నుమాయిష్ కన్నీరే మిగిల్చింది!

siri Madhukar
తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నగరంలోని చారిత్రాత్మక ఎగ్జిబిషన్ నూమాయిష్ ఏర్పాటు చేస్తుంటారు.  పేద, ధనిక అనే తేడా లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా మార్కెటింగ్ చేస్తుంటారు.  నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గత రాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం ఏర్పడింది. రాత్రి, 2 గంటల వరకూ కూడా మంటలు అదుపులోకి రాలేదంటే ఎంత భారీ ప్రమాదం జరిగిందో ఊహించుకోవచ్చు. ఎగ్జిబిషన్ లో మొత్తం 2,500 స్టాల్స్ ఉండగా, 175 స్టాల్స్ లో ఒక్క చిన్న వస్తువు కూడా మిగల్లేదు. మరో 225 స్టాల్స్ పాక్షికంగా దహనమయ్యాయి. అనుకోని సంఘటనతో షాపు యజమానులు తేరుకునే లోగా అనార్థం జరిగిపోయింది.

వందలాది మంది ఉత్తర భారతీయులు ఏర్పాటు చేసుకున్న స్టాల్స్ చూస్తుండగానే బూడిదయ్యాయి. దీంతో ఆ స్టాళ్ల యజమానులు బోరున విలపించారు. దగ్ధమైన స్టాళ్లలో చేనేత, దుస్తులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, చెప్పుల స్టాల్స్ అధికంగా ఉన్నాయి. కాగా,  నుమాయిష్, అజంతాగేట్ వద్ద నిలిపివున్న ఫైర్ ఇంజన్ కు సమాచారం అందింది. అయితే, వారు తమ పై అధికారులకు విషయం చెప్పడం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఎందుకంటే, వారివద్ద ఉన్న ఫైర్ ఇంజన్ లో నీరు లేదట.

నీరు లేని ఫైర్ ఇంజన్ ను ఎగ్జిబిషన్ లోపల నిలిపివుంచారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ వర్తకం చేసుకోవాలని వచ్చిన తమకు ఇప్పుడు భారీ నష్టం జరగడం కన్నీరు, నష్టాలు మిగిల్చిందని వ్యాపారస్తులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  ప్రభుత్వం దీని విషయం పట్టించుకొని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.   

ఎగ్జిబిషన్ నిర్వహన సమయంలో  తమవద్ద నుంచి అద్దెలు, కరెంట్ బిల్లుల పేరిట లక్షల రూపాయలు దోచుకుంటున్న నుమాయిష్ నిర్వాహకులు, ఇప్పుడు నష్టాన్ని భరించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు వ్యాపారస్తులు.  కాగా నాంపల్లి ఎగ్జిబిషన్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది..దుకాణాల నిర్వాహకులను ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: