గద్దర్ -చంద్రబాబు ఆలింగనం.. హాట్ హాట్ కామెంట్స్.

Chakravarthi Kalyan

గద్దర్.. ఈ పేరు తెలియని తెలుగువారుండరు. ఆయన పాట అంతగా ప్రాచుర్యం పొందింది. బడుగుల గొంతుకగా... ప్రత్యేకించి విప్లవ కారుల గళాన్ని ఆయన తన పాట ద్వారా దశాబ్దాల తరబడి వినిపించారు. మావోయిస్టు ఉద్యమంలో ఏళ్ల తరబడి పనిచేశారు. ఆయన పాట స్ఫూర్తితో ఎందరో విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. పాటతో పాటు ఆయన ఆహర్యమూ ఆకట్టుకుంటుంది.


ఎర్రజెండా చేతబట్టుకుని... వందనాలూ.. వందనాలమ్మో.. అంటూ ఆయన పాటందుకుంటే సామాన్యులకు కూడా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. విప్లవోద్యమంలో చురుకుగా పాల్గొన్న రోజుల్లో ఆయన ఎన్నో ఇక్కట్లు పడ్డారు. అజ్ఞాత వాసంలో బతికారు. ఏళ్ల తరబడి పోరాడారు. అందులో భాగంగానే ఆయన్ను అంతమొందించేందుకు అప్పట్లో కుట్రలూ జరిగాయి. ఆ కుట్రల్లో భాగంగానే ఆయనపై కాల్పులు జరిగాయి. కానీ ఆయన బతికి బయటపడ్డారు. ఇప్పటికీ ఆయన శరీరంలో ఆనాటి బుల్లెట్లు ఉన్నాయి.


అలాంటి గద్దర్ ఇప్పుడు విప్లవం బాట వదిలి ప్రజాస్వామ్యబాట పట్టారు. అంతవరకూ బాగానే ఉన్నా.. ఆయన ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి అవతారం ఎత్తేసినట్టు కనిపిస్తున్నారు. ఏ పార్టీలోనూ చేరకపోయినా ప్రస్తుతం తెలంగాణలో ప్రజాకూటమి కోసం పని చేస్తున్నారు. ఇది కూడా ఓ మార్పు అనుకున్నా.. ఆయన తాజాగా జరిగిన ఖమ్మం సభలో ఏపీ సీఎం చంద్రబాబును హృదయానికి హత్తుకోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.


గతంలో చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలోనే నక్సలైట్లను తీవ్రంగా అణిచివేశారు. ఎన్ కౌంటర్లూ జరిగాయి. అప్పట్లో చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ గద్దర్ ఎన్నో పాటలు పాడారు. ఇప్పుడు అదే చంద్రబాబు కడుపులో తలపెట్టి ఆలింగనం చేసుకోవడాన్ని ఆయన అభిమానులు, జీర్ణించుకోలేకపోతున్నారు. . గద్దర్ - చంద్రబాబు ఆలింగనంపై రాజకీయంగానూ విమర్శలు వస్తున్నాయి. గతంలో వెన్నులో బుల్లెట్ దించిన బాబుతో గద్దర్ కలవడాన్ని టీఆర్ ఎస్ నేతలు తప్పుబట్టారు. దీన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోదని హరీష్‌రావు కామెంట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: