జగన్‌.. ఈ ఐడియా మహేశ్‌ భరత్ అనే నేను నుంచే కాపీ కొట్టారా..?

Chakravarthi Kalyan
ఆ మధ్య కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన మహేశ్ బాబు సినిమా భరత్ అనే నేను గుర్తుండే ఉంటుంది. అందులో మహేశ్ బాబు గ్రామస్వరాజ్యం ఐడియా ప్రజలకు బాగా నచ్చింది. ఒక్కో గ్రామానికి కావలసినంత బడ్జెట్ ఇస్తే ఆ గ్రామం తనకేం కావాలో ప్లాన్ చేసుకుంటుందన్నది ఆ ప్లాన్..



ఇప్పుడు వైఎస్ జగన్ కూడా అదే బాటలో ఆలోచిస్తున్నట్టున్నారు. పాదయాత్ర ముగింపు సభలో జగన్ చెప్పిన మాటలను చూస్తే ఆయన కూడా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశం మీద జగన్‌కు పక్కా ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామ సచివాలయం కాన్సెప్టును అమలు చేస్తానంటున్నారు.



ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్‌ తీసుకువస్తానని... ఆ గ్రామంలో చదువుకున్న పది మందికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు జగన్. పేదవాడికి ఏ అవసరం ఉన్నా కూడా, ఏ పథకం కావాలన్నా..నవరత్నాలు కావాలన్నా గ్రామ సెక్రటెరియట్‌ ద్వారా అందజేస్తామంటున్నారు. పథకాల అమలులో అర్హతలు మాత్రమే చూస్తామని, కులాలు, మతాలు, రాజకీయాలు చూడమని చెబుతున్నారు.



ప్రతి పథకం ఇంటికే వెళ్లే దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తారట. వారికి రూ.5000 జీతం ఇస్తారట. ప్రతి పథకంతో పాటు ఇంటికే రేషన్‌ బియ్యం వచ్చేలా ఏర్పాటు చేస్తామని జగన్ చెబుతున్నారు. పథకాల కోసం ఎవరి చుట్టూ తిరుగకుండా, ఎవరికి లంచాలు ఇవ్వకుండానే నేరుగా సంక్షేమ పథకాలు మీ ఇంటికే వచ్చేలా చేస్తామంటున్నారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: