సీబీఐ కేసు నుంచి కేసీఆర్ అలా బయటపడ్డారా..?

Chakravarthi Kalyan

సీబీఐను రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్న విమర్శలు కొత్తవేమీ కాదు.. అందులో వాస్తవాలూ లేకపోలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ పై కూడా ఓ సీబీఐ కేసు ఉంది. ఆయనపై కేసేమిటి అంటారా.. అప్పట్లో యూపీఏ సర్కారులో ఆయన కొన్నాళ్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ కాంట్రాక్టర్ కు భవన నిర్మాణ కాంట్రాక్టు అక్రమంగా కట్టబెట్టారన్నది కేసు.


ఆ మధ్య ఈ కేసు విషయమై కేసీఆర్ ను సీబీఐ అధికారులు కూడా కలిసి ఆయన వాదన నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత దాని ప్రస్తావన పెద్దగా లేదు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో మరోసారి కేసీఆర్ సీబీఐ కేసు తెరపైకి వచ్చింది. కేసీఆర్ కేంద్రంతో లాలూచీపడి మోడీ కాళ్లు పట్టుకుని సీబీఐ కేసు మాఫీ చేయించుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.


కేంద్రంతో లాలూచీ వల్లే విభజన చట్టంలోని హామీల అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నోరు మెదపడటం లేదని కాంగ్రెస్ రాష్ట అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ వెలుగుబంటి సూర్యనారాయణకు ఇచ్చింది నిజం కాదా? ఆ కాంట్రాక్టర్ తో కేసీఆర్‌ సంబంధం నిజం కాదా? అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో చార్జ్ షీటులో ఉన్న కేసీఆర్ పేరును సీబీఐ ఎందుకు తొలగించిందో మోడీ సర్కారు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


అంతేకాదు.. ఇటీవల కేసీఆర్ తరచూ.. వైద్య పరీక్షల పేరుతో, కంటి వైద్యం పేరుతో డిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదేనని విమర్శించారు. కేసీఆర్ డిల్లీలో ఎవరిని కలిశారు.. ఏం చేశారో తన వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయన్న ఉత్తమ్ సరైన సమయంలో వాటిని బయటపెడతానంటున్నారుమరి ఇంతకుమించిన సరైన సమయం ఎప్పుడు ఉంటుందో ఆయనకే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: