వీసా స్కామ్..! తెలుగు విద్యార్థులు బయటపడేదెలా..?

Chakravarthi Kalyan

అమెరికాలో స్థిరపడాలన్న తపనతో తప్పుదారి పట్టిన తెలుగు విద్యార్థులు అమెరికాలో అల్లాడుతున్నారు. అక్కడి ప్రభుత్వం సృష్టించిన నకిలీ యూనివర్శిటీలో దళారులను నమ్మి.. తప్పుడు పత్రాల ఆధారంగా చేరిన భారతీయ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారుఇప్పటికే ఎనిమిది మంది వరకూ తెలుగు దళారులను పోలీసులు అరెస్టు చేశారు.



వీరి ద్వారా ఫేక్ యూనివర్సిటీలో చేరిన దాదాపు 600 మంది తెలుగు విద్యార్ధులు ఈ స్కామ్‌లో ఇరుక్కున్నారు. అసలు ఈ స్కామ్ కు దారి తీసిన పరిస్థితులేంటి.. ఓ సారి పరిశీలిద్దాం.. ఇండియా నుంచి ఏటా దాదాపు 2 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా చదువు కోసం వెళ్తున్నారు. వీరిలో దాదాపు సగం మంది వరకూ తెలుగు వారే ఉండటం విశేషం.



ఇలా అమెరికా వెళ్లిన వారు అక్కడ యూనివర్సీటీల్లో చదువు పూర్తయిన ఏడాది నుంచి రెండేళ్లపాటు ఆప్షనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో ఉండే వీలుంది. ఈ సమయంలోనే మన విద్యార్థులు అక్కడ ఉద్యోగాలు సంపాదించి హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నిస్తుంటారు.



అలా ఉద్యోగాలు దొరక్క హెచ్ 1 వీసా దొరకని విద్యార్థులు వెంటనే ఇండియాకు రావాల్సి ఉంటుంది. కానీ డాలర్ల వేటలో అమెరికా వెళ్లిన మన విద్యార్థులుకు వట్టి చేతులతో ఇండియా రావాలంటే మనసు ఒప్పదు. అందుకే అమెరికాలో కంటిన్యూ అయ్యేందుకు మరో యూనివర్శిటీలో చేరి మళ్లీ చదువు కొనసాగిస్తుంటారు.



సరిగ్గా ఇక్కడే.. విద్యార్థులు తెలిసో తెలియకో తప్పుదోవపడుతున్నారు. తప్పడు యూనివర్శిటీల్లో చదువుతున్నామని తప్పుడు పత్రాలు చూపిస్తున్నారు. ఇలా అక్రమంగా దేశంలో ఉంటున్నవారి పట్ల అమెరికా ఇటీవల కఠిన వైఖరి అవలంభిస్తోంది. అందుకే ఫేక్ యూనివర్శిటీ పేరుతో స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఇలాంటి వారి ఆటకట్టిస్తోంది.



ఇప్పుడు జరిగింది అదే.. దీనివల్ల తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు ఏపీ ఎన్నార్టీ సంస్థ ప్రతినిధులు. ఈ ఉదంతం వల్ల దళారీలపై చర్యలు తప్పవని.. కానీ విద్యార్థులను మాత్రం ఇంటికి పంపేస్తారని అంతకు మించి కేసుల్లో బుక్ చేసి శిక్షించే అవకాశాలు ఉండవని చెబుతున్నారు.



మరి ఈ ఉదంతంలో తప్పెవరిది.. అమెరికా వస్తున్న మన విద్యార్థులనే మోసగిస్తున్న మన దళారులదేనా.. తప్పు అని తెలిసీ ఫేక్ యూనివర్సిటీల్లో చదువుతున్న మన విద్యార్థులదా.. ఇలాంటి విషయాల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేకపోతున్న తల్లిదండ్రులదా..?



ఏదేమైనా సరే.. అమెరికా వెళ్తున్నామంటే అక్కడి చట్టాలపై అవగాహన ఉండాలి.. సరైన పద్దతుల్లోనే అమెరికాలో స్థిరపడేలా ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం అక్కడ ఇబ్బంది పడుతున్న మన విద్యార్థులను క్షేమంగా బయటపడేందుకు అమెరికాలోని తెలుగు సంస్థలు చొరవ తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: