ఏ పార్టీలో కి వెళ్ళేది లేదని తేల్చి చెప్పేసిన పురందేశ్వరి..!

KSK
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆంధ్ర రాజకీయ ముఖచిత్రం క్షణక్షణానికి మారిపోతుంది. ముఖ్యంగా ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావు మరియు ఆయన కుమారుడు హితేష్ హైదరాబాద్ నగరంలో వైసిపి పార్టీ అధినేత జగన్ ని కలవడంతో ఆంధ్ర రాజకీయాల్లో అనేక చర్చలు మొదలయ్యాయి.


ముఖ్యంగా తన భర్త మరియు కుమారుడు వైసిపి పార్టీలోకి వెళ్లడంతో బిజెపి పార్టీకి చెందిన పురందేశ్వరి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు అనేక కామెంట్లు వినబడ్డాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీ తరఫున ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్‌ పోటీ చేస్తారని వెంకటేశ్వర్‌రావు మీడియాకు వెల్లడించారు.


దీంతో పురందేశ్వరి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ అల్కాపురీలో జరిగిన ఓప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. బిజెపి అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీచేస్తానని చెప్పారు. తాను ఏపార్టీలోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు.


పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. 2014ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పురందేశ్వరి పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే మరోపక్క ఎన్నికలు చివరినాటికి లెక్కలు మారుతాయని కచ్చితంగా పురందేశ్వరి పార్టీ మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని మరికొంతమంది నేతలు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: