ఎడిటోరియల్ : విజయసాయి అనుకుంటే అంతే...

Vijaya

ప్రధాన ప్రతిపక్షం వైసిపిలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇఫ్పటి వరకూ ఇతర పార్టీల్లో నుండి వైసిపిలో చేరిన నేతల్లో చాలామంది విజయసాయి ద్వారానే పార్టీలోకి వచ్చారంటేనే ఆయన ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో అర్ధమైపోతోంది. అటువంటిది తాజాగా విజయసాయి మరోసారి  కీలక పాత్ర పోషించారట. దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబం తొందరలో వైసిపిలో చేరబోతోందని చంద్రబాబునాయుడు మీడియానే చెప్పింది. ఇక్కడ కుటుంబం అంటే ప్రస్తుతానికి దగ్గుబాటి దంపతుల కొడుకు హితేష్ చెంచురామ్ మాత్రమే సుమా.

 

 

నిజానికి దగ్గుబాటి కుటుంబం వైసిపిలో చేరబోతన్నారనే ప్రచారం ఈనాటికి కాదు. చాలా కాలంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే చంద్రబాబు మీడియాలో వచ్చిందంటే తొందరలో జరగబోతున్నట్లే అనే అనుకోవాలి. రాబోయే ఎన్నికల్లో చెంచురామ్ ప్రకాశం జిల్లాలోని పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారట వైసిపి తరపున. పురంధేశ్వరి మాత్రం బిజెపిలోనే ఉంటరాట. మరి ఇంత చెప్పిన చంద్రబాబు మీడియా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏం చేయబోతున్నదీ మాత్రం చెప్పలేదు లేండి.

 

దగ్గుబాటి ఫ్యామిలీని వైసిపిలోకి తేవటానికి జిల్లాలోని సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి అండ్ కో ప్రయత్నాలు చేశారట. కానీ విజయసాయి రంగంలోకి దిగిన తర్వాత మాత్రమే దగ్గుబాటి కుటుంబం వైసిపిలో చేరిక ఖాయమైందట. కొడుకు వైసిపి తరపున పోటీ చేస్తుంటే తల్లి పురంధేశ్వరి మాత్రం బిజెపిలో ఉండి ఏం చేస్తారు ? బిజెపీకేమో రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. అటువంటి పార్టీ తరపున పోటీ చేస్తే పురంధేశ్వరికి డిపాజిట్ కూడా వచ్చేది అనుమానమే. తెలంగాణా ఎన్నికల్లో పార్టీ పరిస్ధితేంటో చూసిన తర్వాత కూడా ఇంకా పురంధేశ్వరి బిజెపి తరపున పోటీ చేస్తుందంటే నమ్మేవాళ్ళెవరూ లేరు.

 

ఇక విజయసాయి విషయం తీసుకుంటే నెల్లూరులోనే ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరుగా ప్రచారంలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా విజయసాయితో మాట్లాడిన తర్వాతే  వైసిపిలో చేరారు.  వేమిరెడ్డి కోరుకున్నట్లే, విజయసాయి హామీ ఇచ్చినట్లే జగన్ కూడా వేమిరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇక, ప్రకాశం జిల్లాలోని కందుకూరులో కూడా మాజీ మంత్రి మానుకోట మహీధర్ రెడ్డి, విశాఖపట్నంలోని పెద్ద బిల్డర్ సత్యనారాయణ, విశాఖపట్నం జిల్లాలో అరకులో ఓ కాంగ్రెస్ నేత ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు విజయసాయితో మాట్లాడిన తర్వాతే వైసిపిలో చేరారు.

 

రాష్ట్రస్ధాయిలోనే కాకుండా ఢిల్లీ స్ధాయిలో కూడ విజయసాయిరెడ్డి మంత్రాంగంపైనే జగన్ ఆధారపడ్డారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. జాతీయ స్ధాయిలోని ప్రతిపక్షాల అధినేతలు జగన్ విషయంలో సానుకూలంగా ఉన్నారంటే అందుకు రాజ్యసభ సభ్యుడే ప్రధాన కారణమనటంలో సందేహం అవసరం లేదు. అంతెందుకు చంద్రబాబునాయుడు కూడా ప్రధానిని కలుసుకోవటం కష్టంగా ఉన్న రోజుల్లోనే జగన్ తేలిగ్గా కలవగలిగే వారంటే అందుకు విజయసాయే కారణం. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విజయసాయి పాత్ర మరింత కీలకమైపోతోదనటంలో సందేహం అవసరం లేదు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: