టీడీపీతో పొత్తుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన పవన్ కల్యాణ్!

Vasishta

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరి చూపూ జనసేనవైపే ఉంది. బీజేపీకి అనుకూలంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని ఇన్నాళ్లూ విమర్శించిన టీడీపీ.. ఇప్పుడు రూట్ మార్చింది. రాష్ట్రాభివృద్ధికోసం పవన్ తమతో కలసి రావాలని సాక్షాత్తూ చంద్రబాబే ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

 

వచ్చే ఎన్నికల్లో తాము వామపక్షాలతో తప్ప మరెవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు జనసేన పార్టీ ట్విట్టర్ లో ప్రకటన చేసింది. “ జనసేన పార్టీ 175 స్థానాల్లో సంపూర్ణంగా పోటీ చేస్తున్నాం. వామపక్షాలు తప్ప ఎవరితో కలసి వెళ్లము. యువతకు, మహిళలకు ఎక్కువ అవకాశం ఇస్తాం. దయచేసి అధికారపక్షం, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ముక్తకంఠంతో ఖండించండి” అని జనసేన పార్టీ ట్వీట్ చేసింది.

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొంతకాలంగా ఇదే మాట చెప్తున్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబమని క్లారిటీ ఇస్తున్నారు. వామపక్షాలతో కలిసి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చాలాసార్లు ప్రకటించారు. అయితే ఇటీవల చంద్రబాబు ప్రకటనతో కాస్త గందరగోళం నెలకొంది. రాష్ట్రాభివృద్ధికి పవన్ కల్యాణ్ కలసి వస్తే.. వైసీపీకి ఎందుకు కోపం అని చంద్రబాబు ప్రశ్నించారు. అంటే జనసేనను చంద్రబాబు వెనకేసుకొచ్చారు. దీంతో జనసేన పార్టీ మళ్లీ టీడీపీతో కలిసి వెళ్తుందేమోనని అనుమానాలు తలెత్తాయి.

 

చంద్రబాబు ఆహ్వానంతో వైసీపీ స్వరం పెంచింది. చంద్రబాబు – పవన్ ఇద్దరూ మంచి దోస్త్ లని తాము ముందునుంచి చెప్తున్నామని, ఇప్పుడు అదే రుజువైందని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు స్వరమే పవన్ కల్యాణ్ వినిపిస్తున్నారని, చంద్రబాబు ఇప్పుడు దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారని ఎద్దేవా చేసింది. దీంతో జనసేన పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి. చంద్రబాబుతో పవన్ కలసి వెళ్తారేమో.. అనే డౌట్ చాలా మందిలో వ్యక్తమవుతోంది. మొన్నటివరకూ చంద్రబాబుతో కలిసుండి.. ఆ తర్వాత బయటికొచ్చి.. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీతో కలిస్తే సరైన సిగ్నల్స్ వెళ్లవేమోననే భయం జనసేన శ్రేణుల్లో ఉంది. అందుకే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ జనసేన ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: