పులివెందులలో టిడిపి అభ్యర్ధి ఎవరో తెలుసా ?

Vijaya

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధి ఫైలన్ అయ్యింది. ఇప్పటికే వైఎస్ ఫ్యామిలీపై నాలుగుసార్లు పోటీ చేసి ఓడిపోయిన సతీష్ రెడ్డినే మళ్ళీ ఐదోసారి కూడా పోటీలోకి దింపాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్ల జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేయటానికి సతీష్ తో పాటు ఎంఎల్సీ బిటెక్ రవి కూడా పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం సతీష్ వైపు మొగ్గు చూపారు. నిజానికి పులివెందుల నియోజకవర్గమన్నది పార్టీతో సంబంధం లేకుండా వైఎస్ కుటుంబం కంచుకోటలాగ తయారైంది. వైఎస్ ఉన్నంత కాలం వైఎస్ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

వైఎస్ కుటుంబం తరపున ఎవరు నామినేషన్ వేసినా గెలుపు ఖాయమే. అయితే 2009 ఎన్నికల్లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే వైఎస్ మరణించటం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వైఎస్ కుటుంబం కాంగ్రెస్ కు దూరమైంది. అయితే, కాంగ్రెస్ కు వైఎస్ కుటుంబం దూరమైనా నియోజకవర్గంలో జనాలు మాత్రం వైఎస్ కుటుంబంతోనే ఉండిపోయారు. అందుకే వైఎస్ మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో విజయమ్మ గెలిచారు. తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మళ్ళీ జగనే గెలిచారు. అంటే వైఎస్ కుటుంబానికి పులివెందులలో అంతటి పట్టుంది. అటువంటి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్ధిగా సతీష్ వైఎస్ రాజశేఖ రెడ్డి మీదే కాకుండా జగన్ మీద కూడా వరుసగా నాలుగుసారి పోటీ చేసి ఓడిపోయారు.

 

సరే రేపటి ఎన్నికల్లో కూడా ఇక్కడ జగన్ నామినేషన్ వేయటమన్నది ఏదో లాంఛనమనే అనుకోవాలి. అదే విధంగా టిడిపి కూడా పోటీ చేయాలి కాబట్టి పోటీ చేస్తోందని భావించాలి. అంతేకానీ ఏదో అద్భుతం జరిగిపోతుందనో లేకపోతే సతీష్ అఖండి మెజారిటీతో గెలుస్తారనో అనుకోవటం లేదు. పోయిన ఎన్నికల్లో జగన్ కు 124576 ఓట్లొస్తే టిడిపి అభ్యర్ధి సతీష్ రెడ్డికి 49333 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, టిడిపి వాదన ఏమిటంటే జిల్లాకు, పులివెందుల నియోజకవర్గానికి సాగు, తాగు నీళ్ళిచ్చాం కాబట్టి జనాలు తమనే గెలిపిస్తారని అనుకుంటున్నారు. గండికోట లాంటి ప్రాజెక్టుల నుండి టిడిపి నీళ్ళు విడుదల చేసింది నిజమే. కానీ ఆ ప్రాజెక్టు పనుల్లో అత్యధికం వైఎస్ హయాంలోనే పూర్తయిపోయాయన్న విషయం కూడా అంతే వాస్తవం. మరి జనాలు ఎవరికి ఓట్లేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: