ఏపీలో సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేవనుందా? వచ్చే రెండు మాసాల్లో ఏపీ రాజకీయాలు వేడెక్కనున్న నేపథ్యంలో పార్టీలు వేటికవే సీఎం సీటుకు కుస్తీ పడుతున్నాయి. అదేసమయంలో ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు రెండూ కూడా ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టి ఓట్లు కురిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అటు టీడీపీ ఎన్టీఆర్ జీవిత చరిత్ర విశేషాలను సినిమా తెరమీదికి తెస్తోంది. ఇక, వైసీపీ కూడా ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా వైఎస్ జీవితంలోకి రాజకీయ అంశాలను ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలను ఆయన చేరుకున్న తీరును కళ్లకు కట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలోనే యాత్ర పేరుతో సినిమాను వండి వారుస్తోంది. దీంతో ఎవరి సినిమా పండుతుంది.. ఎవరి సినిమా ఓట్లు పండిస్తుంది! అనే కీలక అంశాలు తెరమీదికి వస్తున్నాయి.
ఎన్టీఆర్ కథనాయకుడు, మహానాయకుడు పేరుతో రెండు సినిమాలు ఒకే సారి రంగంలోకి దిగుతున్నాయి. అయితే, అన్నగారి జీవితంలోని సినిమా పాత్ర కన్నా రాజకీయ సెంటిమెంటుకు ప్రధాన భూమిక ఇస్తున్నారు. ఆయన పార్టీ స్థాపించిన తీరును, ప్రజలకు దగ్గరైన విధానాన్ని, రాత్రి పగలు కూడా ప్రజల కోసం చైతన్య రథంపై ప్రచారం తీరును వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే `తెలుగు వారి ఆత్మగౌరవం` నినాదాన్ని కూడా ఈ మూవీ ద్వారా బలంగా వినిపించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఇక, ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తీరు.. ఆయన పేదల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు కూడా చిత్రంలో ప్రముఖంగానే ప్రస్థావనకు వస్తాయి. కట్ చేస్తే.. ఈ మూవీ ప్రజల్లో ముద్ర వేస్తుందా? టీడీపీకి ఓట్లు రాల్చుతుందా? అనేది ప్రధాన సమస్య!!
నిజమే! ఇదే తరహాలో నెటిజన్లు, ముఖ్యంగా సోషల్ మీడియా పీపుల్ ఎక్కువగా చర్చించారు. కారణం.. ఎన్టీఆర్ చరిత్ర ముగిసి చాలా కాలమే అయిపోయింది. పైగా ఆయనను సెంటిమెంటు అస్త్రంగా వినియోగించుకుంటే దీనికి పడిపోయే ప్రజలు కూడా తక్కువే. దీనికి ప్రధాన కారణం.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది టీడీపీపార్టీనే. తిరిగి ఎన్టీఆర్‌లా తాను పాలిస్తానని చంద్రబాబు ఎక్కడా ప్రకటించడం లేదు. పైగా చంద్రబాబు విజన్ వేరు... ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు ఏపీ ప్రజలు అదే పరిస్థితిలో ఉండి ఉంటే.. ఆ సెంటిమెంటు వేరుగా ఉంటుంది. కానీ, ఇప్పుడు కావాల్సింది నిజానికి చంద్రబాబు చరిత్రే! ఆయన ఎలా రాజకీయాల్లో ఎదిగాడు.. ఇప్పడుఉ ప్రజలకు ఏం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయన ఏం చేస్తారు? అనే విషయాన్ని కనీసం డాక్యుమెంటరీగా అయినా విడుదల చేస్తే కొంత మేరకు ప్రభావం ఉంటుందనేది మేధావుల మాట.
ఇక, వైఎస్ జీవితంలోని కీలక ఘట్టం పాదయాత్ర ఆధారంగా అదేపేరుతో యాత్రగా వస్తున్న సినిమాపై కూడా ఇలాంటి చర్చే మరింత ఎక్కువగా జరుగుతోంది. ఆయన చనిపోయిన పదేళ్లు అవుతోంది. అయినా కూడా ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు.. వంటి కీలక పథకాల ద్వారా పేదల ఇళ్లలో వెలుగులు నింపారు. కాబట్టి ఈ సినిమాపై అంచనాలు పరుగుతున్నాయి. నిజానికి ఈ మూడు పథకాలపైనా చంద్రబాబు శీతకన్నేయడం కూడా ప్రజలకు ఆ పార్టీని దూరం చేస్తోంది. ఇదే కథా వస్తువుగా తీసుకున్న యాత్ర దర్శకుడు వైఎస్ అప్పట్లో ఏం చేశాడు.. ఇప్పుడు ఏం జరుగుతోంది(పైకి ఇది చెప్పడం లేదు. రహస్యంగా ఉంచారు) అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెరమీద చూపించనున్నారు. రేపు జగన్ వస్తే.. రాజన్న రాజ్యాన్ని ఎలా స్థాపిస్తాడనే అంశంతో కథ ముగుస్తుంది. దీంతో ఈ సినిమా సెంటిమెంటే పండుతుందనేది సినీ వర్గాల అంచనా కూడా! దీనిని బట్టి అర్ధం కావడం లేదా? ఎవరి సెంటిమెంటు పండుతుందో అంటున్నారు నెటిజన్లు! మరి ఏం జరుగుతుందో చూడాలి.