగుతుందనుకుంటే ఈ శిబిరంలో రచ్చ జరుగుతోంది. లాభపడ్డామనుకుంటున్న వాళ్ళే తిరగబడుతున్నారు. బతికిన చోట చెడ్డ అనిపించుకోలేకనా, లేక మరే ఇతర కారణాలో తెలియదు కానీ ఖద్దరు పార్టీకి కంగారు ఎక్కువైంది.


వరుస రాజీనామాలు :


కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఉంటుందని తెలిసిన మరుక్షణం హస్తం పార్టీ తీరు ఒక్కలా లేదు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మొన్ననే రాజీనామా చేసి పారేశారు. ఈరోజు మ‌రోకాయన వంతు. ఆయన ఏకంగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీ రామచంద్రయ్య. చంద్రబాబు పాపాలు మేము మోయలేమంటూ రామంచంద్రయ్య కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టేశారు.   అన్నట్లు వీళ్ళకంటే ముందు ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ నాదెండ్ల కాంగ్రెస్ కి రాం రాం అనేసారు.ఇక మరెంతమంది ఈ బాటలోకి వస్తారో చూడాలి.


ఎందుకిలా :


అసలు ఎందుకు ఈ రాజీనామాలు, నిజానికి ఇవి జరగాల్సింది టీడీపీలో కదా. అంటే బయట వినిపించే మాట కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందిట. అందువల్ల స్వేచ్చగా బయటకు వస్తున్నారుట. మరి తమ్ముళ్ళకు అది లేదా అంటే లేదనే చెప్తున్నారు. అక్కడ కూడా అసంత్రుప్తి మరుగుతోంది. కానీ వేడెక్కడానికి ఇంకా టైం తీసుకుంటుందట. ఇకపోతే కాంగ్రెస్ తో వేగలేం అంటున్న నాయకులంతా జనసేనలోకి పోతున్నారు. మరి వారు అక్కడ ముందే బెర్త్ కన్ ఫర్మ్ చేసుకుని ఇక్కడ పితలాటం పెడుతున్నారా అన్న అనుమానాలూ కలుగుతున్నాయి.


టీడీపీలో తుపాను నిశ్శబ్దం :


ఇకపోతే టీడీఎపీలో మాత్రం తుపాను నిశ్శబ్దం కనిపిస్తోంది అంటున్నారు. పొత్తులపై పెదవి విప్పని వారంతా ఒకే అన్నట్లు కాదనీ అంటున్నారు. సమయం చూసుకుని బయట పడేందుకు వారు చూస్తున్నారుట. ముఖ్యంగా తెలంగాణాలో జరిగే ఎన్నికలను చూసిన తరువాత ఓ నిర్ణయం తీసుకునేందుకు వీరు రెడీ అవుతారని టాక్. అక్కడ మహా కూటమి గెలిస్తే వీరు సర్దుకుపోతారు. లేకపోతే మాత్రం జెండా ఎగరేస్తారని ప్రచారం సాగుతోంది. ఇంతకీ తెలంగాణా ఫలితాలు రివర్స్ అయితే బాబే కాంగ్రెస్ కి రాం రాం అంటారని, అందువల్ల మనం బయట పడి చెడ్డ కావడం దేనికని తెలివైన తమ్ముళ్ళు కొంతమంది అంటున్నారు. చూడాలి. ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: