కొడంగల్ డైరీ మిస్టరీ.. రేవంత్ పై తమిళ తరహా కుట్ర..

Chakravarthi Kalyan

కొడంగల్.. తెలంగాణ ఎన్నికల్లో బిగ్ ఫైట్ జరుగుతున్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డికి కంచుకోటగా పేరున్న ఈ నియోజకవర్గంలో ఆయన విజయం నల్లేరుపై నడకగా స్థానికులు చెబుతున్నారు. 


కానీ ఇక్కడ ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో కేసీఆర్ అనేక కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిపై పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నివాసాల్లో ఐటీ దాడులు జరగడం కలకలం సృష్టించింది. ఈ దాడుల్లో కేవలం 50 లక్షల రూపాయలు దొరికాయని అధికారులు చెబుతున్నారు.



కానీ ఈ మొత్తం 75 కోట్ల వరకూ ఉందని రేవంత్ రెడ్డి అంటున్నారు. అంతే కాదు.. ఈ సోదాల్లో దొరికిన ఓ డైరీలో టీఆర్ఎస్ నేతల లావాదేవీలన్నీ ఉన్నాయంటున్నారు. ఇది బయటపడితే తమ గుట్టు తెలుస్తుందన్న భయంతో కేసీఆర్ పీఎంఓ స్థాయిలో మేనేజ్ చేశారంటున్నారు. అందుకే అధికారులు వివరాలు బయటకు చెప్పడం లేదని ఆరోపిస్తున్నారు.



అంతే కాదు.. తనపై కుట్ర జరుగుతోందని.. తన ప్రాణాలు తీసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. తమిళనాడులోని ఆర్కే పురం తరహాలో కొడంగల్ ఎన్నిక వాయిదా వేయించేందుకు కూడా టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా తన గెలుపు ఖాయమని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: