ఎడిటోరియల్ : రాజకీయ క్రీనీడకు పావుగా మారిన శబరిమల..!

Vasishta

శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు అర్హులేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేక పరిణామాలకు దారితీస్తోంది. 2018 సెప్టెంబర్ 28వ తేదీన సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. అప్పటి నుంచి శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఇద్దరు మహిళలు 2019 జనవరి 2వ తేదీన ఆలయంలోకి ప్రవేశించగలిగారు. ఇది కేరళలో అగ్గిరాజేసింది. చట్టానికి, సంప్రదాయానికి మధ్య పెద్ద యుద్ధానికే తెరతీసింది.


శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం ఎన్నో ఏళ్లుగా నిషేధం. మహిళల ప్రవేశం నిషిధ్ధానికి సంబంధించి కచ్చితమైన కారణాలేవీ తెలీదు కానీ.. ఎంతోకాలంగా ఇది ఆచారంలో ఉంది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న  మహిళలెవరూ ఆలయంలోకి ప్రవేశించడం లేదు. రుతుస్రావం జరిగే మహిళలు ప్రవేశించడం వల్ల అశుద్ధి అని భావించడం వల్లే మహిళలకు ప్రవేశం లేకుండా చేసి ఉండొచ్చనే వాదన కూడా ఉంది. కారణాలేవైతేనేం.. ఈ వయసున్న వాళ్లు అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు వీలు లేదు. అయితే స్త్రీపురుషులు సమానమేనంటూ కొంతమంది ఉద్యమకారులు అయ్యప్ప ఆలయంలోకి ఎందుకు ప్రవేశించకూడదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


పలు దఫాలుగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మహిళల ప్రవేశానికి ఆటంకం కలిగించే సహేతుకమైన కారణాలేవీ కనిపించడం లేదని తేల్చి చెప్పింది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆలయంలోకి వెళ్లొచ్చని స్పష్టం చేసింది. దీంతో అక్టోబర్ లో కొంతమంది మహిళా జర్నలిస్టులు ఆలయంలోకి ప్రవేశించేందుకు కృషి చేశారు. అయితే అయ్యప్ప భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. శబరిమల ఆలయ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న శబరిమల కర్మ సమితి ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం కానీ ఆలయంలోకి మహిళలను పోనిచ్చే ప్రసక్తే లేదని హెచ్చరించింది. దీంతో వారు తిరుగుముఖం పట్టక తప్పలేదు. ఆ తర్వాత రెహానా ఫాతిమా అనే మహిళ కూడా ప్రవేశించేందుకు ట్రై చేశారు. డిసెంబర్ లో తమిళనాడుకు చెందిన ఓ గ్రూపు సభ్యులు శబరిమలకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమించారు. పంబ బేస్ క్యాంప్ దాటుకుని వెళ్లగలిగారు.. కానీ ఆలయంలోకి వెళ్లలేకపోయారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో వెనుదిరగక తప్పలేదు.


కేరళలో వామపక్ష ప్రభుత్వం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టి తమ పని తాము చేస్తున్నామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్తున్నారు. అయితే హిందూ వ్యతిరేక వామపక్ష ప్రభుత్వం కావాలనే మహిళలను రెచ్చగొట్టి ఆలయంలోకి వెళ్లేలా ఉసిగొల్పుతోందని బీజేపీ విమర్శిస్తోంది.


అయ్యప్ప ఆలయంలోకి మహిళలు వెళ్లకూడదంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తునే ఉద్యమాలు జరుగుతున్నాయి. కేరళలో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. అయినా కేరళ ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలోనే లింగసమానత్వం పేరిట జనవరి 1వ తేదీన 620 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించింది. ఆ మరుసటిరోజే ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హిందూ వ్యతిరక ప్రభుత్వం కావడం వల్లే ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలకు విలువ ఇవ్వట్లేదని విపక్షాలు మండిపడుతున్నాయి.


తాజాగా ఇద్దరు మహిళల ప్రవేశం వెనుక ప్రభుత్వ హస్తం ఉందనేది హిందూవాదుల ఆరోపణ. అందుకే ఇద్దరు మహిళలు ప్రవేశించరని తెలియగానే కేరళ భగ్గుమంది. హిందూవాదులంతా రోడ్లపైకి వచ్చేశారు. సీపీఐ(ఎం) నేతలు, ఇళ్ళపై దాడులకు తెగబడ్డారు. ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే మళ్లీ కోర్టు జోక్యం తప్పదేమో. లేకుంటే ఇది ఇంతటితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. శబరిమలను రాజకీయంగా వాడుకునేందుకు పార్టీలు అత్యుత్సాహం చూపిస్తున్న క్రమంలో దీన్ని మరింత పెంచి పోషించడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: