రేవంత్ ఊసెత్తడానికి కేసీఆర్ భయపడ్డారా.. కొడంగల్ లో చప్పగా ప్రసంగం..

Chakravarthi Kalyan

కాంగ్రెస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డ సొంత నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆయన్ను అడ్డుకుంటామని ప్రకటించారు. సీఎం సభ ఉన్న రోజే కొండంగల్ బంద్ కు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది.



దీంతో సీఎం సభ సజావుగా సాగేందుకు మంగళవారం ఉదయాన్నే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అన్ని మీడియాల్లోనూ ఉదయం నుంచి రేవంత్ అరెస్ట్ ప్రధాన వార్త అయ్యింది. రేవంత్ అరెస్ట్.. హైకోర్టులో కాంగ్రెస్ కేసు వేయడం.. విచారణ.. ఇలా రోజంతా హడావిడి సాగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కొడంగల్ సభలో ఏం ప్రసంగిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా సాగింది.



సాయంత్రం నాలుగున్నర సమయంలో కొండంగల్ లో అడుగుపెట్టిన కేసీఆర్.. అన్ని సభల్లో చేసిన ప్రసంగాన్నే ఇక్కడా కొనసాగించారు. పాలమూరు జిల్లాను సస్యస్యామలం చేసే ప్రాజెక్టులకు నాగం జనార్దన్ రెడ్డి వంచి ఈ జిల్లా నాయకులే అడ్డుపడుతున్నారని విమర్శించారు. కొడంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

సంక్షేమ పథకాలు, 24 గంటల విద్యుత్.. ఇలాంటి రొటీన్ డైలాగులే తప్ప.. రేవంత్ రెడ్డి గురించి కానీ.. కేసీఆర్ తన ప్రసంగంలో ఏమాత్రం ప్రస్తావించలేదు. అయితే ఇప్పటికే ఉదయం నుంచి మీడియాలో రేవంత్ జపమే జరిగినందువల్ల మళ్లీ తాను ఏం మాట్లాడినా అనవసర ప్రాధాన్యం వస్తుందనే కేసీఆర్ రేవంత్ ప్రస్తావన తీసుకురాలేదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అరెస్ట్ ద్వారా ఇప్పటికే రేవంత్ కు విపరీతమైన ప్రాచుర్యం వచ్చిందని.. ఇంకా దాన్ని పెంచడం ఎందుకనే కేసీఆర్ కొడంగల్ సభలో రేవంత్ గురించి మౌనం వహించినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: