‘బావ’ను కేటీఆర్ ఎలా డీల్ చేయబోతున్నారు?

Vasishta

కేటీఆర్ కొత్త బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన కేటీఆర్ తన యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి పార్టీని నడిపించిన కేసీఆర్ విశ్రాంతి తీసుకోబోతున్నారు. కుమారుడు కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ముందున్న సవాళ్లేంటి..? అనే అంశాలను ఓసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరముంది.


తెలంగాణ రాష్ట్రసమితి 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకుంది. ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆయన పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి తెలంగాణకోసం ఉద్యమాన్ని నడిపించారు. నాటి నుంచి రాష్ట్ర సాధన వరకూ ఎన్నో ఆటుపోట్లను కేసీఆర్ చవిచూశారు. టీఆర్ఎస్ చవిచూసిన ఉపఎన్నికలను ఏ పార్టీ చూసి ఉండకపోవచ్చు. గెలుపయినా, ఓటమి ఎదురైనా వెన్ను చూపకుండా కేసీఆర్ పోరాడారు. చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు రెండోసారి టీఆర్ఎస్ తెలంగాణలో అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణం చేసిన కేసీఆర్.. పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కుమారుడు కేటీఆర్ కు ఆ పగ్గాలు అప్పగించారు.


కేటీఆర్ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు కాబట్టి అతనికి పాలనపై పట్టుంది. ఐటీ, పంచాయతీరాజ్ శాఖలను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. పార్టీ పరంగా కూడా నెంబర్ టూగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేటీఆర్ తొలినాళ్లలో హరీష్ హవా బాగా ఉండేది. కేసీఆర్ తర్వాత వారసుడు హరీశే అన్నంత పేరు తెచ్చుకున్నారు. అయితే క్రమేణా హరీశ్ తెరమరుగైపోయారు. కేసీఆర్ కూడా హరీశ్ ను దూరం పెడుతూ వచ్చారు. ముఖ్యమైన పనులన్నింటినీ గతంలో హరీశ్ రావుకే అప్పగించిన కేసీఆర్.. ఆ తర్వాత కేటీఆర్ వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. దీంతో పార్టీ కేడర్ కు కూడా అర్థమైపోయింది. కేటీఆర్ నే కేసీఆర్ తర్వాత వారసుడిగా గుర్తిస్తూ వచ్చారు. ఇప్పుడది బహిర్గతమైపోయింది. బహిరంగంగానే కేటీఆర్ వారసుడైపోయారు.


కేటీఆర్ ముందు ఇప్పుడున్న సవాల్ పార్టీని కేసీఆర్ లాగా సమర్థంగా ముందుకు నడపడమే! కేసీఆర్ నేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా ఆయన పరోక్షంగా పార్టీపై కన్నేసి ఉంచుతారు. కాబట్టి కేటీఆర్ కు పెద్దగా ఇబ్బందులు లేకపోవచ్చు. అయితే కేటీఅర్ తనదైన శైలిలో పార్టీని నడిపించేందుకు ఎలాంటి వ్యూహరచన చేస్తారనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్న అంశం. హరీశ్ రావుతో పార్టీకి ఎప్పటికైనా ముప్పే అని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బావను ఎలా డీల్ చేస్తారనేది అత్యంత ప్రయారిటీ అంశం. కేసీఆర్ కు అన్ని విషయాల్లో అండగా నిలిచిన హరీష్ రావు.. కేటీఆర్ విషయంలో ఎలా నడుచుకుంటారనేది ఇంట్రస్టింగ్ అంశం. కేసీఆర్ తో ఉండే మొహమాటం కేటీఆర్ దగ్గర ఉండకపోవచ్చు. కాబట్టి హరీష్ రావుతో కేటీఆర్ వ్యవహరించే పద్ధతిని బట్టి పార్టీ వ్యవహారం ఆధారపడి ఉంటింది. మరి కేటీఆర్ ఏం చేస్తారో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: