కేసీఆర్, ఉత్తమ్‌కు దడ పుట్టిస్తున్న ఇండిపెండెంట్లు వీరే..!

Chakravarthi Kalyan

తెలంగాణలో ఈసారి ఎక్కువగా ఇండిపెండెంట్లు గెలుస్తారని సర్వే స్పెషలిస్టు లగడపాటి పేల్చిన బాంబు ప్రధాన పార్టీల్లో కలకలం రేపుతోంది. ఎనిమిది నుంచి పది మంది వరకూ గెలుస్తారని ఆయన చెప్పేశారు. ఆల్రెడీ.. నారాయణపేటలో శివకుమార్ రెడ్డి, బోథ్ లో జాదవ్ అనిల్ కుమార్ గెలుపు ఖాయమని ఆయన ప్రకటించారు. ఇంతకీ ఆ స్థాయిలో కేసీఆర్, ఉత్తమ్ లకు దడ పుట్టిస్తున్నదెవరో ఓ సారి చూద్దాం..


నారాయణపేటలో బీఎల్ ఎఫ్ అభ్యర్థిగా ఉన్న శివకుమార్ రెడ్డి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ లో చేరినా ఈసారి టిక్కెట్ రాలేదు. అందుకే బీఎల్ ఎఫ్ లో చేరి బరిలో దిగారు. లోకల్ గా పట్టు ఉండటం, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతితో ఈ నెగ్గుతారని లగడపాటి సర్వే చెప్పింది. ఇక బోథ్ లో ఇండిపెండెంట్ గా పోటీకి దిగిన అనిల్ కుమార్ కాంగ్రెస్ నాయకుడు.. 2009లో టీడీపీ చేతిలో, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా పోటీకి సిద్ధమైనా కాంగ్రెస్ నుంటి టికెట్ దక్కలేదు. దాంతో ఇండిపెండెంట్ గా పోటీకి దిగారు. ప్రధాన పార్టీలను హడలెత్తిస్తున్నారు.


మిగిలినవారిలో ఇబ్రహీంపట్నం నుంచి కాంగ్రెస్ రెబెల్ గా ఉన్న మల్ రెడ్డి రంగారెడ్డి ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. ఈయన బీఎస్పీ తరపున బరిలో దిగారు. కాంగ్రెస్ లో పేరున్న నేత కావడంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇక బెల్లంపల్లిలో మాజీ మంత్రి వినోద్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. టీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోవడంతో ఈయన బీఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. ఆర్థికంగా బలంగా ఉండటం ఈయన ప్రత్యేకత.


రామగుండం నుంచి ఫార్వార్డ్ బ్లాక్ తరపున పోటీ చేస్తున్న కోరుకంటి చందర్ కు సింగరేణి కార్మిక వర్గంలో మంచి పట్టుంది. ఈయన కూడా గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ టిక్కెట్ దక్కక ఫార్వార్డ్ బ్లాక్ నుంచి బరిలో దిగారు. వైరాలో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించి విఫలమైన రాములు నాయక్ కూడా ఫార్వార్డ్ బ్లాక్ తరపున గట్టి పోటీ ఇస్తున్నారు. మేడ్చల్ నుంచి టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించి నిరాశపడిన నక్కా ప్రభాకర్ గౌడ్ కూడా బలమైన క్యాండిడేట్. ఈయన గత రెండు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం బీఎస్పీ నుంచి బరిలో దిగిన ఈయన గెలవకపోయినా టీఆర్ ఓట్లు గణనీయంగా చీల్చే ఛాన్సుంది. రాజేంద్రనగర్ లో టీఆర్ఎస్ టిక్కెట్ దక్కని తోకల శ్రీనివాసరెడ్డి కూడాఫార్వార్డ్ బ్లాక్ తరపున పోటీ చేస్తూ అసలైన అభ్యర్థికి దడ పుట్టిస్తున్నారు.


మహబూబ్ నగర్ లో గత మూడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత ఇబ్రహీం బీఎస్పీ నుంచి బరిలో దిగి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. వీరే కాకుండా మిర్యాలగూడలో ఇండిపెండెంట్ స్కైలాబ్ నాయక్, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణరావు, ఖానాపూర్ లో అజ్మీరా హరినాయక్, కంటోన్మెంట్ లో జి. నగేశ్ వంటి వారు కూడా ప్రధాన పార్టీల జాతకాలు తారుమారు చేసే సత్తా ఉన్నవారే. మరి వీరిలో ఎందరు విజయ సాధిస్తారన్నది డిసెంబర్ 11న తేలుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: