జనసేనకు 115...వామపక్షాలకు 60 సీట్లు ?

Vijaya

ఇది స్ధూలంగా జనసేన, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్చలు. రాబోయే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ఎన్నికలు ఎటూ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా. అందుకనే విజయవాడ జనసేన పార్టీ కార్యాలయం, పవన్ ఇంట్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు మొదలయ్యాయి. వామపక్షాల కార్యదర్శులు మధు, రామకృష్ణలు ముందుగా పార్టీలో కీలక నేత నాదెండ్ల మనోహర్ తో చాలాసేపు మాట్లాడారు. తర్వాత ముగ్గురు కలిసి పవన్ ఇంటికి వెళ్ళి రెండో రౌండు చర్చలు జరిపారు.

 

రాబోయే ఎన్నికల్లో తమకు 60 అసెంబ్లీ సీట్లు కేటాయించాలని వామపక్షాల కార్యదర్శులు ప్రతిపాదనను పవన్ ముందుంచినట్లు సమాచారం. తాము కోరుకుంటున్న 60 సీట్లలో రాయలసీమ, ఉత్తరాంధ్రలోనే 30 సీట్లు కేటాయించాలని కోరారట. మరి పవన్ స్పందన ఏమిటో స్పష్టంగా తెలియలేదు. ఏ ఉద్దేశ్యంతో తమకు 60 సీట్లు కావాలని వామపక్షాలు కోరాయో తెలీదు కానీ పవన్ గనుక నిజంగా ఒప్పేసుకుంటే ఇబ్బంది పడటం ఖాయం. నిజానికి మూడు పార్టీలకు కూడా మొత్తం 175 సీట్లలో పోటీ చేసేంత సీన్ లేదు. కాకపోతే మూడు పార్టీలకు ఓ వెసులుబాటుంది.

 

 అదేమిటంటే, పవన్ కు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారు. కాబట్టి టిక్కెట్లు ఇవ్వటానికి మనుషులకు కొదవలేదు. అలాగే, వామపక్షాలకు ప్రతీ జిల్లాలోను క్యాడర్ ఉంది. కాబట్టి నామినేషన్లు వేయటానికి అభ్యర్ధులు దొరకరనే సమస్య లేదు. అయితే, ప్రత్యర్ధి పార్టీలైన తెలుగుదేశం, వైపిపిలతో పోటీ పడగలిగిన బలమైన అభ్యర్ధులు దొరుకుతారా అంటే ఉండరనే చెప్పాలి. పవన్ లెక్క ప్రకారం 60 శాతం సీట్లు కొత్తవారికి కేటాయిస్తారట.  20 శాతం  సీనియర్లకు ఇక మిగిలిన 20 శాతం సీట్లు విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారికి కేటాయిస్తారట. అదేంటో 20 శాతం విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారికి అంటే 80 శాతం శాతం సీట్లు విలువలు లేని వారికి కేటాయిస్తున్నట్లే కదా ?

 

సరే, పవన్ ఏ ఉద్దేశ్యంతో చెప్పినా గట్టి అభ్యర్ధులు ఎంతమంది పోటీలో దిగబోతున్నారంటే చెప్పటం కష్టమే. అదే విధంగా వామపక్షాల పరిస్ధితి కూడా అంతే. కాకపోతే ప్రతీ నియోజకవర్గంలోను కొద్దో గొప్పో క్యాడర్ ఉంది కాబట్టి జనసేన అభ్యర్ధులకన్నా బెటర్ ఛాయిసే ఉండవచ్చు. ఇది స్ధూలంగా మూడు పార్టీల పరిస్ధితి. కాబట్టి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా విడివిడిగా పోటీ చేసినా ఫలితాలు మాత్రం ఆశించినంతగా ఉండవనటంలో సందేహం లేదు. మరి ఏ దామాషాలో సీట్ల సర్దుబాటు చేసుకుంటాయో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: