అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం: 31న కీలక ఘట్టం..!

Chakravarthi Kalyan
అమరావతిలో నిర్మించనున్న శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన కీలక ఘట్టానికి ముహూర్తం కుదిరింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి జనవరి 31వ తేదీన భూకర్షణం, బీజావాపనం కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తిరుపతి తిరుమల దేవస్థానం ప్రకటించింది. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ స్థలంలో భూకర్షణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌.. జెఈవో పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌జెట్టితో కలిసి పరిశీలించారు.



జనవరి 31న ఉదయం 9.15 నుండి 9.40 గంటల మధ్య భూకర్షణ కార్యక్రమం జరుగనుందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి రానున్నారని అనిల్‌ సింఘాల్ తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం ఆగమశాస్త్రం ప్రకారం భూకర్షణ చేయడం ఆనవాయితీ అని, ఆగమ సలహాదారుల సూచన మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. సిఆర్‌డిఏ 25 ఎకరాలు టిటిడికి కేటాయించిందని, ఇందులో 5 ఎకరాల్లో శ్రీవారి ఆలయం, మిగిలిన 20 ఎకరాల్లో ఆడిటోరియాలు, కల్యాణమండపాలు తదితర నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని అనిల్‌ సింఘాల్ వివరించారు.

భూకర్షణంలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. భూకర్షణం తరువాత 10 రోజుల పాటు అర్చకులు ఆగమోక్తంగా వైదిక కార్యక్రమాలు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆ తరువాత ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయిదాదాపు రూ.140 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టేందుకు టిటిడి ధర్మకర్తల మండలి టెండర్లు ఖరారు చేసింది. గత ఏడాది జులైలో టిటిడీ కురుక్షేత్రలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టింది. ఇక్కడ రోజువారీగా వెయ్యి నుండి 2 వేల మంది, ఉత్సవాల రోజుల్లో 10 వేల నుండి 15 వేల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. జనవరి 27న కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ విగ్రహప్రతిష్ఠ, మహాకుంభాభిషేకం నిర్వహిస్తారు.



మార్చి 13న హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామని టీటీడీ ఈవో తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేశామన్నారు. విశాఖపట్నం, భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయాలతోపాటు చెన్నైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు. భూకర్షణం కోసం హోమగుండాలు, వేదిక, సిఆర్‌డిఏ స్టాళ్లు, ఆలయ నమూనా ఎగ్జిబిషన్‌, ప్రత్యక్ష ప్రసారాలు, డిస్‌ప్లే స్క్రీన్లు తదితర ఏర్పాట్లపై అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: