కేసీఆర్ వ్యూహంతో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా హుళక్కేనా?

చంద్రబాబు తో మిలాఖత్ అయినందుకు కాంగ్రెస్ అంతు చూడకుండా వదిలేలాగా లేరు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్-2కు తెరలేపనున్నారని వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్-2  మాత్రం  2014 కంటే భిన్నంగా ఉండబోతుంది. ఈ సారి  మరింత వేగంగా,  వ్యూహాత్మకంగా ఈ ఎత్తగడలు ఉండబోతున్నాయని అభిఙ్జవర్గాల కథనం.

తొలిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు నిధులు ఇతర కార్పొరేషన్ల చైర్మెన్ల పదవులను ఆశ చూపి బలం పెంచుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో 63 సీట్లు ఉండగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో టీఆరెస్ శాసనసభ్యుల బలం 93కు పెరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి తన రాజకీయ చతురతను చాటాలని భావిస్తున్నది.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలను తన గూటికి లాగి ప్రతిపక్షహోదా లేకుండా చేయాలనేది టీఆర్ఎస్ రథసారథి ఎత్తుగడ అని తెలుస్తోంది. 119 ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో టీఆర్ఎస్ కు 88 శాసనసభా స్థానాలున్నాయి. నియోజకవర్గాల అభివృద్ధి కోసమంటూ ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కారు బలం 90కి చేరింది. 

కాగా సభలో కాంగ్రెస్ 19 - టీడీపీ 2 - ఎంఐఎం 7 – బీజేపీ-1 ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాయి. ఈ ప్రతిపక్ష ఎమ్మెల్యేలల్లో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది. సత్తుపల్లి, అశ్వాపురం నియోజక వర్గాల్లో టిడిపి తరపున గెలిచిన శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ లోకి చేరబోతున్నట్లు ఖమ్మంలో ప్రచారంలో ఉంది. ఎంఐఎం వారి మిత్రపక్షం కావటంతో దాదాపు కాంగ్రెస్ తప్ప మిగతా ప్రతిపక్షం మాయమై పోవచ్చునని అంటున్నారు.  


సాధ్యమైనంత ఎక్కువ మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి ఆకర్షింపజేసి కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాకు కూడా గండికొట్టాలని భావిస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. ప్రతిపక్ష హోదా రావాలి అంటే మొత్తం శాసనసభ స్థానాల్లో నుంచి 10 శాతం సీట్లు రావలసి ఉంటుంది. ఆ లెక్క ప్రకారం తెలంగాణా ప్రతిపక్ష హోదా కు అర్హత 12 సీట్లు ఉంటే చాలు. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ కు 19 స్థానాలున్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కకుండా పావులు కదుపుతూ కాంగ్రెస్ ను చావుదెబ్బ తీసేందుకు ఎత్తుగడ వేస్తోందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: