ఓటుకు నోటు కేసు వల్లే ఏపికి అన్యాయం

Vijaya

ఓటుకునోటు కేసులో ఇరుక్కోవటం వల్లే కేంద్రం ఏపికి అన్యాయం చేస్తున్నా చంద్రబాబునాయుడు మాట్లాడలేకపోతున్నారా ? అవుననే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపి ప్రయోజనాల విషయంలో ఒక్కటంటే ఒక్క నిర్ణయం కూడా లేదు. అదే విషయాన్ని జగన్ మాట్లాడుతూ, ఓటుకునోటు కేసులో ఇరుక్కున కారణంగానే కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా చంద్రబాబు నోరెత్తలేకున్నట్లు మండిపడ్డారు. ఒక చేతకాని వ్యక్తి ముఖ్యమంత్రయితే రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయో తెలియటానికి చంద్రబాబే ఉదాహరణగా చెప్పారు. కేంద్ర, రాష్ట్రంలోని పెద్దలు జనాలను మోసం చేయటంలో పోటీ పడుతున్నట్లు ఎద్దేవా చేశారు.


నాలుగేళ్ళుగా కేంద్రం ఏపికి అన్యాయం చేస్తున్నా చంద్రబాబు ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తున్నారే కానీ ఒక్కమాట కూడా గట్టిగా అనలేకపోతున్నట్లు తెలిపారు. కేంద్రం చెప్పినట్లు తలూపటమే కానీ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించలేదని చంద్రబాబును జగన్ విమర్శించారు. హోదా కోసం తాము అసెంబ్లీలో డిమాండ్ చేస్తే ప్రవిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు జగన్. నాలుగేళ్ళు కేంద్రంలో మంత్రులుగా ఉన్న టిడిపి ఎంపిలు రాష్ట్రానికి సాధించేందేమిటో చెప్పాలని నిలదీశారు.

 

ప్రధానికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానాలు చేయించిన సిఎం ఇపుడు కేంద్రాన్ని విమర్శిస్తే ఎవరైనా నమ్ముతారా ? అంటూ ప్రశ్నించారు. కేంద్రం తప్పుదోవ పట్టిస్తోందని తాము అసెంబ్లీలోనే చెబితే తమను నానా మాటలు అన్నది చంద్రబాబు కాదా అంటూ నిలదీశారు. ప్రజలను మోసం చేయటంలో కేంద్ర, రాష్ట్ర పెద్దలు పిహెచ్ డీ తీసుకున్నట్లు జగన్ ఎద్దేవా చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను చంద్రబాబు, మోడి ప్రలోభాలకు గురిచేయటం చూస్తుంటే సిగ్గేస్తోందన్నారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: