జగన్-పవన్ కూటమి టిడిపి-చంద్రబాబు గుండెల్లో రైళ్ళు?

రాజాకీయాల్లో నీతిని, నిజాయతీని, నిజాన్ని చివరకు చరిత్రను సైతం సమాధి చేస్తున్నారు. ఇక్కడ వారు వీరని, ఆపార్టీ ఈ పార్టీ అని తేడాలు పెద్దగా కనిపించవు. అన్నీ ఒకే తానులోని ముక్కలే. ఆంతా ఒకే రకమైన నేత కలబోత. ఇక్కడ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. దనికి సంపూర్ణ ఋజువు తెలుగుదేశం ఆవిర్భావానికి - పునాది కాంగ్రెస్ వ్యతిరేఖత తెలుగుజాతి ఆత్మగౌరవం. అయితే తెలుగుదేశం పార్టీ ఆధినేత తన ఆత్మానందం కొరకు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాలరాచి, కాంగ్రెస్ పాదాల చెంత పూడ్చేసి, పొత్తు కోసం తాకట్టు పెట్టటం పెద్ద ఋజువు. ఇంతకు మించిన ఆత్మద్రోహం, ధర్మచింతన వేరే ఏమీ ఉండవు కదా!  

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్లమెంట్ సభ్యులతో ఆత్మగౌరవంపై డిల్లీలో పార్లమెంట్ ముందు ప్రేలాపనలు చేయిస్తూ ఉన్నది చూస్తుంటే తెలుగువారి గుండె తరుక్కుపోతుంది. తెలంగాణాలో తమ బద్ధశత్రువు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జాతిని షాక్ కు గురిచేసిన ఈ పెద్దమనిషి దేశం విస్తుపోయే సంచలనం సృష్టించారు. 

అంతే కాదు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఇలాంటి ఘట్టం మహాకూటమి పేరుతో – భారతీయ జనతా పార్టీ వ్యతిరేఖ కూటమిగా మరొకటి ఆవిష్కృతం కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదే కాంగ్రెస్-టిడిపి మొదలైన ప్రాంతీయ పార్టీల ఐఖ్యత కోసం చంద్రబాబు నాయకత్వంలో ఇది పనిచేయనుందని తెలుగుదేశం పార్టీ మద్దతు మీడియా కోడై కూస్తుంది. ఒకనాడు కాంగ్రెస్ ను రాక్షసుడుగా చూపిన ఈ మీడియా నేడు అదే శవంలోని బేతాళుణ్ణి తన భుజాలపై అక్రమార్కునిలా పెట్టుకొని మోయటం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగుజాతి యావత్తూ విస్తుపోయి చూస్తుంది. ఒక మీడియా హౌజైతే ఏకంగా ఆంధ్రా ఆక్టోపస్ తో తెలంగాణా ఎన్నికల కు ముందు ఒక మాయా సర్వే ప్రకటింప జేసి, పాత్రికేయ పాతివ్రత్యాన్ని పాతేసిమరీ కాంగ్రెస్-టిడిపి నాయకత్వంలోని ప్రజాకూటమికి బహిరంగ మద్దతు ప్రకటించింది. ఫలితమే "తెలంగాణా రాష్ట్ర సమితి" ఆ ఎన్నికల్లో సాధించిన అపూర్వ ఘన విజయం. అలా ఆ మీడియా హఔజెస్ చేసిన తప్పు స్వల్ప  తేడా తో గెలవటానికి బదులు అనితరసాధ్య విజయం సాధించింది. 

ఫలితంగా తెరాస అధినేత దేశవ్యాప్తంగా  "కాంగ్రెసేతర-బిజేపియేతర ఐఖ్య రాజకీయ సంఘటన -ఫెడరల్ ఫ్రంట్" పేరుతో మరో కలగూరగంపకు అస్కారం ఇచ్చినట్లైంది. స్వల్ప ఆధిక్యతతో ఎవరు విజయం సాధించినా ఈ మహత్కార్యానికి కేసీఆర్ పూనుకొని ఉండకపోయే వారు.  

మాయా మోహిత టిడిపి-కాంగ్రెస్ ఐఖ్యత ఏపి లో 2019లో జరగనున్న ఎన్నికల్లో,  మరో కొత్త పొత్తుకు మార్గం సుగమమం చేసింది.  -  వైసీపీ- జనసేన పొత్తు ఆవిర్భవించ నుందని ప్రచారం జోరుగా సాగుతుంది.   జగన్-పవన్ చేతులు కలపనున్నారని, ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నారనే వార్తలు మహా జోరుగా వినిపిస్తున్నాయి.
 
కొన్ని నెలల్లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్న దరిమిలా అందులో గెలిచి అధికారం నిలబెట్టు కోవడానికి చంద్రబాబు “స్కెచ్” వేస్తున్నారు. మరోవైపు ఈసారి ఎలాగైనా అధి కారం చేజిక్కిచ్చుకోవాలని  ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పట్టుదలగా ఉన్నారు. అలాగే ఏపీలో బలమైనరాజకీయశక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న సినీనటుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో తనసత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది? ఎవరెవరు కలిసి ఎవరితో పోరాడతారనే అంశంపై జనావళిలో తీవ్ర ఆసక్తి నెలకొంది.
 
అయితే ఒంటరిగా బరిలోకి దిగితే నష్టం జరగొచ్చనే భయం కూడా వెంటాడుతోంది. ఈ క్రమంలో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు కోసం ప్రతిపక్ష వైసీపీ, జనసేన మధ్య రహస్య చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. ఇరు పార్టీలకు చెందిన ప్రముఖులు ఇందుకు సంబంధించి సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  వైసీపీ, జనసేన పొత్తు పెట్టుకోవాలనే యోచన రావడానికి కారణం లేకపోలేదు. ఇరు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే,  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి చివరకు టీడీపీకి లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీని వల్ల ఇరు పార్టీలు కూడా నష్టపోతాయనే వాదన ఉంది. దీంతో పొత్తు అనివార్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య రాజకీయ సఖ్యత కుదిర్చేందుకు కొంతమంది ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
 
ఇరు పార్టీల మధ్య పొత్తు కుదుర్చించేందుకు జనసేన తరపున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, వైసీపీ తరపున ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి చర్చలు జరిపారని వార్తలు గుప్పుమన్నాయి. ఇందుకోసం హైదరాబాద్‌ లోని ఒక విశ్రాంత అధికారి నివాసంలో చర్చలు జరిపారని సమాచారం. మూడు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో జనసేనకు 15 నుంచి 25  శాసనసభ స్థానాలు, 4 లోక్-సభ స్థానాలు  ఇచ్చేందుకు వైసీపీ సూత్రప్రాయంగా అంగీకరించిందనే వాదన కూడా విని పిస్తోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ విషయాన్ని ఇరు పక్షాలకు చెందిన నేతలు గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.
 
జగన్-పవన్‌ల మధ్య రాజకీయాన్ని మించి తీవ్రవిమర్శలు వ్యక్తిగతస్థాయిలో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో, వారి మధ్య రాజకీయసఖ్యత కుదురుతుందా?  అన్నది సందేహంగానే ఉంది. అయితే రాజకీయ అవసరాల కోసం తెలుగుదేశం-కాంగ్రెస్ లాంటి ఆగర్భశత్రువులకే పొత్తు పొసగగా లేంది–సిద్ధాంత విభేదం ఏమాత్రం లేని వీరి ఊక దంపుడు ఉపన్యాసాలు విమర్శలు మాత్రమే చేసు కొనే వైసిపి–జనసెన పార్టీల పొత్తు అసాధ్యం మాత్రం కాదు. ఈ విషయంలో వారిరువురు వెనక్కితగ్గడం అతి సులభం అంటున్నారు విశ్లేషకులు.  

వైసీపీ-జనసేన కూడా అదే పోత్తుబాటలో ముందడుగు వెసే అవకాశం ఉందని, దానికెలాంటి అవరోధాలు ఉండవని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మొత్తానికి వైసీపీ- జనసేన మధ్య పొత్తు కుదిరితే, ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోవటం ఖాయమని చెబుతున్నారు.  ఈ రెండు పార్టీల మధ్యన పొత్తు కుదిరితే మాత్రం టీడీపీకి కాంగ్రెస్ తో కలిసినా భారీ షాక్ మాత్రం తప్పదంటున్నారు. వైసీపీ సీమజిల్లాలలో ఇప్పటికీ బలమైన శక్తిగా ఉంది, జనసేనకు కోస్తాజిల్లాల లో మంచి ఆదరణ కనిపిస్తోంది. దాంతో టీడీపీకి కష్టాలు తప్పవనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: