న్యాయం మన దేశంలో ఇంత అన్యాయమా? ఇన్ని కేసులు పెండింగ్‌ లో ఉన్నాయా?

జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనేది ఆంగ్ల సామెత  తెలుగులో అర్ధం న్యాయం చేయటం ఆలస్యం చెస్తే న్యాయం చేయటాన్ని అలక్ష్యం చేసినట్లే-అంటే అన్యాయం చేసినట్లు గానే భావించాలి  జస్టిస్ హేస్ట్ ఈజ్ జస్టిస్ వేస్ట్ అంటే ఆతృత న్యాయ నిర్ణయం నిరర్ధకం అని కూడా అంటారు. మధ్యేమార్గంగా సత్వర అర్ధవంతమైన న్యాయ నిర్ణయం బాధితులకు కనీస న్యాయం చేసేదిగా ఉండే విధానం ఉత్తమం అని అంటారు.


మరి అలాంటిది భారతీయ న్యాయస్థానాల్లో కోట్ల సంఖ్యలో కేసులు కుప్పలు తెప్పలుగా దశాబ్ధాల తరబడి అపరిష్కృతంగా పడి ఉంటున్నాయి. అలాంటి చోట్ల బాధితులు న్యాయాన్ని ఆశించటం మృగతృష్ణలో నీరు తాగటమే.


అందుకే దేశంలో న్యాయవ్యవస్థ మీద చాలా మంది విమర్శలు గుప్పిస్తుంటారు. ఒకసారి వివాదం కోర్టుకు వెళితే, ఎప్పటికి తేలుతుందో, అని సందేహిస్తుంటారు. ఎప్పుడో తాతల నాటి కేసులను వారసులు కూడా కోర్టుల్లో పోరాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ సినిమాల్లో చూసిన తర్వాత, పేపర్లలో చదివిన తర్వాత,  ప్రజలకు అసలు భారత న్యాయస్థానాల్లో ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో? అనే అనుమానం మనసులను తొలిచివేసే అంశం. అసలు దేశంలో ఎన్ని కేసులు పెండింగ్‌ లో ఉన్నాయనేదే ఆ సందేహం.

 

ఆ సందేహాన్ని నివృత్తి చేసింది కేంద్ర న్యాయశాఖ. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్‌ ను న్యాయశాఖ విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం దేశంలోని జిల్లా కోర్టులు, కింది కోర్టుల్లో సుమారు 2.91 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి. అందులో 21.90 లక్షల కేసులు పదేళ్లకు పైగానే పెండింగ్‌లో ఉన్నట్టు ఆ రికార్డులు చెబుతున్నాయి.

దేశంలోని జిల్లా కోర్టులు, కింది కోర్టుల్లో సుమారు 22లక్షల కోట్లకేసులు పెండింగ్‌ లో ఉన్నాయన్న మాటవాస్తవమేనా? అంటూ అన్నా డీఎంకే ఎంపీ జి.హరి కేంద్ర న్యాయ శాఖను ప్రశ్నించారు. అలాగే, పదేళ్ల కు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాల్సిందిగా దేశంలోని 24 హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ లను కేంద్ర ప్రభుత్వం కోరింది వాస్తవమేనా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చిన న్యాయశాఖపై డేటాను బయట పెట్టింది.


కేంద్ర న్యాయశాఖ ఇచ్చిన ‘నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్’  ప్రకారం అత్యధికంగా (829128) యూపీలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో బీహార్ (320971), మహారాష్ట్ర (236674) నిలిచాయి. అత్యంత తక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రంగా సిక్కిం రికార్డులకు ఎక్కింది. అక్కడ కేవలం రెండు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అంతకంటే ఘనంగా చెప్పాలంటే అండమాన్ నికోబార్‌ లో అసలు కేసులే పెండింగ్‌లో లేవు.


దేశంలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు కేంద్రప్రభుత్వం వివిధ ప్రక్రియలను అవలంభిస్తున్నట్టు న్యాయశాఖ పార్లమెంట్‌ కు తెలిపింది. కోర్టుహాళ్ల సంఖ్య పెంచడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  వినియోగం ద్వారా కేసులను త్వరగా క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: