అసెంబ్లీ సమావేశాలు ఇప్పట్లో లేనట్లే?

 హైదరాబాద్: వర్షకాల అసెంబ్లీ సమావేశాలు ఇప్పట్లో లేనట్లే అగుపిస్తోంది. సాధారణంగా ప్రతిఏటా జూలై, ఆగస్టు నెలలో రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం ఆనవాయితీ. కానీ, దఫా ఆ ఆనవాయితీ రాష్ర్ట సర్కార్ తిలోదకాలిచ్చేనట్లే కనిపిస్తోంది. వేసవి, వర్షాకాలపు, శీతాకాలపు సమావేశాలు జరిగేవి. అంటే ఏడాదికి మూడుమార్లు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేవారన్నమాట. అది కాస్త, ఈ మధ్య కాలంలో రెండు దఫాలకే పరిమితమైంది. ఆరు నెలల వ్యవధిలో తప్పనిసరి అసెంబ్లీని సమావేశపర్చాలి. నిరుడు స్పీకర్ ఎంపిక నేపథ్యంలో రెండుమార్లే అసెంబ్లీని ఏర్పరిచారు. ఇప్పుడు కూడా పద్దతిని అవలంభించే ధోరణిలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, అధికార పార్టీని కడిగి, ఉతికి ఆరేసేందుకు ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీని వేదికగా వాడుకుంటాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక అనే అభిప్రాయం వుంది. అయితే, రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోలేక సమావేశాలను నిర్వహించడం లేదనే అపవాదును మూటగట్టుకుంటుంది.  రాష్ర్టం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ఆందోళనలను కొనసాగిస్తున్నాయి. కానీ, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే సభలో సభ్యులడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తప్పనిసరి సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే పరిస్థితుల్లో సర్కార్ లేదు. ప్రతిపక్షాలకు భయపడే సమావేశాలను ఈ ఆగస్టులో నిర్వహించడం లేదనీ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.  అయినప్పటికీ ప్రభుత్వం వర్షాకాలపు సమావేశాలను నిర్వహించడానికి ముందుకు రావడం లేదు. ఏది ఏమైనా ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా భావించే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించకపోవడమనేది ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: