అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ సాధ్యమా? మోదీ పాచిక పారుతుందా..?

Vasishta

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటివరకూ కులాలు లేదా మతాల ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు చెలామణీలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కులమతాలతో సంబంధం లేకుండా ఆర్థిక ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చేందుకు నిర్ణయించింది.


అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన బిల్లును రేపే పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. రేపటితో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. అయితే మరో రెండ్రోజులపాటు పార్లమెంటు సమావేశాలను అవసరమైతే పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల ముందు మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పలు సంచలనాలకు దారితీయడం ఖాయం.


దేశవ్యాప్తంగా ప్రస్తుతం 49.5 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి, ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలకు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. వీరంతా కులాలు లేదా మతాల ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్ల లబ్ది పొందుతున్నారు. అయితే తొలిసారిగా కులమతాలతో సంబంధం లేకుండా అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే రిజర్వేషన్లు 59.5 శాతానికి చేరతాయి.


ఎన్నికల ముందు విపక్షాలను కోలుకోలేని దెబ్బ తీయడానికి, వచ్చే ఎలక్షన్స్ లో లబ్ది పొందడానికే మోదీ ఈబీసీ రిజర్వేషన్ల అంశం తెరమీదకు తెచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే బిల్లు తీసుకొస్తే సరిపోదని, ఇది పార్లమెంటులో ఆమోదం పొంది చట్టరూపం దాల్చినప్పుడే ఉపయోగం ఉంటుందనేది వారు చెప్పే మాట. పార్లమెంటు సమావేశాలు ముగింపు దశలో హడావుడిగా కేబినెట్ దీన్ని ఆమోదించడం, చివరి రోజు పార్లమెంటు ముందుకు తీసుకురావాలనుకోవడం వెనుక ఎన్నికల్లో లబ్దిపొందే వ్యూహమే తప్ప.. దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే చిత్తశుద్ధి కనిపించడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: