ఎడిటోరియల్ : ప్రత్యేకహోదాకు కాంగ్రెస్ అడ్డం తిరిగిందా ? చంద్రబాబుపై అనుమానం

Vijaya

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి అడ్డం తిరిగారా ? చంద్రబాబునాయుడు తాజా నిర్ణయంతో అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. దశాబ్దాల శతృత్వానికి స్వస్ధిపలికి తెలుగుదేశంపార్టీ కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయం అందరు చూసిందే. తెలంగాణా ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కెసియార్ ముందు బోర్లా పడ్డాయన్నది వేరే సంగతి. అప్పట్లో కాంగ్రెస్ తో పొత్తుల విషయాన్ని చద్రబాబు మాట్లాడుతూ, ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పారు కాబట్టే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకున్నట్లు చెప్పారు. అప్పటికేదో రాష్ట్రప్రయోజనాల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమనే బిల్డప్ ఇచ్చి.

 

ఏపికి ప్రత్యేకహోదా కోసం తెలంగాణా ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పటమే విచిత్రం. ఏపి ప్రయోజనాల కోసమే తెలంగాణాలో పొత్తు పెట్టుకున్న మాట నిజమే అయితే, మరి ఏపి ఎన్నికల్లో మాత్రం ఎందుకు విడిపోయినట్లు ? రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే చంద్రబాబు లెక్కేసుకుంటే కాంగ్రెస్ తో ఏపిలో కూడా పొత్తు పెట్టుకునే పోటీ చేయాలి కదా ? మరి ఏపి ఎన్నికల్లో మాత్రం ఎందుకు రెండు పార్టీలు విడిపోయాయి ? ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో రాహూల్ ఏమన్నా అడ్డం తిరిగారా ? అంటే ఇక్కడ మ్యాటర్ వెరీ క్లియర్. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు లేదు వంకాయ లేదు.

 

తెలంగాణాలో కాంగ్రెస్, చంద్రబాబుకు కెసియార్ ఉమ్మడి శతృవు. కెసియార్ ను దెబ్బ కొట్టాలంటే చంద్రబాబు వల్ల జరగని పని. అందుకనే కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఇద్దరు కలిసి కెసియార్ ను సిఎం పీఠం నుండి దింపేయొచ్చని అంచనా వేసుకునే చంద్రబాబు పావులు కదిపి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారన్నది వాస్తవం. కాకపోతే ప్రత్యేకహోదా, కాంగ్రెస్ తీర్మానం అన్నది పొత్తు పెట్టుకోవటానికి ఓ షుగర్ కోటింగ్ మాత్రమే.


నిజానికి ప్రత్యేకహోదా డిమాండ్ ఇప్పటికీ సజీవంగా ఉందంటే వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డే అన్న విషయం అందరికీ తెలిసిందే. హొదా అన్నది జనాల్లో ఓ సెంటిమెంటుగా నిలిచిపోయిందని గ్రహించిన తర్వాతే చంద్రబాబు అనేక పిల్లిమొగ్గల తర్వాత చివరకు హోదా డిమాండ్ దగ్గర ఆగిపోయారు. అదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా గ్రహించిన తర్వాతే రాష్ట్రంలో పరిస్ధితులు రాహూల్ కు వివరించారు. ఆ తర్వాతే హోదాపై సిడబ్యుసి సమావేంలో రాహూల్ లో తీర్మానం చేయించారు. అదే సమయంలో బిజెపితో కటీఫ్ అయిపోయిన చంద్రబాబు వెంటనే కాంగ్రెస్ తో చట్టా పట్టాలేసుకున్నారు.


తెలంగాణాలో ఇద్దరూ కలిసినా పప్పులుడకలేదు. తెలంగాణాలో ఓడిపోయినా చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ లేదు. అందుకనే అపవిత్ర కలయికైనా కాంగ్రెస్ తో ధైర్యంగా పొత్తులు పెట్టుకున్నారు. అదే ఏపి విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో గెలుపన్నది చంద్రబాబుకు చావో రేవోగా మారింది. జగన్ గెలిస్త చంద్రబాబు పని గో.....వింద. కాంగ్రెస్-టిడిపిల అపవిత్ర కలయికను తెలంగాణాలో జనాలు ఛీత్కరించిన నేపధ్యంలో ఏపిలో  కాంగ్రెస్ ను దూరంగా పెట్టేశారు. తెలంగాణాలో చంద్రబాబు విన్యాసాలను ఏపి జనాలు చూడకుండానే ఉంటారా ? రాబోయే ఎన్నికల్లో ఏపి జనాలు ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: