పార్టీ ఫండ్ కోసం పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే!

Vasishta

రాజకీయ పార్టీలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. మందీమార్బలాన్ని నిత్యం వెన్నంటి నడుపుకోవాలన్నా, ఆఫీస్ లాంటివి నడపాలన్నా పెద్ద ఎత్తునే ఖర్చవుతుంటుంది. అయితే ఈ ఖర్చంతా ఎవరు భరించాలి. అధికార పార్టీలైతే ఫండ్ కు పెద్ద సమస్య ఉండకపోవచ్చు. మరి జనసేన లాంటి పార్టీలకు ఫండింగ్ ఎలా ఉంటుంది..? అలాంటి పార్టీలు కూడా నడవాలంటే డబ్బు కావాలి కదా..! అందుకే జనసేనాని ఇప్పుడు పార్టీకి ఫండింగ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. సమయం పెద్దగా లేదు. మరో ఆరు నెలలే..! ఈలోపే పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేయాలి. ఓ వైపు నాయకులను తయారు చేయాలి. ఆ నాయకులకు ఆయుధాలు సమకూర్చాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనే.! అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు పార్టీ ఫండింగ్ పై దృష్టి పెట్టారు. పూర్తిగా పారదర్శకంగా ఫండ్ రైజ్ చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా చూడాలని స్పష్టంచేశారు.

 

అధికార తెలుగుదేశం పార్టీకి డబ్బుల కొదువ లేదు. అధికారంలో ఉండడం, ఎంతోకాలంగా బలమైన పార్టీగా కొనసాగుతూ ఉండడంతో నగదు నిల్వలు బాగానే ఉంటున్నాయి. వైసీపీ కూడా టీడీపీకి ఏమాత్రం తీసిపోదు. టీడీపై సై అంటే సై అనేందుకు రెడీగా ఉంది. ఇక ఆ రెండు పార్టీలకు బలంగా పోటీ ఇవ్వాలంటే జనసేన కూడా గట్టిగా నిలబడక తప్పదు. అందుకే నిధుల సేకరణపైన దృష్టి పెట్టారు పవన్ కల్యాణ్. ప్రజల నుంచే ఈ నిధులను సేకరించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. అంతేకాక.. ప్రతి పైసాకూ లెక్క చెప్పాలని స్పష్టం చేశారు. గతంలో మిస్డ్ కాల్ ద్వారా పార్టీ సభ్యత్వం చేపట్టింది జనసేన. ఇప్పుడు విరాళాలకు కూడా అదే పద్ధతి అనుసరించాలని భావిస్తున్నారు.

 

ఇంటింటికీ వెళ్లి నేరుగా విరాళాలు సేకరించడం ఓ పద్ధతి. అదే సమయంలో అందరి ఇళ్లకీ వెళ్లలేరు కాబట్టి ఆన్ లైన్ సౌకర్యం కూడా తీసుకొచ్చింది. డొనేట్ ఫర్ జనసేన పేరుతో ఇప్పటికే పార్టీ యంత్రాంగం ఇంటింటికీ తిరుగుతోంది. మీరు ఓ చెయ్యి వెయ్యండంటూ విజ్ఞప్తి చేస్తోంది. అంతేకాక సోషల్ మీడియాను కూడా విస్తృతంగా వాడుకుంటోంది. జనసేనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోగలిగితే పార్టీకి తిరుగుండదు. అందుకే ఆన్ లైన్ ద్వారా ఫండ్ రైజ్ చేయడం ఈజీ అని పార్టీ భావించింది.

 

మరోవైపు పార్టీ శ్రేయోభిలాషులు ఎవరైనా ముందుకొచ్చి పండ్ ఇస్తామంటే తీసుకుంటోంది. ఇలా కొంతమంది పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహికులు ముందుకొచ్చారు. హైదరాబాద్, అమెరికాల్లో జనసేన విరాళాల సేకరణ క్యాంప్ లకు విపరీతమైన స్పందన వచ్చింది. ఇలాంటి ఈవెంట్స్ ను మరికొన్ని నిర్వహించేందుకు జనసేన ప్లాన్ వేస్తోంది. అంతేకాక.. పవన్ తో కలిసి డిన్నర్ చేసేలా స్పెషల్ మీట్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: