టిడిపి మొదటి జాబితాకు ముహూర్తం ఫిక్స్..ఎప్పుడో తెలుసా ?

Vijaya

అభ్యర్ధుల ప్రకటనకు చంద్రబాబునాయుడు ముహూర్తం నిర్ణయించినట్లే కనబడుతోంది. రానున్న ఎన్నికలకు అభ్యర్ధులను ముందుగానే ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. జనవరిలో సంక్రాంతి పండుగ వెళ్లిన వెంటనే మొదటి జాబితాను ప్రకటించాలని నిర్ణయించారట. అంటే మొత్తం 175 సీట్లకు అభ్యర్ధులను ప్రకటిస్తారని అనుకునేందుకు లేదులేండి. మొదటి విడతలో ఓ 70 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటిస్తారట. మొదటి జాబితాపై నేతలు, జనాల స్పందన చూసి తర్వాత రెండో జాబితా ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద అభ్యర్ధులను ముందుగా ప్రకటించటం నిజమే అయితే చంద్రబాబు నైజానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నట్లే లెక్క.

 

మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని చంద్రబాబు అనుకుంటున్నారు. ఫిబ్రవరి మూడో వారంలోనే ఎన్నిలక షెడ్యూల్ ప్రకటిస్తామని చీఫ్ ఎన్నికల కమీషనర్ చేసిన ప్రకటన అందరికీ గుర్తుండే ఉంటుంది. దాంతో చంద్రబాబు స్పీడ్ పెంచుతున్నారు. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో కెసియార్ కూడా అభ్యర్ధులను ముందుగా ప్రకటించి లబ్దిపొందటం కూడా చంద్రబాబును ఆకర్షించింది. దాంతో కెసియార్ వ్యూహాన్ని ఏపిలో తాను కూడా అమలు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

 

దానికితోడు పాదయాత్రలో బిజీగా ఉన్న వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని టిక్కెట్లను ప్రకటించేశారు. సిట్టింగులను వదిలిపెట్టి సుమారుగా 20 నియోజకవర్గాల్లో జగన్ అభ్యర్ధులను ప్రకటించేశారు.  45 మంది సిట్టింగుల్లో దాదాపు అందరినీ పోటీ చేయించటానికి జగన్ సుముఖంగానే ఉన్నారు. అంటే వైసిపి తరపున దాదాపు 60 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఫైనల్ అయిపోయింది. వారు ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. ఆ విషయం కూడా చంద్రబాబును ఆలోచనలో పడేసింది. ఎలాగూ నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తునే ఉన్నారు. కాబట్టి నియోజకవర్గాల్లో ఎవరికి టిక్కెట్లివ్వాలనే విషయంలో చంద్రబాబు ఇఫ్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకనే అభ్యర్ధుల ప్రకటనలో వెనకబడితే ఇబ్బందులు తప్పవని గ్రహించి ముందుస్తు ప్రకటన చేయబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: