బిజెపిలో ముసలం మొదలైంది-మూడు రాష్ట్రాల లో బిజెపి ఓటమి బాధ్యత? ను ప్రశ్నించిన గడ్కరీ

భారతీయ జనతా పార్టీలో తిరుగు లేని నేతలుగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను టార్గెట్ చేస్తూ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ లో బీజేపీ పరాజయం తర్వాత పార్టీ నేతలపై విమర్శలు చేసిన నితిన్ గడ్కరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల సమావేశంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

భాజపా సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు బిజెపిలో చలిమంటలు రేపుతున్నాయి. ఓటమికి, విజయాలకు “నాయకత్వమే” బాధ్యత జవాబుదారీ తనం తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే విజయాన్ని భుజాన పెట్టుకున్నట్లు వైఫల్యాలకు బాధ్యత వహించడానికి ఎవరూ సిద్ధపడటం లేదన్నారు. మూడు కీలక రాష్ట్రాల్లో భాజపా ఓటమి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ ఫలితాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పనితీరుకు రిఫరెండం కాదని ఓటమి తర్వాత భాజపా నేతలు, కేంద్ర మంత్రులు పేర్కొన్న సంగతి తెలిసిందే. 

గత శనివారం పుణె జిల్లా గ్రామీణ సహకార బ్యాంకుల సంఘం నిర్వహించిన ఒక కార్యక్రమంలో నిథిన్ గడ్కరీ మాట్లాడుతూ  విజయం నమోదైనప్పుడు దానికి బాధ్యత వహించడం కోసం పోటీ మొదలు అవుతుంది.  వైఫల్యం విషయానికొచ్చేసరికి పరస్పరం వేలెత్తి చూపించుకోవడం మొదలవుతుంది అదీ నేటి పరిస్థితి అని అన్నారు.

"రాజకీయాల్లో వైఫల్యం చోటుచేసుకున్నప్పుడు ఒక కమిటీ ఏర్పడుతుంది. అదే విజయం నమోదైతే ఎవరూ నీ దగ్గరకు వచ్చి అడగరు. వైఫల్యాలకు బాధ్యత తీసుకునే ధోరణిని నాయకత్వం అలవర్చుకోవాలి. సదరు సంస్థ పట్ల విధేయతను రుజువు చేసుకోవాలంటే నాయకత్వం వైఫల్యానికీ బాధ్యత వహించాలి. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఓటమికి ఆయన ప్రాతినిధ్యం వహించే పార్టీకి ఏదో లోపం ఉండటం లేదా ప్రజల విశ్వాసాన్నిచూరగొనడంలో అభ్యర్థి విఫలం కావడమో కారణమవుతుంది. అయితే సదరు అభ్యర్థి మాత్రం  ‘నాకు పోస్టర్లు, నిధులు అందలేదు నిర్వహించాలనుకున్న ర్యాలీ రద్దయింది అంటూ అనేక అంశాలపై వేలెత్తి చూపుతుంటారు. ఓటమికి ఇతరులను నిందించడం తగదు’’ అని పేర్కొన్నారు.

‘‘నేను పార్టీ అధ్యక్షుణ్ణి అయినపుడు, నా పార్టీ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలు సరిగా పనిచేయ నప్పుడు తప్పెవరిది? నాదే కదా!’’ అంటూ అమిత్‌ షాను టార్గెట్ చేసిన నితిన్ గడ్కరీ ప్రస్తుతం హోంశాఖ సమర్థంగా పనిచేస్తోందంటే దానికి కారణం సుశిక్షితులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులే. వారిలో అనేకమంది తమ పని భేషుగ్గా నిర్వర్తిస్తు న్నారు. పార్టీ విషయంలోనూ అంతే. వ్యక్తులు సరిగా పనిచేయాలి.లేదంటే దానికి నాదే బాధ్యత. వారిని సరిగా తీర్చిదిద్దని తప్పునాదే అవుతుందని  గడ్కరీ   వ్యాఖ్యానించారు. వ్యవస్థను సరిగా నడపాల్సిన బాధ్యత నాయకుడిదే. కింది వారు సరిగా పనిచేయనపుడు, కోరుకున్న లక్ష్యాలు నెరవేరనపుడు ఆ నాయకుడే దానికి బాధ్యత వహించాలి అని అభిప్రాయపడ్డారు.

ఇక మరో అడుగు ముందు కేసి జవహర్‌లాల్ నెహ్రూపై ప్రశంసలు కురిపించారు గడ్కరీ, తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రసంగాలంటే తనకు చాలా ఇష్టమని వ్యాఖ్యానించారు. మరోవైపు నరేంద్ర  మోడీపై సెటైరికల్ కామెంట్లు చేశారు. ఒక వ్యక్తి అద్భుతంగా ప్రసంగించి నంత మాత్రాన ఓట్లు రాలవు. మీరు విద్వాంసుడే కావొచ్చు.  అన్నీ నాకు తెలుసు అనుకుంటే మీరు పొరబడ్డట్లే.  కృత్రిమమైన మార్కెటింగ్‌ ఎల్లకాలం నిలవదు” అని చెప్పుకొచ్చారు గడుసరి గడ్కరి. నితిన్ గడ్కరీ వ్యాఖ్యల్లో బీజేపీ శ్రేణులతో పాటు, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: